Suryaa.co.in

Andhra Pradesh Entertainment

జనసేనాని బాట… కుటుంబ సభ్యుల చేయూత

* కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం
* జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసి చెక్కులు అందించిన కుటుంబ సభ్యులు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబం మరోసారి పెద్ద మనసు చాటుకుంది. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో రూ. 35 లక్షలు విరాళం అందించారు. సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి ఈ మొత్తాన్ని కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. “మేము ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుకోం. కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో నేను ఉన్నత స్థానానికి వెళ్లాలని

కోరుకుంటారు తప్ప… రాజకీయాల గురించి నాతో చర్చించరు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చూసి, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల దయనీయ స్థితి గురించి తెలుసుకొని కదిలిపోయారు. వారి బిడ్డల భవిష్యత్తుకు ఎంతోకొంత అండగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి ఆర్ధిక సాయం అందించారు. కథానాయకులు వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు అందించారు.

వీళ్ళు రాజకీయంగా తటస్థంగా ఉంటారు. రైతుల కష్టాలకు చలించిపోయారు. వీరిలో సేవా దృక్పథం ఉంది. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే వృద్ధాశ్రమాన్ని నిర్మించాడు. ఓ పాఠశాలకు తన వంతు అండగా నిలిచి సేవ చేస్తున్నాడు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు స్వచ్చంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటు ఇస్తూ సామాజిక సేవల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల స్థితిగతులు, వారి బిడ్డలు చదువులకు ఇబ్బందులుపడుతున్న విషయం తెలుసుకొని స్పందించారు. వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. మా అక్క విజయదుర్గ, వారి పిల్లలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అన్నయ్య నాగబాబు, వదిన పద్మజ, వారి పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక, చెల్లెలు డాక్టర్ మాధవి,Family-members-of-Pawan-Kalyan-donated-35-lakh-to-support-the-families-of-tenant-farmers-detailsa బావగారు డాక్టర్ పి.ఎస్.రాజు , పెదనాన్న అబ్బాయి ప్రముఖ టీవీ నిర్మాత శ్రీనాథ్ పెద్ద మనసుతో ఆర్ధిక సాయం అందించారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్పందించి ముందుకు వస్తున్నారు. ఈ మధ్య ఒక చిన్న పాప తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ చిన్నారి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు.

* కలసికట్టుగా ముందుకు రావడం గొప్ప విషయం : నాదెండ్ల మనోహర్ 
సాగు నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొని సర్వం కోల్పోయిన కౌలు రైతుల కుటుంబాల కోసం నిలబడాలనే గొప్ప ఉన్నత ఆశయంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ముందుకు రావడం గొప్ప విషయమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కేవలం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారి బిడ్డల భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు చదివించాలనే గొప్ప లక్ష్యాన్ని పవన్ కళ్యాణ్ నిర్దేశించుకోవడం గొప్ప విషయం. ఆయన దీనికోసం ముందుగా రూ.5 కోట్లను ప్రత్యేక నిధికి విరాళంగా ఇస్తే, ఆయన బాటలోనే వారి కుటుంబసభ్యులు సైతం నడవడం ఎందరికో స్ఫూర్తి నింపుతుందన్నారు. పది మంది కడుపు నింపే రైతు కష్టాలను తమ కష్టంగా భావించి, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు” అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు , ఆయన సతీమణి పద్మజ , డా.మాధవి , ఆమె భర్త డాక్టర్ రాజు , ప్రముఖ టీవీ నిర్మాత శ్రీనాథ్ రూ.35 లక్షల చెక్కులను నాదెండ్ల మనోహర్ కి అందచేశారు.

LEAVE A RESPONSE