ఆంధ్రాలో ఆర్ధిక ప్రమాద ఘంటికలు

– కాగ్ నివేదిక రాష్ట్ర ఆర్ధిక అనారోగ్యసూచిక
– ఆర్ఠిక సంక్షోభంపై నా అంచనా నిజమైంది
– బీజేపీ నేత లంకా దినకర్
కేంద్ర ఆర్థికశాఖ నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాల విషయానికొస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తం మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ 45% లక్ష్యాన్ని చేరుకోలేదని బిజెపి పొలిటికల్ ఫీడ్‌బ్యాక్ బ్యాక్ డిపార్ట్‌మెంట్ హెడ్ లంకా దినకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 31,119.38 కోట్ల మూలధన వ్యయంను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 బడ్జెట్ లో ప్రతిపాదించింది.
కాని రెండవ త్రైమాసికంలో లక్ష్యంగా పెట్టుకున్న మూలధన వ్యయాన్ని ఖర్చు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆదాయాన్ని సంపాదించే ఆస్తులను సృష్టించే పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అనుమతించిన అదనపు రుణాన్ని పొందేందుకు అర్హత సాధించడంలో విఫలం చెందిందని వ్యాఖ్యానించారు. మొదటి త్రైమాసికంలో అంచనా మూలధన వ్యయంలో 15% ఖర్చు చేయాలన్న లక్ష్యం సాధించబడినప్పటికీ, ఆర్థిక అంశాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతికూల విధానాల కారణంగా రెండవ త్రైమాసికంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
నా పత్రికా ప్రకటనలో జూలై నెలలో కాగ్ నివేదికను పరిశీలించిన తర్వాత, బడ్జెట్ ఆదాయాలు, అప్పులు మరియు మూలధన వ్యయాల బడ్జెట్ లక్ష్యాలు మరియు వాస్తవాలకు సంబంధించి రాష్ట్ర పరిస్థితి గురించి, నేను రెండు నెలల క్రితమే రెండవ త్రైమాసికంలో మూలధన వ్యయం 45% లక్ష్యం సాధించడం దుర్లభం అన్న సందేహం నేడు వాస్తవం అయ్యింది.
సరైన పరిపాలన విధానాలు రాష్ట్రంలో లేని కారణంగా ఆర్థిక వనరుల రాబడి క్షీణించినందున రెండవ త్రైమాసిక మూలధన వ్యయం లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించడం సాధ్యం కాలేదు. సెప్టెంబర్ నెల కాగ్ నివేదిక ప్రకారం, మూలధన వ్యయం బడ్జెట్ ప్రకారం మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 31,119.38 కోట్లలో మొదటి రెండు త్రైమాసికాల్లో సెప్టెంబర్ వరకు 45% అంటే సుమారు 14,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉండగా, కేవలం 21.51% వరకు 6,711.60 కోట్లు మాత్రమే వెచ్చించబడ్డాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మొత్తం ఆదాయాలు మరియు అప్పులు తో వినియోగంలోకి రావలసిన వనరులు అవినీతి విధానాలతో అనుత్పాదక మరియు చట్టవిరుద్ధమైన ఖర్చులకు వినియోగిస్తూ, ఉత్పాదక బడ్జెట్ కేటాయింపులకు అందించబడకపోవడంతో రాష్ట్రంలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది.
ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నాటికి చేసిన మొత్తం అప్పులు రూ. 39,914.18 కోట్లు కాగా, మొత్తం సంవత్సరం బడ్జెట్ అంచనా రుణం 37,029.79 కోట్లు, అంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం ద్వారా భవిష్యత్తు రాబడి సముపార్జించే ఉత్పాదక ఆస్తుల కల్పన లేకుండానే బడ్జెట్ లో అంచనా వేసిన అప్పులు 100% కంటే ఎక్కువ రెండవ త్రైమాసికంలోనే దాటడం గమనార్హం. మరోవైపు మొత్తం సంవత్సరం బడ్జెట్ అంచనా ఆదాయం 1,77,196.48 కోట్లు కాగా, సెప్టెంబర్ నాటికి కేవలం 64,871.99 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించగలిగింది, అంటే సంవత్సరంలో 50% వ్యవధి ముగిసిన తర్వాత సాధించిన మొత్తం రాబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.61% మాత్రమే.
కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం పై ప్రమాణాలు నిర్ణయించి, ఆ లక్ష్యాలను సాదిస్తే అదనపు అప్పు కి రాష్ట్రాలకు అవకాశం ఇస్తే ఏడు రాష్ట్రాలు అవకాశం అంది పుచ్చుకున్నయి. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా అదనపు అప్పుల కోసం రాజ్యాంగేతర విధానాలతో మద్యం పైన వ్యాట్ ని పక్కదారి పట్టించే విధానం లాంటి పద్ధతులు అనుసరించడం శోచనీయం.
ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులు అనుసరించడం వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బ తగలడం మనం గమనించవచ్చు. అదనపు అప్పులు రాబట్టడానికి మద్యం ఆదాయంపై వ్యాట్‌ను బేవరేజ్ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం అకౌంటింగ్ పద్ధతులను చట్టవిరుద్ధమైన విండోస్ డ్రెస్సింగ్ విధానంతో పన్నులను కార్పొరేషన్‌లకు మళ్లించడం ద్వారా కన్సాలిడేటెడ్ ఫండ్‌ కు బదిలీ కావాల్సిన నిధులు పక్కదారి పట్టే ప్రమాదం పొంచి ఉంది.
ఈ విధానం రాజ్యాంగ ప్రకరణలను ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. సెప్టెంబరు నెల కాగ్ నివేదికలోని వాస్తవాలను విశ్లేషించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఆనారోగ్యానికి సూచిక అన్ని అంశాలలో గోచరిస్తూ ప్రమాద గంటలు మోగుతున్నాయి. సక్రమంగా నిర్దేశించిన ఆర్థిక విధానాలు తక్షణమే అమలు చేస్తూ నష్ట నివారణ చర్యలు అవసరం, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రానికి జరిగే ఆర్థిక నష్టం ఊహించలేనిది.