Suryaa.co.in

Andhra Pradesh

నర్సాపురంలో నరులను చంపే ఈగలు

– ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు
– పశువుల మరణాలకు లెక్కలేదు
– మర్రిమూలలో కొబ్బరి దింపు కార్మికులపై దాడి
– రస్తుంబాదా, సీతారామాపురం గ్రామాలలో తిష్ట
– సముద్ర మార్గం గుండా ఆఫ్రికా దేశం నుంచి మన ప్రాంతానికి
– ఈ విషపు ఈగలు కుడితే ప్రాణాలు అంతేసంగతి!

ఒకరు నాకు ఎదురు వచ్చినా, నేను ఒకరికి ఎదురువెళ్లినా వాళ్లకే డేంజర్.. ఈ డైలాగ్ ఖచ్చితంగా ఈ ఈగలకు సరిపోతుంది. ఒక్క ఈగకు భయపడతామా అని ఈగ సినిమాలో సుదీప్ మొదట లైట్‌గా తీసుకున్నట్టు మనం నిట్టూర్చామా ఇక అంతే సంగతులు.

ప్రాణాలు పోయే వరకు అవి మనల్ని వదిలి పెట్టవు. ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్. కుడితే అంతే సంగతులు ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే.

గత కొన్నేళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంత ప్రజలు వీటి పేరు చెబితే గజగజ వణికిపోతున్నారు. అచ్చం తేనెటీగలను పోలి ఉండే ఈ విషపు ఈగలు తోటలలో చెట్లపై గూడులు ఏర్పర్చుకుంటున్నాయి. ఏమాత్రం అలికిడి జరిగినా ఆ మార్గంలో వెళ్లేవారిపై మెరుపుదాడి చేస్తాయి.

వీటి దాడిలో గత కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో మనుషులు మృత్యువాత పడుతున్నారు. ఇంకా అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటి దాడిలో మనుషులే కాదు పశువులు మృతి చెందాయి.
ఏ క్షణాన ఈ ఈగలు దాడి చేస్తాయో అని పశ్చిమగోదావరి తీర ప్రాంతవాసులు వణికిపోతున్నారు. తాజాగా ఇప్పుడు నరసాపురం మండలం రస్తుంబాద గ్రామంలో వ్యవసాయ పొలాలలో తిష్ట వేసాయి ఈ కిల్లర్ బీస్.

నిత్యం పొలం పనులు చేసుకునే కొబ్బరి దింపు కార్మికులు తిరిగే ప్రాంతం కావడంతో వారిపై ఎప్పుడు దాడి చేస్తాయో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నెల 5న పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోద్యలంక పంచాయతీ పరిధిలోని మర్రిమూలలో కొబ్బరి దింపు కార్మికులపై ఇవి దాడి చేయటంతో ఒక వ్యక్తి చనిపోయాడు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం చవిరిపల్లి గ్రామానికి చెందిన బాడితమాని రెల్లబాబు పని కోసం వచ్చి, ఈ ఘటనలో మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి.

సునామీ సమయంలో సముద్ర మార్గం గుండా ఆఫ్రికా దేశం నుంచి మన ప్రాంతానికి వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి గత కొన్నేళ్లుగా తీరం వెంబడి ఉన్న గ్రామాలలో తిష్ట వేసి అలికిడి వినబడితే సమీపంలోని గ్రామస్థులపై దాడి చేసేవి. వీటి దాడిలో వందల సంఖ్యలో గాయపడగా.. పలువురు మృత్యువాత పడ్డారు. చాలామంది అదృష్టం కొద్దీ తప్పించుకుని తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.

గతంలో రెవెన్యూ అధికారులు ఫైర్ సిబ్బంది సాయంతో చాలావరకు తీర ప్రాంతంలోని విషపు ఈగల స్థావరాలను ధ్వంసం చేశారు. అయితే రెండు సంవత్సరాల నుంచి నరసాపురం మండలం రస్తుంబాదా, సీతారామాపురం గ్రామాలలో ఈ విషపు ఈగలు స్థావరాలు కనిపిస్తున్నాయి. వీటిని చూసి స్థానికులు బయటకు రావాలంటే భయపడుతున్నారు.

నిత్యం పొలం పనులు, కొబ్బరి దింపు తీసే కార్మికులు తిరిగే తోటలలో ఈ విషపు ఈగలు తిష్ట వేయడంతో పనులు మానివేసి ఇంటి దగ్గర కూర్చోవలసిన పని ఏర్పడిందని వాపోతున్నారు. ఈ విషపు ఈగలను ధ్వంసం చేసి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. చూసేందుకు కందిరీగల మాదిరిగానే ఉన్నా, ఇవి నిర్మించుకునే గూడు ప్రత్యేకంగా ఉంటుంది.

చిన్న చిన్న రంధ్రాలు ద్వారా ఇవి తమ నివాసాల్లో నుంచి బయటకు రావటం.. లోపలికి వెళ్ళటం చేస్తాయి. ఒక విధంగా చెట్ల మీద ఇవి పుట్టలు పెట్టినట్లుగా కనిపిస్తాయి. చెట్ల కొమ్మలు, ఆకులను ఆసరాగా చేసుకుని స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటిని పొగబెట్టి, తగలబెట్టడం ద్వారా నిర్మూలిస్తున్నా, తిరిగి పుట్టుకువస్తూ దాడులకు తెగబడుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

LEAVE A RESPONSE