ఏడో రోజు సందర్భంగా… వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. బియ్యం పిండితో వేపకాయల ఆకృతిలో పిండివంటలు చేసి… అమ్మవారికి నివేదిస్తారు.
వేపకాయల బతుకమ్మ..
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా బతుకమ్మను పేరుస్తూ… ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో ఏడో రోజున అమ్మవారిని ‘వేపకాయల బతుకమ్మ’గా అభివర్ణిస్తుంటారు.
ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. తంగేడు , గునుగు , బంతి , చామంతి , పట్టుకుచ్చు వంటి తీరొక్క పూలతో ఏడంతరాల బతుకమ్మను పేరుస్తారు.
రోజుకో తీరుగా..
తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ… రెండో రోజు అటుకుల బతుకమ్మ.. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అర్రెం అనగా బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో పేరుతో కొలుస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు.
గంగమ్మ చెంతకు బతుకమ్మ
సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి… దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…., ఒక్కేసి పువ్వేసి చందమామ… ఒక్కజాములాయే చందమామ…, పసుపుల పుట్టింది గౌరమ్మా… పసుపుల పెరిగింది గౌరమ్మా… అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.
బతుకు తల్లికి పూజ !
అచ్చమైన పల్లె సంస్కృతికి అద్దం పట్టే మట్టిమనుషుల పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలతో తెలంగాణ లోగిళ్లు కళకళలాడుతున్నాయి. పల్లెలు , పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓ పక్కన పెద్దలు బతుకమ్మ ఆడుకుంటుంటే.. మరోపక్కన పిల్లలు కేరింతలు కొడుతుంటారు.
తొమ్మిది రోజుల పాటు పిల్లాపెద్దా తేడాలేకుండా ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు. ప్రాణధారణకు ఆధారమైన నేలలో , నీటిలో ప్రభవించే బతుకు పువ్వే బతుకమ్మ. మానవ జీవనంలోని సుఖదుఃఖాలకు , స్నేహానురాగాలకు , ఆప్యాయతాదరణలకు ప్రతీకలైన రంగురంగుల పూలతోనే బతుకు తల్లికి పూజ !
– సువర్చల