నివేదిక అందిన తర్వాతే ఏపీకి వరద సాయం

నివేదిక అందిన తర్వాతే ఏపీకి వరద సాయం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8: గత నెలలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక సమర్పించిన అనంతరం అదనపు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తామని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా 25 మంది మరణించినట్లు, రోడ్లు, విద్యుత్‌ వ్యవస్థతోపాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని ఆయన చెప్పారు. భారీ వర్షాలపై నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 23న వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం నవంబర్‌ 26 నుంచి 29 వరకు భారీ వర్షాల ప్రభావానికి గురైన ప్రాంతాలను సందర్శించి జరిగిన నష్టాన్ని మదింపు చేసింది. దీనిపై ఆ బృందం తుది నివేదిక సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా ఆర్థిక సహాయం అందించే అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
విపత్తులు సంభవించినపుడు బాధితులను ఆదుకోవలసిన ప్రాధమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) అందుబాటులో ఉంటుంది. విపత్తు తీవ్రతరమైనదిగా కేంద్ర బృందం నివేదికలో పేర్కొంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి రాష్ట్రానికి అదనంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఏ విపత్తును కూడా జాతీయ విపత్తుగా ప్రకటించే అధికారం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లేదా ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో 4 గిరిజన ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గిరిజన ఉత్పాదనలు జీఐ ట్యాగ్‌ పొందడానికి అర్హమైనవిగా గుర్తించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ సరూట వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 177 గిరిజన ఉత్పాదనలు జీఐ ట్యాగ్‌ పొందడానికి అర్హమైనవిగా ట్రైబల్‌ కోపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ట్రైఫెడ్‌) గుర్తించిందని చెప్పారు.
అందులో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన ఉత్పాదనలు 88 ఉండగా, ఉత్తరాఖండ్‌లో 14, జార్ఖండ్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 11, మహారాష్ట్రలో 10, ఒడిషాలో 6, పశ్చిమ బెంగాల్‌లో 9, గుజరాత్‌లో 7, చత్తీస్‌ఘడ్‌లో 7, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఉన్నాయని తెలిపారు. అస్సాం, గుజరాత్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలోని 21 గిరిజన ఉత్పాదనలకు జీఐ ట్యాగింగ్‌ చేసే పనిని ట్రైఫెడ్‌ ఒక ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు.