
– ఉద్యోగుల సమస్యల పై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి
– పి ఆర్ టీ యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరపల్లి సురేష్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి ఇతర సమస్యల పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నాలలో ఉద్యోగ సంఘం నాయకులు ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు, వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇవ్వటం తీవ్ర దురదృష్టకరమని పిఆర్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరపల్లి సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా చల్లపల్లి మండలం పురిటిగడ్డ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే అంశంలో ఒక్కొక్క ఉద్యోగసంఘానికి ఒక్కొక్క ఎజెండా ఉంటుందని తెలిపారు. ఒక సంఘం విధి విధానాలపై వేరే సంఘం విమర్శలు చేయడం,సంఘ నాయకులపై వ్యక్తిగత దూషణలు చేయటం సరికాదన్నారు. దాని వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరగడం తో పాటు సంఘాలు బలహీనం అవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండా గా సంఘాలు పని చేయాలి తప్ప ఆధిపత్య ధోరణి కోణంలో వ్యవహరించడం సరికాదన్నారు.
ఉద్యోగ సంఘాలు సమస్యల సాధన కొరకు ఏకతాటిపైకి రావాలని అలా కుదరని పక్షంలో విమర్శలకు తావు లేకుండా ఎవరి పంథాన వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి తక్షణమే చొరవ తీసుకొని స్పష్టమైన ప్రకటన చేయాలని సురేష్ బాబు కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కె. రవీంద్ర ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కె బి ఎన్ శర్మ, ఉపాధ్యాయులు సాయి కుమార్,ఎన్. సుధాకర్,జాన్స్టన్, సమత అంబేద్కర్ ,చంద్రిక, గువేరా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.