Suryaa.co.in

Telangana

పేద‌ల వైద్యానికి పెద్ద పీట‌

– ఇప్ప‌టికే ఆరోగ్య శ్రీ సాయాన్ని పెంచాం
– వైద్య శాఖ‌కు బ‌డ్జెట్ లో ప్రాధ‌న్యత ఇస్తాం
– ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తాం
– వైద్య ఆరోగ్య శాఖ స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
– ఆశ వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎంలు, జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు సరైన స‌మ‌యంలో జీతాలు ఇవ్వాలిః దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ‌

ఇందిర‌మ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేద‌ల వైద్యానికి పెద్ద పీట వేస్తున్న‌ద‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ సంస్థ‌ల‌కు సంబంధించిన‌ బడ్జెట్ అంచనాల రూప‌క‌ల్ప‌న‌పై సమావేశం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగింది. ఈ స‌మావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ హాజ‌ర‌య్యారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ‌లో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, వైద్య ఆరోగ్య శాఖ ప‌నితీరు, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హాకారంతో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన‌ట్టుగా అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల్లోనే ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ.10ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పేద‌, సామ‌న్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ఆసుప‌త్రుల్లో మెరుగైన వైద్యం అంద‌టానికి కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ‌కు బ‌డ్జెట్‌లో అత్య‌ధిక ప్రాధ‌న్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. అన్ని కార్పేరేట్ ఆసుప‌త్రుల్లో రాజీవ్ ఆరోగ్య శ్రీ అమ‌లుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను అదేశించారు. విస్త‌రిస్తున్న క్యాన్స‌ర్ మ‌హామ్మారిని అరిక‌ట్ట‌డానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్ర‌జ‌ల‌కు అవ‌గాహాన క‌ల్పించాల‌ని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో వ‌రంగ‌ల్‌లో ప్ర‌స్తుతం ఒక్క‌టే సైన్స్ సెంట‌ర్ ఉన్న‌ద‌ని మ‌రో సైన్స్ సెంట‌ర్ ఏర్పాటుకు వ‌చ్చిన‌టువంటి ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించాల‌ని ఉప ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఆసుప‌త్రుల నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని కోర‌గా డిప్యూటి సీఎం అంగీక‌రించారు. వైద్య ఆరోగ్య శాఖ‌కు ప్ర‌తి నెల బ‌డ్జెట్ నిధులు విడుద‌ల చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి వాణి ప్ర‌సాద్‌, హెల్త్ సెక్ర‌ట‌రి క్రిస్టీనా, ఫైనాన్స్ జాయింట్ సెక్ర‌ట‌రి హ‌రిత‌, డిప్యూటి సీఎం సెక్ర‌ట‌రి కృష్ణ భాస్క‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE