Suryaa.co.in

Telangana

సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను ప్రొత్స‌హిస్తాం

-ఇండ‌స్ట్రీయ‌ల్ క్ల‌స్ట‌ర్స్ పెంచుతాము
-యువ పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తాము
-సంప‌ద సృష్టించే రంగాల్లో అంద‌రిని భాగ‌స్వాములు చేస్తాం
-వెండ‌ర్స్ డెవ‌ల‌ప్ మెంట్ కార్య‌క్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

కాంగ్రెస్ ప్ర‌భుత్వం..ఇందిర‌మ్మ రాజ్యంలో సూక్మ‌, మ‌ధ్య‌, చిన్న‌తర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంట‌ర్ ప్రైజెస్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యాక్ర‌మానికి ఉప ముఖ్య‌మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు ఊత‌మిచ్చేలా ఉత్ప‌త్తి రంగమైన వ్య‌వ‌సాయం నుంచి పారిశ్రామిక రంగం దిశ‌గా గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌ణాళిలు ర‌చించి.. అందుకు అనుగుణంగా వ్య‌వ‌స్థ‌లను ఏర్పాటు చేశార‌ని అన్నారు. నాడు వేసిన బ‌ల‌మైన పునాదుల‌పై నేడు దేశం పురోగ‌మిస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు.

ఉత్ప‌త్తి రంగం, పంచ‌వ‌ర్ష ప్ర‌ణాలిక‌లు, మిశ్ర‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లే సువిశాల‌మైన భార‌త‌దేశ ఆర్థిక పురోగ‌తిలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయని, ఆర్థిక స‌ర‌ళీక‌ర‌ణ‌, ప్రపంచీక‌ర‌ణ నేప‌థ్యంలో దేశంలోకి అడుగుపెట్టిన బ‌హుళ జాతి సంస్థ‌లు మైక్రో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ను మింగేశాయ‌ని అన్నారు. సంప‌ద మొత్తం ఒకేచోట పోగుప‌డ్డం ప్ర‌జాస్వామ్యానికి, సమాజానికి ఏ మాంత్రం మంచిది కాద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

మైక్రో, స్మాల్ స్కేల్ ఇండ‌స్ట్రీల‌కు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌న‌, స‌మాన‌త్వం, సామాజిక న్యాయం, వృద్ధిరేటు పెరగడానికి సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు అత్యంత ఆవశ్య‌క‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల వ‌ల్ల సామాజిక న్యాయం, స‌మాన‌త్వం, ఉద్యోగ‌-ఉపాధి క‌ల్ప‌న అనేవి భూత‌ద్దం పెట్టి వెతికి చూసినా క‌నిపించ‌వ‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌తో అభివృద్ధి సాధ్యం అన్నది గోబెల్స్ ప్రచారం మాత్రమేన‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తంచేశారు. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ను పెంచుతామ‌ని, ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెంచి యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా, మేధోపరంగా సహకారం అందిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ-ఉపాధి కల్పన జరుగుతుంద‌ని అన్నారు. దీనివ‌ల్ల దేశ వృద్ధిరేటు పెరుగుతుంద‌ని అన్నారు. వనరులు సమానంగా పంచి, సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వాములు చేయడం తోనే సమసమాజ స్థాపన జరుగుతుంద‌ని తేల్చి చెప్పారు.

సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వామ్యం చేయక‌పోతే దేశంలో అసమానతలు పెరుగుతాయ‌న్నారు. ఇది సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలకు, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు మ‌రిన్ని రాయితీలు, ప్రోత్సాహకాల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డించారు.

కార్య‌క్ర‌మం ఆనంత‌రం అక్క‌డ వివిద కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయ‌న ప్రారంభించి ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మంలో ఆడిష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిష‌న‌ర్ డి. చంద్ర‌శేఖ‌ర్‌, ఎఫ్ఈటిఎస్ఐఏ అధ్య‌క్షులు ఎ. భాస్క‌ర్‌రెడ్డి, పార్ధ‌సార‌థి, జి.ఎ శ్రీనివాస్ మూర్తి, దీప‌క్‌కుమార్ శ్రీ‌వాస్త‌వ‌, వి శ్రీ‌నివాస్ రావు, ఎస్ఎంవి నానాజీ, ఎ.వి ముర‌ళీకృష్ణ‌, సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE