Suryaa.co.in

Editorial

ఇక తెలంగాణపై దృష్టి

– నాకు రెండు రాష్ట్రాలూ ముఖ్యమే
– ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణపై దృష్టి సారిస్తా
– అప్పుడే తెలంగాణ పార్టీకి కొత్త అధ్యక్షుడు
– నేను జైల్లో ఉన్నప్పుడు మీరంతా అండగా నిలిచారు
– తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పిలిస్తే వెళ్లండి
– తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు
– మీరు మారాలని నేతల సూచన
– వేధించిన వారిని వదలవద్దని సూచన
– ఈసారి కార్యకర్తలు మెచ్చేలా పనితీరు ఉంటుందని బాబు హామీ
– ఈసారి ఆషామాషీగా ఉండదని బాబు వ్యాఖ్య
– అలాగని అందరినీ ఇబ్బందిపెట్టేది లేదన్న బాబు
– అందరి వద్దకూ వెళ్లి పలకరించిన చంద్రబాబునాయుడు
(అన్వేష్)

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తానని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. శుక్రవారం దాదాపు 60 మంది తెలంగాణ నేతలు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు స్వయంగా వారివద్దకు వెళ్లి పలకరించి, క్షేమసమాచారాలు తెలుసుకోవడంతో నేతలు ఆనందపరవుశులయ్యారు.

అనంతరం సీనియర్ నేతలు బక్కని నర్శింహులు, కాట్రగడ్డ ప్రసూన, నర్శిరెడ్డి, పొగాకు జయరాం తదిత రులు తెలంగాణలో దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, యువనేత పొగాకు జయరాం మాట్లాడుతూ.. ‘‘ సార్. ఈసారి మీరు మారాలి. గతంలో మాదిరిగా చట్టప్రకారం చేస్తామంటే ఈసారి కుదరదు. మనల్ని వేధించిన వారి సంగతి తేల్చాలి. మీరు సభల్లో ఆ మేరకు హామీ ఇచ్చారు. ఈసారి తమాషాగా ఉండదని హెచ్చరించారు. ఆ ప్రసంగాలే యువతలో ఉత్సాహం నింపాయి. మీరు అలా చేస్తేనే ఇక్కడ మనం బలపడతాం’’ అని సూచించారు. బక్కని, నర్శిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం హాజరుపై దిశానిర్దేశం చేయాలని కోరారు.

రాష్ట్ర పార్టీ ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవిందకుమార్‌గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్స, పిన్నమనేని సాయిబాబు, అశోక్, మండూరి సాంబశివరావు, సతీష్, నల్లెల కిశోర్, బోస్ సహా పార్లమెంటు పార్టీ అధ్యక్షులంతా హాజరయ్యారు.

దానికి స్పందించిన చంద్రబాబునాయుడు.. తెలంగాణలో గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని, అప్పుడు తాను జైలులో ఉన్నందున పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పైగా అంత తక్కువ సమయంలో పోటీచేసి, సంతృప్తికర ఓట్ల శాతం రాకపోతే ఆ ప్రభావం ఏపీపై పడే ప్రమాదం ఉందని భావించామన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో పార్టీ జెండా మోసి, పార్టీని కాపాడుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కావాలని వేధించిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని బాబు స్పష్టం చేశారు. అయితే మనం ఎవరినీ పనికట్టుకుని వేధించమని, చట్టాన్ని అతిక్రమించిన వారికి మాత్రం శిక్ష తప్పదన్నారు. ఈవిషయంలో తనకు క్లారిటీ ఉందన్నారు. కానీ కార్యకర్తలు మెచ్చేలా ఈసారి పనితీరు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఏపీ ఫలితాల అనంతరం తెలంగాణపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తామని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల పోటీపై ఆలోచిద్దామన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు మీరంతా నాకు అండగా నిలబడ్డారని, హైదరాబాద్‌లో కూడా ఎక్కువ నిరసన కార్యక్రమాలు చేసి నాకు మద్దతు ఇవ్వడాన్ని మర్చిపోలేను అని కృత జ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ అధ్యక్ష పద విని నిర్ణయిస్తామన్నారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి, తెలంగాణ ఆవిర్భావదినోత్సవానికి ఆహ్వానం అందితే వెళ్లాలని బక్కనికి సూచించారు. పార్టీ కార్యాలయంలో కూడా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని సూచించారు. ‘నాకు ఏపీ-తెలంగాణ రెండూ ముఖ్యమే. రెండుచోట్లా మన ఉనికి, ప్రాధాన్యం ఉండాల్సిందే’నని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE