ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది
మాగాయ పేరిన నెయ్యి తో మంతరిస్తుంది
మెంతికాయ మోజు పెంచేస్తుంది
తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది
కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది
బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది
పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది
పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది
చింతకాయ చింతించినా చూడరు
ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు
గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు
కొరివికారం కొరకొర చూసినా చలించరు
టమాటా టక్కుటమారాలు చేసినా పడరు
నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా
అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు
వంకాయ బండపచ్చడి బాధపడినా
నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా
దోసావకాయ దోరగా నవ్వినా
నారింజకారం కవ్వించినా
కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా
పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా
క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా
కొబ్బరి పచ్చడి కూతపెట్టి పిలిచినా
బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా
కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా
వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా
వడగళ్ల జడివానలు కురుస్తున్నా
చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా
అన్ని ఋతువుల అమృతమనుచు
మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే
అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ
ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా
కంటికింపుకాదు నోటికి రుచికాదు
మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని
అమ్మలా ఎప్పుడయినా ఆదరించేదావకాయే అని నొక్కి వక్కాణించేదే భాస్కర్ ఉవాచ
(అతికించిన ప్రతి…శ్రీ సుబ్రహ్మణ్యం గంటి గారిది)
(సేకరణ)