Suryaa.co.in

Andhra Pradesh

మీడియా…. జనం గొంతుక కావాలి

– మహానాడు వెబ్ సైట్ ఆవిష్కరణలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

వినుకొండ వాసి.. శ్రమపడు సాయపడు స్వచ్ఛంద సంస్థ అధినేత.ప్రముఖ పారిశ్రామికవేత్త బోడేపూడి సుబ్బారావు (బి ఎస్ ఆర్) సారధ్యంలో రూపొందిన.. మహానాడు వెబ్ సైట్ ను మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీడియా జనం గొంతుక కావాలని, ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజల పక్షాన, తన బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు శరవేగంగా తీసుకువెళ్లడంలో మహానాడు ముఖ్య భూమిక పోషించాలని ఆకాంక్షించారు. డిజిటల్ రంగంలో మహానాడు శరవేగంగా దూసుకు వెళ్లాలని సూచించారు.

ప్రధానంగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మొహమాటంగా వెల్లడించాల్సిన అవసరం, ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాకు ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిజాన్ని నిర్భయంగా రాసి , చెప్పే పరిస్థితులు కరువైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దురదృష్టవశాత్తు రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ప్రశ్నించే గళాలను కలాలను అణచి వేస్తున్న పరిస్థితి ఉందని వాపోయారు. టిడిపి ప్రభుత్వంలో మీడియాను ఎంత గౌరవించామో అందరికీ తెలిసిందేనన్నారు.

ఈ నేపథ్యంలో మహానాడు.. నిర్భయంగా ప్రజా సమస్యలను వెలికి తీయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మహానాడు మేనేజింగ్ డైరెక్టర్ బోడేపూడి సుబ్బారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్ధన్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఏవి రమణ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE