గ్రేటర్ హైదరాబాద్ మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలిగా కాంగ్రెస్ యువ నేత, మాజీ కార్పొరేటర్ బండారి లత నియమితులయ్యారు. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్నూరుకాపు అధ్యక్షుడు ఆర్.వి. మహేందర్‌కుమార్ ఆమెకు నియామక పత్రం అందించారు. ఇటీవలి కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న బండారి లత, ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలిగా పనిచేశారు. తెలంగాణలోని జిల్లాలకు కూడా ఆమె ఇన్చార్జిగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా లత మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపులను సంఘటితం చేస్తానన్నారు. ప్రధానంగా మున్నూరు కాపు- కాపు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధింత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు.
వివిధ రంగాల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లోని మున్నూరు కాపు మహిళలను సంఘటిత పరిచి, వారిలో రాజకీయ చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలను మున్నూరు కాపు- కాపు మహిళకు అందించేందుకు కృషి చేస్తానని బండారి లత హామీ ఇచ్చారు. తనకు అధ్యక్ష పదవి ఇచ్చిన నగర కమిటీ అధ్యక్షుడు మహేందర్కుమార్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కాగా మాజీ కార్పోరేటర్ బండారి లతకు గ్రేటర్ హైదరాబాద్ మున్నూరుకాపు మహిళా అధ్యక్ష పదవి ఇవ్వడంపై , సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మున్నూరు కాపు నేతలు హర్షం వ్యక్తం చేశారు. అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసే బండారి లతకు ఆ పదవి ఇచ్చినందుకు పలువురు మున్నూరుకాపు మహిళలు, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మరిన్ని పదవులు పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తామంతా లత నాయకత్వంలో పనిచేసి, మున్నూరుకాపు మహిళలను సంఘటితం చేస్తామన్నారు.