– జగన్ సర్కారుపై ఆ నలుగురి జంగ్
– పాదయాత్రతో లోకేష్ పంచ్ డైలాగులు
– యువనేతగా జనంలో గుర్తింపు
– వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై అక్కడే ఆరోపణాస్త్రాలు
– ప్రాజెక్టుల సందర్శనలో చంద్రబాబు
– జగన్ సర్కారుపై యుద్ధభేరి
– పొలిటికల్ హీట్ పెంచుతున్న బాబు
– సర్కారుపై జనసేనాధిపతి పవన్ సింహగర్జన
– వారాహిపై నుంచి సర్కారుపై విమర్శనాస్త్రాలు
– జనయాత్రలతో జోరుపెంచిన పవన్ కల్యాణ్
– జనం నుంచి వాలంటీర్లను వేరు చేస్తున్న పవన్ ప్రసంగాలు
– హస్తిన నుంచి రఘురామరాజు హల్‌చల్
– సొంత అధినేతపై ప్రతిరోజూ ‘రచ్చబండ’
– వైసీపీ పాలిట ఏజెంట్ 116 గా మారిన రాజు
– సోషల్‌మీడియాలో ‘రచ్చ రఘు’
– జగన్ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదుల పరంపర
– వైసీపీకి కంట్లో నలుసు, కాలిముల్లుగా మారిన ఎంపి రాజు
– పవన్, లోకేష్, రఘురామకు సోషల్‌మీడియాలో నీరాజనాలు
– వీరికి కొత్తగా తోడైన బీజేపీ చీఫ్ పురందేశ్వరి
– జగన్ సర్కారు దారి మళ్లింపుపై పురందేశ్వరి యుద్ధం
– జనక్షేత్రంలో జగన్‌పై వ్యతిరేకత పెంచుతున్న కొలికపూడి
– మీడియా చర్చల్లో కొలికపూడికి నీరాజనాలు
– దళితుల్లో చైతన్యస్ఫూర్తి రగిలిస్తున్న కొలికపూడి ప్రసంగాలు
– హీటెక్కుతున్న ఏపీ పాలిటిక్స్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆ నలుగురు.. ఒకరిని మించిన వారు మరొకరు. కొందరు యుద్ధవీరులైతే.. మరికొందరు మాటల మాంత్రికులు. రాజరికపుటెత్తులతో నడమంత్రుపు జిత్తుల యోద్ధ. జనంలో ఎవరి ఇమేజ్ వారిదే. తలా ఒకవైపు నుంచి జగనన్న సర్కారును విమర్శలు-ఆరోపణాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగనన్న పాలనలో జరుగుతున్న కుంభకోణాలను తవ్వితీస్తున్నారు. ఒకరు పాదయాత్రలతో.. మరొకరు ప్రాజెక్టుల సందర్శన పేరుతో.. ఇంకొకరు వారాహిపై నుంచి.. మరొకరు హస్తిన నుంచి.. ప్రభుత్వ వ్యతిరేక తను పెంచే అస్త్రాలకు పదునుపెడుతున్నారు.
వీరు సంధించే ఆరోపణాస్త్రాలు, సోషల్‌మీడియాలో మతాబుల్లా పేలుతున్నాయి. వారికి లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు.. షేరింగులూ. మధ్యలో చేరిన మహిళా సేనాని వీరికి తోడయింది. ఆమెది కలి‘విడి’ కదనమే అయినా, ఆమెదీ జగన న్న సర్కారుపై సమరసింహ నాదమే. మరొక దళిత మేధావి.. మీడియా చర్చల వేదికగా సంధిస్తున్న విమర్శలు, సర్కారుకు సెగ పుట్టిస్తోంది. అంటే.. విపక్షాలన్నీ ఒకవైపు.. జగనన్న ఒక్కరే మరోవైపు.
కానీ.. ఇంతమంది తనపై కలి‘విడి’గా ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టినా, జగనన్న ఉలకరు. పలకరు. చివరాఖరికి తన పర్యటనలు.. పరదాల చాటున జరుగుతున్నాయన్న వ్యంగ్యాస్త్రాలకూ ఆయన స్పందించరు. ఏమున్నా..అందరికీ ఆయన సైన్యమే వారికి సమాధానం చెబుతుంది. ఇదీ ఏపీలో పొలిటికల్ హీట్.
ఏపీలో ఏడాదికి ముందే పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. తలా ఒక వైపు విడిపోయి.. ఉమ్మడి శత్రువైన జగనన్నకు సెగ పెట్టే పనిలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ యువనేత లోకేష్.. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు.. ఇలా నలుచెరుగులా జగనన్న సర్కారుపై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.
కొత్తగా కమలదళానికి సేనానిగా వచ్చిన పురందేశ్వరి కొత్త దారిలో అగ్గి పుట్టిస్తున్నారు. మేధావి, దళిత వర్గాల్లో కొలికపూడి శ్రీనివాసరావు.. ఇలా అంతా కలసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు, ఎవరి దారిలో వారు రణతంత్రాన్ని నడిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీలో పడకేసిన ప్రాజెక్టుల పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు మాస్టర్ అవతారమెత్తారు. ఏ ప్రాజెక్టు పురోగతి ఏమిటి? తన హయాంలో జరిగిన పనులెన్ని? జగన్ సర్కారులో జరిగిన పనులెన్ని? వాటికి తామిద్దరూ కేటాయించిన నిధులెన్ని? అన్న అంశాలతో వెళ్లిన ప్రతిచోటా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా.. జగన్ హయాంలో ప్రాజెక్టులన్నీ పడకేశాయన్న సందేశాన్ని జనక్షేత్రంలోకి పంపించే పనిలో ఉన్నారు.
తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనపై జరిగిన దాడులను, సానుభూతిగా మార్చుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఆయన పోలీసులను ముద్దాయిగా నిలబెట్టే ఎత్తుగడ, జనంలో సహజంగానే చర్చనీయాంశమయింది. ‘ మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడతారా’ అంటూ బాబు వేసిన ప్రశ్నలు జనక్షేత్రంలో చర్చనీయాంశమయ్యాయి.
ఒక మాజీ సీఎం, ఎస్పీజీ భద్రత ఉన్న కీలక నేతకే భద్రత లేకపోతే, ఇక తమ సం‘గతేమిట’న్న సగటు మనిషి ఆలోచనకు, చంద్రబాబు బీజం వేశారు. ఒకవైపు కొడుకు లోకేష్, మరోవైపు తాను.. జనక్షేత్రంలో దూసుకుపోయే ప్రణాళికకు పదునుపెడుతున్నారు.
చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర, 2 వేల కిలోమీటర్లు దాటింది. ఒకప్పుడు అసలు మాట్లాడమే రాని లోకేష్.. తప్పుల తడకగా మాట్లాడే లోకేష్.. వైసీపీ సోషల్‌మీడియా సైన్యానికి లక్ష్యంగా మారిన లోకేష్… ఇప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయేలా.. విమర్శకులు విస్తుపోయేలా.. నవ్విన నాపచేనే పండేలా.. పంచ్ డైలాగులు పండిస్తున్నారు. జగన్ పాలనలో అక్రమాలను, సెల్ఫీలతో జనంలోకి పంపిస్తున్నారు. తమ పాలనలో జరిగిన అభివృద్ధినీ, అదే సెల్ఫీలతో జనాలకు గుర్తు చేస్తున్నారు.
ఏ నియోజకవర్గంలో పాదయాత్ర జరిగితే, అక్కడి వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని బట్టలూడదీసి, నిలబెడుతున్నారు. వారి అక్రమ ఆస్తుల చిట్టా విప్పుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలు సేవ చేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని, జనక్షేత్రం నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కులాల వారీగా, మతాల వారీగా.. అచ్చం అప్పుడు జగన్ ఏవిధంగా అడుగులేశారో, ఇప్పుడు లోకేష్ కూడా అదే వ్యూహం పక్కాగా అమలుచేస్తున్నారు.
అవ్వాతాతలను పలకరిస్తున్నారు. చిన్నారులకు ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు. మహిళలతో మమేకమవుతున్నారు. క్రైస్తవ-ముస్లిం-బీసీ-ఎస్టీ-ఎస్సీ వర్గాల వారితో భేటీ అవుతున్నారు. బ్రాహ్మణ-వైశ్య-కమ్మ-రెడ్డి కుల సంఘాల ప్రతినిధులతో ముచ్చటిస్తున్నారు. నిరుద్యోగులు- వ్యాపార సంఘాలతో ముచ్చటించి వారి సమస్యలపై స్పందిస్తూ.. ‘అసలు ఈ కుర్రాడు, అప్పటి లోకేశేనా’ అని, ఆశ్చర్యపడేలా అడుగులేస్తున్నారు.
ప్రధానంగా.. రెడ్డి వర్గీయులతో లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు, యువగళం పాదయాత్ర లోకేష్‌ను యువనేతగా నిలబె ట్టడంలో దోహదం చేసింది. ‘జగన్‌రెడ్డి చుట్టూ ఉన్న ఐదారుమంది రెడ్లకు తప్ప, రెడ్డి సామాజికవర్గానికి జరిగిందేమీ లేదన్న’ లోకేష్ వ్యాఖ్యలు, రెడ్లను నేరుగానే తాకుతోంది. ‘చిన్న చిన్న రెడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులివ్వని జగన్‌రెడ్డి, పెద్ద రెడ్లకు వందలకోట్ల బిల్లులు ఇస్తున్నార’ంటూ చేసిన విమర్శ, సగటు రెడ్ల గుండెకు నేరుగా గుచ్చుకుంటోంది.
సూటిగా.. సుత్తిలేకుండా.. పదునుగా.. పంచ్ డైలాగులతో లోకేష్ తనను తాను మలచుకుని, జగన్‌కు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు, ఆయన వ్యవహారశైలి స్పష్టం చేస్తోంది. యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న 40 ఏళ్ల లోకేష్.. 40 ఏళ్ల టీడీపీని.. మరో 40 ఏళ్లు నిలబెట్టే దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక వారాహిని జనంలో వదిలి, జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న పవన్ కల్యాణ్ ..తన మాటల తూటాలతో, వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వాలంటీర్ల లీలలపై పవన్ చేసిన ఆరోపణల ఫలితంగా.. ఇప్పుడు ఏపీలో వాలంటీర్లు వస్తుంటే, మహిళలు తలుపులు వేసుకునే పరిస్థితి. వాలంటీర్లను దోషుల్లా చూస్తున్న దయనీయం.
ఒంటరి మహిళలు, అనాధ మహిళలు, వితంతులపై వాలంటీర్లు చేస్తున్న అత్యాచారాలు, హ త్యలు, దొంగతనాలపై పవన్ కల్యాణ్ విప్పిన చిట్టాతో వైసీపీ సర్కారు విలవిలలాడుతున్న పరిస్థితి. వాలంటీర్లపై పవన్ ఆరోపణలు సంధిస్తున్న సమయంలోనే.. విశాఖలో ఒక వాలంటీరు వృద్ధురాలిని హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారం ఎత్తుకెళ్లిన వైనం.. పవన్ ఆరోపణలకు బలమిచ్చేలా చేశాయి. రోజూ వాలంటీర్ల అరాచకాలు మీడియాలో చూస్తున్న జనం.. వారిపై పవన్ చేసే ఆరోపణలు నిజమేనని నమ్మే పరిస్థితి.
తన నివాసం, పార్టీ ఆఫీసును పూర్తి స్థాయిలో మంగళగిరికి మార్చడం ద్వారా, ‘పవన్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్’ అన్న ముద్ర చెరిపేసుకున్నారు. జగన్ సర్కారుపై తాడోపేడో తేల్చుకునేందుకు జనక్షేత్రంలోకి వ చ్చిన పవన్‌కు జననీరాజనాలు పట్టడం వైసీపీకి సహజంగా కలవరం కలిగిస్తోంది. ఒకప్పుడు పవన్‌పై ఉన్న సినిమా అభిమానంతో జనం రాగా, ఇప్పుడు పవన్ ఏ అంశంపై మాట్లాడతారోనన్న ఆసక్తిగా జనం వస్తున్న పరిస్థితి.
వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు కంట్లో నలుసు- కాలిలో ముల్లులా మారిన సొంత పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వైసీపీకి తలనొప్పిలా తయారయ్యారు. ఏపీ సర్కారు అడ్డదారుల్లో తెచ్చుకుంటున్న అప్పులను, రాజు బట్టబయలు చేస్తున్నారు. శాంతిభద్రతలు, ఆర్ధిక వ్యవహారాలు, కాంట్రాక్టులు, నియామకాలపై ఎంపీ రాజు కేంద్రానికి చేస్తున్న ఫిర్యాదులు.. జగన్ సర్కారుకు శిరోభారంగా పరిణమించాయి. ఒకరకంగా.. వైసీపీలో తెరవెనుక ఏం జరుగుతోందో, రాజుగారే బీజేపీకి ఉప్పందిస్తున్నారు.
ఢిల్లీ వేదికగా ప్రతిరోజు రచ్చబండ పెడుతున్న రాజు.. రోజుకో సంచలనాలకు బయటపెడుతున్నారు. సోషల్‌మీడియాలో, ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు పోగయ్యారు. ప్రధానంగా పార్టీ-ప్రభుత్వంలో ఎవరికీ తెలియని అంత:పుర రహస్యాలను బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటివరకూ వందల సంఖ్యలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా రాజు చే సిన ఫిర్యాదులు, కేంద్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. ఎప్పుడంటే అప్పుడు ప్రధాని నుంచి.. కేంద్రమంత్రులతో భేటీ అయి, జగనన్న సర్కారుపై ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి.
రాజధాని అమరావతి నుంచి.. సర్పంచులకు నిధులు ఎగవేసిన అంశాల వరకూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా, ఢిల్లీలో ఆందోళన నిర్వహించే బాధితులకు రఘురామరాజు వెలుగుదివ్వె. ఆయన ఆ బాధితులందరికీ ఢిల్లీలో ఆశ్రయమిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన వారి బాగోగులు ఆయనే చూసుకుంటున్నారు. వారిని కేంద్రమంత్రుల దగ్గరకు ఆయనే తీసుకువెళుతున్నారు.
జగన్ సర్కారు అక్రమాల గురించి సమస్త సమాచార ం ఉన్న వారంతా ఇప్పుడు, ఎంపి రాజును సంప్రదిస్తున్న పరిస్థితి. రాజు గారి రచ్చబండను, సోషల్‌మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలో అవుతున్నారంటే.. ఆయన ఎంతమందిని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రభావితం చేస్తున్నారో స్పష్టమవుతుంది. అయినా సొంత పార్టీని చెడుగుడు ఆడి, మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న రఘురామను, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేని నిస్సహాయత వైసీపీ నాయకత్వానిది.
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇద్దరు తెలుగు ప్రముఖులకు, అక్కడి తెలుగువారు నీరాజనాలు పట్టారు. వారితో సెల్ఫీలకు పోటీలు పడ్డారు. వారిని తమ ఇంటికి భోజనాలు రమ్మని అభ్యర్ధించారు. వారిలో ఒకరు ఎంపి రఘురామకృష్ణంరాజయితే, మరొకరు డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. తానా సభల్లో వారిద్దరే అందరినీ ఆకర్షించిన ప్రముఖులు. ఎన్‌ఆర్‌ఐలు ఏపీ రాజకీయాల గురించి, కేవలం రఘురామరాజుతో మాత్రమే చర్చించారంటే.. ఆయన ఇమేజ్ ఏ స్ధాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఇక కమలదళపతి పురందేశ్వరి కూడా జగన్‌పై యుద్ధానికి తెరలేపారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులను, జగనన్న సర్కారు ఏవిధంగా దారిమళ్లించిందో ఆమె ప్రతి వేదికపైనా వివరిస్తున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌కు దానిపై స్వయంగా ఫిర్యాదు చేశారు. గతంలో సోము వీర్రాజు సీఎం జగన్‌ను విమర్శించేందుకు భయపడిన పరిస్థితి. ఇప్పుడు పురందేశ్వరి నేరుగా జగన్‌పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైనం.
కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెరో వైపు నిలబడి.. జగన్ సర్కారుపై యుద్ధం చేస్తుండటంతో.. ప్రజలు ఆ పార్టీ వైపు చూడటం మొదలుపెడుతున్న పరిస్థితి. ఫలితంగా సుజనా, సత్య వైసీపీ సోషల్‌మీడియా సైన్యానికి లక్ష్యంగా మారారు. మొత్తంగా.. నాటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాటి రోజులను, పురందీశ్వరి టీమ్ మళ్లీ గుర్తుచేస్తున్న వైనం.
ఇక జగన్ సర్కారుపై మీడియా వేదికగా సమరశంఖం పూరిస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు ఒంటరి యుద్ధం .. మేధావులు, దళితులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక టీవీ చానెల్ చర్చా వేదికలో.. నాటి బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డిని చెప్పుతో కొట్టడం ద్వారా, కొలికిపూడి ఏపీ ప్రజలకు గుర్తుండిపోయారు.
ఎంతోమంది ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చిన కొలికపూడికి, ఏపీపై ఉన్న అవగాహన అపారం. కులాలపై ఆయన చేసిన సర్వే, వివిధ అంశాలపై కొలికపూడి చేసే విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంటాయి. జగనన్న సర్కారుకు వ్యతిరేకంగా, దళితులను కూడగడుతున్న కొలికపూడికి సోషల్‌మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అమరావతి కోసం కొలికపూడి నిర్వహించిన పాదయాత్రకు జనస్పందన లభించింది. ఇప్పుడు ఆయన కూడా జగనన్న సర్కారుపై యుద్ధం చేస్తున్న ఒక సేనాని.