– 24న రాజమండ్రిలో ‘మహాత్మ ఫూలే – మహిళలు’ అంశంపై సదస్సు
మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా మహాత్మ జ్యోతిబా ఫూలే స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ 150వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ నిర్ణయించింది. ఈనెల 24న రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో ‘ మహాత్మ ఫూలే – సత్యశోధక్ సమాజ్ – మహిళలు’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం వెల్లడించారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని, మహాత్మ ఫూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఫూల్ స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ప్రధాన ఉద్దేశం, ఫలితాల సాధన తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. సదస్సుకు మహిళా ప్రతినిధులు భారీగా తరలిరానున్నట్లు ఆమె తెలిపారు.