– జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని బెస్తల డిమాండ్
– మాకు ఏ రాజకీయ పార్టీ అండదండలు ఉంటాయో వారితోనే మా ప్రయాణమని ముక్త కంఠంతో నినదించిన బెస్త కుల సంఘీయులు
– విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద గ్రేటర్ రాయలసీమ బెస్తల రాజ్యాధికార దీక్ష
విజయవాడ: బెస్తలకు చట్ట సభల్లో ప్రాతినిథ్యం కల్పించాలని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద గ్రేటర్ రాయలసీమ బెస్తల రాజ్యాధికార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు గ్రేటర్ రాయలసీమతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న బెస్తలు విచ్చేసి సంఘీభావం తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో బెస్త కులస్తుల జనాభా దాదాపు 25 లక్షలు ఉన్నప్పటికీ 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం కూడా ఇంత వరకు బెస్త కులం నుంచి చట్టసభలలో ప్రాతినిథ్యం లేకపోవడం ప్రజా స్వామ్యానికి తీరని మచ్చ అని దీక్షలో కూర్చున్న బెస్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బెస్తలను రాజకీయ పార్టీలు నేటి వరకు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ గానీ .. ఈ కులానికి ప్రాధాన్యతనిచ్చిన పాపాన పోలేదని విమర్శించారు.
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బెస్త కులాన్ని గుర్తించి ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన పదవులలో, చట్టసభలలో అవకాశం కల్పించాలని, అలాగే నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని బెస్తలంతా ఒక తాటి పైకి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నామని, మాకు ఏ రాజకీయ పార్టీ అండదండలు ఉంటాయో వారితోనే మా ప్రయాణమని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని, నామినేటెడ్ పోస్టులలో కేవలం బెస్త కార్పొరేషన్లే కాకుండా ఇతర కార్పొరేషన్‌లలో కూడా బెస్తలకు ప్రాతినిథ్యం కల్పించాలని, గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీ మేరకు బెస్తలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.