– ఆగస్టు 6న శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
– తెలంగాణలో మొత్తం 39 అమృత్ భారత్ స్టేషన్లు
– తొలివిడతలో రూ.894 కోట్ల వ్యయంతో 21 స్టేషన్లలో పనులు ప్రారంభం
– ఈ పథకం ద్వారా.. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణీకుల సౌకర్యార్థం వసతుల కల్పన, స్వచ్ఛత, ఉచిత వైఫై తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి
1 ఆగస్టు, 2023, హైదరాబాద్: దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలతో ఆధునీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణలో మొత్తం 39 స్టేషన్లను గుర్తించి వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి విడతగా తెలంగాణ నుంచి 21 స్టేషన్లకు సంబంధించిన పనులు ఆగస్టు 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ప్రారంభించిన ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకంలో భాగంగా.. స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లో స్వచ్ఛత ఉండేలా చూడటం, ప్రయాణీకులు వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండే గదులు), టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించడం, స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’ దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటి ఏర్పాట్లు చేస్తారు. స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు.
దీంతోపాటుగా అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, నగరానికి ఇరువైల ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, సుస్థిర-పర్యావరణ అనుకూల పరిష్కారాలు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, రూఫ్ ప్లాజాలు (అవసరాన్ని బట్టి), దీర్ఘకాలంలో అవసరమయ్యే ఇతర వసతులను కూడా ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకంలో భాగంగా చేపట్టనున్నారు.
ఇవికాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ. 715 కోట్లు, చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి 221 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో మొత్తం గుర్తించిన స్టేషన్లు 39
ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్ (నాంపల్లి), జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూర్, ఉమ్డానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్
మొదటి విడతలో 6 ఆగస్టున ప్రధాని చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్న స్టేషన్లు 21: ఖర్చుచేయనున్న మొత్తం రూ.894 కోట్లు
హైదరాబాద్ (నాంపల్లి) – 309 కోట్లు
నిజామాబాద్ – 53.3 కోట్లు
కామారెడ్డి – 39.9 కోట్లు
మహబూబ్‌నగర్ – 39.9 కోట్లు
మహబూబాబాద్ – 39.7 కోట్లు
మలక్‌పేట్ (హైదరాబాద్)- 36.4 కోట్లు
మల్కాజ్‌గిరి (మేడ్చల్) – 27.6 కోట్లు
ఉప్పుగూడ (హైదరాబాద్)- 26.8 కోట్లు
హఫీజ్ పేట (హైదరాబాద్) – 26.6 కోట్లు
హైటెక్ సిటీ (హైదరాబాద్) – 26.6 కోట్లు
కరీంనగర్ – 26.6 కోట్లు
రామగుండం (పెద్దపల్లి)- 26.5 కోట్లు
ఖమ్మం – 25.4 కోట్లు
మధిర (ఖమ్మం) – 25.4 కోట్లు
జనగాం – 24.5 కోట్లు
యాదాద్రి (యాదాద్రి భువనగిరి)- 24.5 కోట్లు
కాజీపేట జంక్షన్ (హన్మకొండ)- 24.5 కోట్లు
తాండూర్ (వికారాబాద్)- 24.4 కోట్లు
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)- 24.4 కోట్లు
జహీరాబాద్ (సంగారెడ్డి)- 24.4 కోట్లు
ఆదిలాబాద్ – 17.8 కోట్లు