Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్యపై వైసీపీ పెద్దల వద్ద పూర్తి సమాచారం

– వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేసిందవెరో.. చేస్తున్నదెవరో ప్రజలకు తెలుసు
– జి.వెంకట రెడ్డి
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో జగన్ రెడ్డి గుండెల్లో వణుకు మొదలైంది. వివేకా హత్య కేసుపై రాజకీయాలు చేసినవారే.. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి టీడీపీ రాజకీయాలు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజున.. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతలంతా గుండెపోటుతో చనిపోయారన్నారు. తర్వాత సాయంత్రానికి హత్య అని ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలకు మధ్యలో.. హత్యా ప్రాంతంలోని సాక్ష్యాధారాలన్నింటినీ తుడిపేయడం, డెడ్ బాడీకి కుట్లు వేసి, కట్లు కట్టడం వాస్తవం కాదా.? ఇంతా చేసి.. సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ భారీ కథనాలు వేయించారు. హత్య సంగతి తెలిసి కూడా.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేశారు. ఇది రాజకీయం కాదా.?
ఉన్నత స్థానానికి ఎదగడం కోసం కుట్రలు, కుతంత్రాలు, హత్యలకు పాల్పడుతున్నారంటూ పత్రికలో రాసుకొచ్చారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎదగడం కోసమంటూ రాయడం నీచరాజకీయం కాదా.? ముఖ్యమంత్రి పదవికోసం ఇలాంటి హత్యలకు పాల్పడి.. దాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేస్తారా.? గుండెపోటా.. గొడ్డలిపోటా అని తెలిసి కూడా ఫక్తు రాతలు రాయడం వైసీపీ కుట్ర రాజకీయం కాదా.? ఆ రోజు అంతటి రాతలు రాసినా గానీ.. హత్యపై తెలుగుదేశం పార్టీ ఇచ్చే వివరణ ప్రజల్లోకి వెళ్లకుండా హైకోర్టు నుండి గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం నిజం కాదా.? హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదంటూ గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎందుకోసమో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
ఎన్నికల్లో లబ్ది కోసం శవరాజకీయాలు చేసింది ఎవరు.? కేంద్ర పెద్దలతో ఉన్న పరిచయాలను అడ్డు పెట్టుకుని కడప జిల్లా ఎస్పీని మార్చింది నిజం కాదా? డీజీపీని, ఎన్నికల కమిషనర్ ను మార్చింది నిజం కాదా.? మార్చి 10న ఎన్నికల కోడ్ వస్తే.. మార్చి 15న హత్య జరిగింది. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేని సమయంలో అధికారుల్ని మార్చింది ఎవరు.? దీని వెనుక వైసీపీ ప్రమేయం లేదని చెప్పగలరా.?
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా.. సొంత చిన్నాన్న హత్యపై విచారణ జరపకపోవడం, సిట్ వేసినా.. 9 నెలల్లో ఏం విచారించారు.? మరోవైపు.. సీబీఐ విచారణ కూడా అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి.? రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని సొంత చెల్లెలు హైకోర్టుకు వెళ్లి పోరాడడంతో.. మార్చి 30, 2020న సీబీఐ విచారణకు ఆదేశించడం నిజం కాదా.? వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఇస్తే.. దానిపై టీడీపీ రాజకీయం చేస్తోందని వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు. ఆగస్టులో ఇచ్చిన వాంగ్మూలం వివరాలను ఇప్పుడు బయటపెట్టారు. వాటిని మీడియా కవర్ చేస్తే విమర్శలు చేస్తారా?
మీడియాలో కథనాలు చేయకూడదంటే.. సాక్షిలో ఎందుకు రాశారు.? పబ్లిక్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్ పై వార్తా కథనాలు వస్తే తప్పా? రాజకీయం చేయడమా.?శవాలపై రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. హత్య ఎలా జరిగిందో.. ఎందుకు జరిగిందో పులివెందులలో ప్రతి ఒక్కరికీ తెలుసు. సీబీఐ విచారణ జరపాలని చెప్పి తర్వాత వద్దని జగన్ రెడ్డి ఎందుకు ధ్వంద్వ వైఖరి అనుసరించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎంత సేపూ రాజకీయం చేయడమనే ఆలోచనే తప్ప.. అందులో నిజా నిజాలు అవసరం లేదా.? మీ పార్టీక చెందిన వ్యక్తిని అంత ఘోరంగా చంపినట్లు వాంగ్మూలంలో ఉంటే.. కనీసం బాధపడకుండా.. రాజకీయం చేస్తున్నారు. హత్యపై బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సానుభూతి తెలియజేస్తే రాజకీయం చేస్తోందంటారా.? బుద్ధి ఉందా.?
వివేకా హత్య ఎవరు చేశారో.. ఎందుకు చేశారో.. రాష్ట్రమంతా తెలుసు. అధికారంలో ఉన్న పార్టీ విచారణను మరింత పారదర్శకంగా జరిగేలా చూడాలి. ప్రభుత్వానికి హత్య కేసుపై చిత్తశుద్ది ఉంటే.. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపై కేసు పెట్టాలి. మీడియా ముందుకు వచ్చి ఫక్తు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నేతలు.. కేసులు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు.? ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోవడం లేదు.? ఏదైనా సంఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడితే.. ఆధారాలిమ్మని నోటీసులు ఇస్తున్నారు.
ఇప్పుడు హత్యలో ఉన్నవారి పేర్లు బయటకొచ్చాయి. వారిపై ఏం చర్యలు తీసుకున్నారు.? ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.? కనీస విచారణ కూడా చేయకపోగా.. తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైంది. పరిపాలన చేతకాక.. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీపై ఏడవడం ఇంకా ఎన్నాళ్లు.? మీరు చేయబోయే కుట్రలు, చేస్తున్న కుతంత్రాలను టీడీపీకి ఆపాదించడం అలవాటైపోయింది.
వివేకా హత్యపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన వైసీపీ నాయకులు.. టీడీపీ నేతలు మాత్రం హత్య గురించి మాట్లాడకూడదని హైకోర్టు నుండి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చారో సమాధానం చెప్పాలి. ప్రభుత్వానిక ఈ హత్యపై చిత్తశుద్ధి ఉంటే.. విచారణను వేగవంతం చేయాలి. హత్య వెనుక ఉన్నారంటున్న పెద్దలపై తక్షణమే విచారణ జరిపించాలి. దోషులకు శిక్ష పడేలా సీబీఐకి ప్రభుత్వం సహకరించాలి.

LEAVE A RESPONSE