మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

ఈ నెల 2, 3వ తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కీలక నాయకులు నగరానికి వస్తున్నారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరిగే ఈ సమావేశాల కోసం శనివారం హైదరాబాద్ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు నగరంలోనే ఉంటారు.

హైదరాబాద్ లో తొలిసారి జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని చూస్తున్నారు. సీఎం కేసీ ఆర్, టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రధాని రెండు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్…
ఢిల్లీ నుంచి శనివారం మధ్యాహ్నం 2.55కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 3.00కు బేగం పేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 3.20కి హెచ్ ఐసీసీ నోవాటెల్ కి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొంటారు.

ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4. 30 వరకు బీజేపీ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారు. సమావేశాలు ముగిసిన తర్వాత సాయంత్రం 6.15 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్ కు వస్తారు. 6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత నోవాటెల్ లేదా రాజ్ భవన్ లో మోదీ బస చేస్తారు.

సోమవారం ఉదయం 9.20కు బేగంపేట ఎయిర్ పోర్టుకి వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనం అవుతారు. 10.10 నిమిషాలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి భీమవరంలో జరిగే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారు.

Leave a Reply