– రేసులో క్రిశాంక్?
– గతంలో 2400 ఓట్ల తేడాతో సాయన్నపై ఓడిన నగేష్
– నగేష్ కు కేసీఆర్, క్రిశాంక్‌కు కేటీఆర్ మద్దతు
– నియోజకవర్గంలో నాగేష్‌కే క్యాడర్ మద్దతు
– సాయన్న కూతురుకే ఇవ్వాలంటున్న ఆయన అనుచరులు
– కేసీఆర్ మాట నెగ్గుతుందా? కేటీఆర్ పలుకుబడి పనిచేస్తుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి భర్తీపై చర్చకు తెరలేచింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు, మరో రెండు నెలల్లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పార్టీ ఇన్చార్జిని నియమించడం అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేష్, క్రిశాంక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సాయన్న కుమార్తె నివేదితకు ఇన్చార్జి ఇవ్వాలని, ఆయన అనుచరులు డిమాండ్ చేస్తుండటంతో, ఇన్చార్జి పదవికి త్రిముఖ పోటీ ఏర్పడింది.
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సాయన్నపై, బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన గజ్జెల నగేష్ 2400 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్, మూడవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తర్వాత సాయన్న బీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన గజ్జెల నగేష్ , అతి తక్కువ ఓట్ల తేడాతో సాయన్నపై ఓడిపోయారు. అప్పటి నుంచీ ఆయన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ సాయన్న తర్వాత, గజ్జెల నగేష్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
కాగా, మరో రెండు నెలల్లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఉన్న సమయంలో, నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్చార్జిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి పదవి ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. కేసీఆర్‌కు అనుచరుడిగా ఉన్న గజ్జెల నగేష్, ఉద్యమం తొలి నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు. మధ్యలో పార్టీ మారలేదు. ఆ విశ్వాసంతోనే నగేష్‌కు, అబ్కారీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, మిగిలిన వారిలా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగించకపోవడంతో, నగేష్‌పై నాయకత్వం సదభిప్రాయంతో ఉంది.
పైగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి, ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నగేష్‌కే, ఇన్చార్జి పదవి ఇవ్వడం నైతికమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వివాదరహితుడు, అన్ని వర్గాలను సమన్వయం చేసుకునే శక్తి సామర్థ్యాలున్నందున, నగేష్‌కే ఇన్చార్జి పదవి ఇవ్వాలన్న అభిప్రాయం బీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పైగా నియోజవవర్గంలో మాలల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, అదే వర్గానికి చెందిన నగేష్‌కు ఇన్చార్జి పదవి ఇవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో మాలల ఓట్లు చీలినందుకే, సాయన్న గెలిచి నగేష్ తక్కువ ఓట్ల తేడాతో ఓడారని విశ్లేషిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన యువనేత క్రిశాంక్‌కు మంత్రి కేటీఆర్ ఆశీస్సులున్నాయి. ఆ కోణంలోనే ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ లభించింది. జాతీయ రాజకీయాలపై అవగాహన.. ఇంగ్లీషుపై పట్టు ఉన్న క్రిశాంక్, ఇప్పుడు పార్టీ పక్షాన జాతీయ మీడియాలో చర్చలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న క్రిశాంక్‌కే, నియోజకవర్గ ఇన్చార్జి పదవి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
అయితే క్రిశాంక్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం.. నియోజకవర్గంలో మాదిగల సంఖ్య తక్కువగా ఉన్నందున.. ఆ వర్గానికి చెందిన క్రిశాంక్‌కు ఇన్చార్జి ఇస్తే పెద్దగా ఫలితం ఉండదని మరికొందరు వాదిస్తున్నారు.
ఇక సాయన్న జీవించిన కాలంలో, ఆయన కూతురు నివేదిత నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులపై ఆమెనే స్పందించేవారు. అధికారులతో చర్చించడం, నిధుల విడుదల వంటి కీలక అంశాలన్నీ ఆమెనే పర్యవేక్షించేవారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే, తన కుమార్తెకు సీటు ఇవ్వాలని సాయన్న, పార్టీ నాయకత్వాన్ని చాలాసార్లు కోరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈనెల 16న కేటీఆర్ నిర్వహించిన ఓ సమావేశంలో.. ఆ మేరకు సాయన్న, తన మనోగతం వెల్లడించారని ఆయన అనుచరులు వెల్లడించారు. అందువల్ల సాయన్న కూతురు నివేదితకే ఇన్చార్జి పదవి ఇవ్వడం ద్వారా, సాయన్నను గౌరవించాలన్నది ఆయన అనుచరుల డిమాండ్.
అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇన్చార్జి రేసులో గజ్జెల నగేష్, క్రిశాంత్ మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని, బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నారు. అయితే.. ఈ అంశంలో కేసీఆర్ మాట నెగ్గుతుందా? కేటీఆర్ పలుకుబడి నిలుస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.