– గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు
– అబద్దాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు
– మహిళలకు 2500 ఇవ్వకుండానే మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్ అనడం సిగ్గుచేటు
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు గాంధీ కుటుంబం బాధ్యత వహించాలని, హామీల అమలుపై బాధ్యత తీసుకోని సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా ? అని నిలదీశారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని, స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, కాబట్టి బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని, ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావనే లేదని విమర్శించారు. అబద్దాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతామని స్పష్టం చేశారు. రూ. లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని, దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, ఈ హామీని అమలు చేయకుండానే మహాలక్ష్మీ పథకం గేమ్ చెంజర్ అని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రాన్ని వెనక్కి నడిపిస్తూ పురోగమిస్తుందని శుద్ధ అబద్ధాలు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరు తనానికి అద్దంపడుతోందని తీవ్రంగా విమర్శించారు.
రైతులకు సంపూర్ణంగా రుణ మాఫీ, రైతు భరోసా అమలు చేయకుండానే గొప్పగా అమలు చేశామని చెప్పుకోవడం దారుణమని, ఇది ప్రభుత్వ అసమర్థతను తేటతెల్లం చేస్తున్నదని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.