Suryaa.co.in

Andhra Pradesh

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం

– సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం
– సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి
– పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య
– ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో “” సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ — ది రోల్ అఫ్ ప్రజావాణి అండ్ ప్రజా పాలన ఇన్ తెలంగాణ “” అనే అంశంపై సింపోసియం

అమరావతి: సమస్య మూలాలకు వెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని, సీఎం ప్రజావాణిలో ఇదే తరహా పద్ధతిని తాము అనుసరిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు.

బుధవారం ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో “” సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ — ది రోల్ అఫ్ ప్రజావాణి అండ్ ప్రజా పాలన ఇన్ తెలంగాణ “” అనే అంశంపై జరిగిన సింపోసియంలో చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో సీఎం ప్రజావాణి అధికారులు, సిబ్బంది అంకితభావంతో బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణి ఇప్పటివరకు 110 వారాలు పూర్తి చేసుకుందని, ఇప్పటివరకు 92,072 దరఖాస్తు వచ్చాయని, అందులో వివిధ సమస్యలపై 53,303 దరఖాస్తులు రాగా అందులో 35,001 దరఖాస్తులను పరిష్కరించినట్లు చిన్నారెడ్డి వివరించారు.

దరఖాస్తులు సక్సెస్ రేటు 66% ఉందని ఆయన తెలిపారు. మిగతా 38,769 దరఖాస్తులు వివిధ పథకాల కోసం రావడంతో వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులకు పంపినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని ప్రజావాణి కి వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజల్లో విశ్వాసం కలుగుతోందని ఇది కదా ప్రజాపాలన అని చిన్నారెడ్డి అన్నారు.

దరఖాస్థులలో ఎక్కువ శాతం ఇళ్ల కోసం, రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం వస్తున్నాయని, ధరణి లోపాలపై కూడా చాలా దరఖాస్తులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజావాణిలో పకడ్బందీగా సిస్టం ఏర్పాటు చేశామని, శాఖల వారీగా డెస్క్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, స్టేట్ నోడల్ ఆఫీసర్, ఆన్లైన్ ద్వారా ఆయా శాఖలకు దరఖాస్థులు పంపించి మానిటరింగ్ చేసే డెస్క్, ట్రాకింగ్ డెస్క్ వ్యవస్థ పనిచేస్తోందని చిన్నారెడ్డి వివరించారు.దరఖాస్థు లు తాము స్వీకరించడమే కాకుండా వాటిపై ఎందర్స్మెంట్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నారనిచిన్నారెడ్డి తెలిపారు.

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలోనే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు దివ్య పేర్కొన్నారు.

హైడ్రా కమీషనర్ వీ. రంగనాధ్ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, నాలాలను చెరబట్టిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నామని, ప్రభుత్వ భూములు, ఆస్తులను కబ్జా చేస్తే సహించేది లేదని రంగనాధ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ కెప్టెన్ లింగాల పాండురంగా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE