– తనపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదు
– మీర్‌పేటలో రాత్రి వేళ దారుణం
– కారులోనే మహిళపై సామూహిక అత్యాచారం
– రక్షణ లేని ‘రాజధాని’
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం పేరు జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ప్రపంచంలో బడా సంస్థలన్నీ రాజధానికి తరలివస్తున్నాయని పాలకులు సగర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తగా ఏఐ అదనపు ప్రచార వస్తువుగా మారింది. వచ్చి పోయే పెట్టుబడిదారులతో పత్రికల్లో ప్రచారం హోరెత్తుతోంది.
కానీ.. మరోవైపు మహిళలకు ‘రక్షణలేని రాజధాని’గా మారుతున్న ఆందోళన . నడిరోడ్డునే కత్తులతో కిరాతకంగా పొడిచి, దర్జాగా పోలీసులకు లొంగిపోతున్న అరాచక దృశ్యాలు. ఇంకోవైపు మహిళలు రాత్రివేళ సురక్షితంగా ఇంటికి చేరకుండా, మధ్యలోనే అత్యాచారాలకు గురవుతున్న విషాద ఘటనలు.
తాజాగా ఒక విదేశీ యువతిపై ముగ్గురు ముష్కరులు జరిపిన సామూహిక అత్యాచార ఘటన అంతర్జాతీయ స్థాయిలో రాజధాని పరువు తీసింది. జర్మనీకి చెందిన ఓ యువతి తనపై ముగ్గురు కిరాతకలు సామూహిక అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిన వైనం, రాజధాని నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్న దానికి ఓ ప్రమాదకర సంకేతం.
ఆటోల్లో అత్యాచారం చేస్తున్న ముష్కర మూకలు, ఇప్పుడు బరితెగించి కిడ్నాపులు చేసి, కారులో అత్యాచారం చేసే ప్రమాదకర స్థాయికి చేరారు. మరి తప్పెవరిది? శిక్ష ఎవరికి.. ఎప్పుడు?.. ఇదే ఇప్పుడు మహిళా లోకం ముఖ్యమంత్రిపై సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు. ఎందుకంటే.. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే కాబట్టి!
హైదరాబాద్ లో విదేశీ యువతిపై ముగ్గురు యువకులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి మీర్ పేట ప్రాంతంలో జర్మనీకి చెందిన యువతి నడుచుకుంటూ వెళుతోంది. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు.. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఆమెను మీర్ పేట మందమల్లమ్మ సెంటర్ లో కారులోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులో తిప్పుతూ ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు.
అనంతరం ఆమెను అక్కడి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు. జరిగిన ఘటనపై బాధితురాలు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.