భారతదేశపు
ఆర్థిక వ్యవస్థ, చరిత్ర,
సంస్కృతిని …
నాలో ఇముడ్చుకున్న
దివ్య గంగను నేను….!
ఒక్కమారు నాలో స్నానం చేస్తే
జన్మ జన్మల పాపాలనుండి
విముక్తిని కలిగించే
పావన గంగను నేను….!!
ఆధారం లేని జనులకు
ఆధారంగా….
దేవతలకు అమృతంగా….
మునులకు ప్రియంగా….
మరణకాలమందు
నన్ను తలచినవారికి
మోక్షాన్ని ప్రసాదించే
పుణ్య గంగను నేను…!!
త్రివిక్రమావతారమున
నిరాకారియైన నేను..
శంకరుని
రాగాలాపనతో
జలమయమై…
బ్రహ్మ కడిగిన పాదమునుండి ప్రవహించిన
ఆకాశగంగను నేను…!!
భగీరథుని
తపః ఫలితంగా
దేవలోకమునుండి
భూలోకమునకు దిగివచ్చిన
దివిజ గంగను నేను…!!
ప్రవాహ వేగమును
తట్టుకోగల
శక్తి సంపన్నుడైన శంకరుడు….
పుణ్యరాశినైన నన్ను
తన జటాఝూటంలో
ధరింపచేసిన
గంగాభవానిని నేను…!!
జహ్ను మహాముని
యజ్ఞశాలను పావనంచేసి…
భగీరథుని
ముత్తాతల సద్గతికై
పాతాళమునకు వెడలిన
జాహ్నవిని నేను…!!
స్వర్గలోకంలో మందాకినిగా
భూలోకంలో అలకనందగా
పాతాళలోకంలో భోగవతిగా
ప్రవహించిన
త్రిపథ గంగను నేను…!!
వ్యవసాయానికి
ముఖ్యమైన నీటివనరుగా…
ఆర్ధిక పరిస్థితి అభివృద్ధికి,
హరిత విప్లవానికీ ఆలంబనగా
ముల్లోకాలను
పునీతం చేస్తున్నా…నన్ను
పర్యావరణ కాలుష్యంతో
కలుషితం చేస్తున్న…
ఓ మానవా!!…
నీ వికృత బుద్ది మార్చుకో!!…
“గంగమ్మ తల్లిని”నేను…
నన్ను ప్రసన్నం చేసుకో….!!
నలిగల రాధికా రత్న