November 9, 2026

కారాను తెలుసుకో మనసారా!

(మాస్టారి జయంతి సందర్భంగా అక్షరనివాళి)

కాళీపట్నం రామారావు…

ఆయన కల..
కథానిలయం..
ఆయన కళ..
అందరూ మెచ్చేలా రాయడం..

చదువుతూ పెరిగారు..
చదువుతూనే బ్రతికారు..
రాస్తూ రాటుదేరారు..
నేర్చుకుంటూ జీవించారు..
నవ్వుతూనే మరణించారు..
మరణించి కూడా
రచనలలో బ్రతికే ఉన్నారు..!

బోధన వృత్తి..
శోధన ప్రవృత్తి..
పేదోడి కష్టాలే ఇతివృత్తి..
అక్షరాలే సంపత్తి..
రచన ఆయన వ్యాసంగం..
కలం ఆయన శరీరంలో
ప్రధాన అంగం..
రాస్తూనే ఉన్నాడు జీవితంలో
సగభాగం..
రాయడం ఆయన యాగం..
చదవడమే మన యోగం..!

పెన్ను కదిపితే యజ్ఞం..
తను చూసిన సమాజం..
అందులో హెచ్చుతగ్గులు..
బలిసినోడి కతలు..
పేదోడి వెతలు..!

తాను చూసిందీ..
నేర్చుకున్నదీ పది మందికి
చెప్పే ప్రయత్నమే
ఆయన కథ..
అది నీ..నా వ్యధ..
అక్షర బోధ..
ఒలకబోస్తూ ఆయన బాధ..!

ఇంతకీ చదివావా
కారా కథలు..
చదివి ఉంటే
నువ్వూ పట్టవా కలం..
అప్పుడు నీదీ కాదా
కవి కులం..
మాస్టారి రచనలు
కొత్త రచయితలకు
ప్రవచనలు..
ఇలా రాయరా అని చెప్పే
హితవచనలు..
మామూలుగా ఆయన మాటలు ప్రియవచనలు..!

సిక్కోలులో..
ఆ కధానిలయంలో
మాస్టారితో కాసేపు
గడిపితే..
కురుక్షేత్రంలో గీత విని
అర్జనుడు యుద్ధోన్ముఖుడైనట్టు..
నీలోనూ కలం పట్టాలన్న ఉత్సాహం..
ఏదైనా రాయాలన్న ఉద్వేగం..
అలా స్ఫూర్తినివ్వడమే
కాళీపట్నం ఉద్యోగం..!

మాస్టారి జీవితమే
అక్షర “యజ్ఞం”..
ఆయన జీవనమే
రచనల “జీవధార”..
కథలు భావోద్వేగాల
“రుతుపవనాలు”..
మొత్తంగా జీవిత వ్యధాసుధలు
“కారాకథలు”..!

అవార్డులు వరించినా
ఒప్పని మనసు..
కొన్ని అవకరాలు
మాస్టారికి బాగా తెలుసు..
అలుసు కాకపోయినా
ఈ రామారావు
దేనికీ లొంగని
ఘనమైన దినుసు..
అందుకే ఆయన కలం
అయింది సమాజాన్ని
నిలబెట్టిన ఇరుసు..!

మాస్టారూ..
నేనూ చూసాను
మీ దేవాలయాన్ని..
దర్శించాను
ఆ కథానిలయాన్ని..
మీరే చూపిస్తూ ఉంటే..
మీతో కలిసి వేసిన అడుగులు..
మాటాడిన ఆ కాసేపు..
మీ వెనక చూసాను
కాంతి నిండిన
తూరుపు..
మీలో కాంచాను
అక్షరాల వేలుపు..
నా రచనలకు
అదే కదా
తొలి పొద్దుపొడుపు..!

కథా హాలికుడు కాళీపట్నం రామారావు మాస్టారికి వినమ్ర పూర్వక ప్రణామాలతో..

  • సురేష్
    9948546286
Total Visitors: 3,286,102