భాష ఆయన గుండె ఘోష..
అమ్మ గర్భాలయంలో
నవమాసాల
మాతృభాష కోర్సును
పూర్తిచేసి బయటికొచ్చాక
రివర్సులో ఆ అమ్మకే అమ్మభాష నేర్పిన
నిఖార్సు తెలుగోడు..
నీ భాష నీ గుండెని తట్టాలన్నా..
అక్కడి భావాలను వెతికిపట్టాలన్నా
గ్రాంధికం నీ మాధ్యమం..
వ్యవహారికమే నీ ఉద్యమం..
అన్న గిడుగు..
ఈరోజున
నీ భాషా సంస్కృతికి గొడుగు!
తెలుగు మాత్రమే
చదివి ఊరుకోని గిడుగు..
మరిన్ని భాషలు నుడివి
ఎన్నో భాషల
సారమ్ము తెలిసి..
మాతృభాష సొగసు
గని మురిసి..
వ్యావహారికాన్ని వ్యాప్తి చేసి
తెలుగు పొద్దుకు
తానే వేగుచుక్కై..
తెలుగు జాతికి
తానే పెద్దదిక్కై..!
ఎక్కడుంటే అక్కడే పోరు..
మాతృభాష కోసం ఆతృత…
గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు
వ్యవహార భాషోద్యమ
స్థాపక ఘనుడు గిడుగు
చదివితివా..నేర్చితివా
అంటే నీ చదువు అక్కడే ఆగిపోతుందని..
నీకొచ్చిన భాషే
నీ యవ్వారం..
అదే నీ చదువుల సారం..
ఇలా చేసి ఉద్బోధ..
తీర్చినాడు తెలుగోడి బాధ!
గుండె రగిలే భావానికి..
కడుపు మండే ఆకలికి..
ఒళ్లు మరిచే ఉద్వేగానికి..
ఆకాశం లాంటి ఆవేశానికి..
నీ వ్యక్తీకరణ..
నీ భాషలోనే
ధృవీకరణ..
ఎవరి సులువు
వారి వాడుక భాషే..!
అంతేనా..ఆనాడు తెలుగోడి
గుండెల్లో రగిలిన స్వరాజ్యకాంక్ష..
స్వరాష్ట్ర పిపాస..
దిక్కులు పిక్కటిల్లగ
చెప్పాలంటే
నీ నేర్చిన సొంత బాస..
నువ్వు మెచ్చిన నీ యాస..
అది నీకే వర్తింపు…
దాంతోనే తెలుగుకు గుర్తింపు..!
ఇదంతా గిడుగు తెగింపు..
నీ భాష తెనుగింపు..!
తేట తేనియల తెల్లని
పాల మీగడ గిడుగు..
కూరి తెలుగు భాషకు
గొడుగు గిడుగు..!
ఆయన తెలుగు సరస్వతి
నోముల పంట…
ఆయన వాదం అర్థం కాక
తెలుగు వారికి
ఎంత కష్టం
ఎంత నష్టం..!
ఇది పెద్దల మాట..
తేనెల మూట..!!!
వ్యావహారిక భాషోద్యమ
పితామహుడు
గిడుగు రామ్మూర్తి
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286