-గత ప్రభుత్వ నిబంధనలే యథావిథిగా అమలు చేస్తున్నాం
-పైగా గత టీడీపీ ప్రభుత్వంలో కంటే విద్యుత్ టారిఫ్ తగ్గించాం
-దేవుడి పేరుతో రాజకీయం చేస్తే పుట్టగతులుండవు
-ఇకనైనా మత రాజకీయాలు వీడండి.. దుష్ప్రచారం మానండి
-బీజేపీ, టీడీపీ నేతలకు తేల్చి చెప్పిన మాజీ మంత్రి వెల్లంపల్లి
-చవితి పండగ నిర్వహణపై ఏ ఆంక్షలు విధించలేదు
-గతంలో కంటే మండపాల అనుమతి సులభతరం చేశాం
-గతంలో నాలుగు శాఖల పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది
-మేం వచ్చాక సింగిల్ విండో విధానం తీసుకొచ్చాం
-గత టీడీపీ ప్రభుత్వంలో కంటే.. విద్యుత్ టారిఫ్ తగ్గించాం
-ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి వెల్లడి
అసత్యాల ట్రోలింగ్:
వినాయక చవితి పండగ బాగా చేసుకోవాలని ప్రజలంతా చూస్తుంటే టీడీపీ, బీజేపీ రాజకీయం చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. ఏ పని తలపెట్టినా వినాయకుణ్ని పూజించడం ఆనవాయితీ. అలాంటి వినాయక చవితి పండగపై బీజేపీ, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.
వినాయక చవితి పండగకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిందంటూ వారికి వారే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. ఈ పని టీడీపీ ఆఫీస్‌లో జరుగుతోంది. ఆ పోస్టును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానిపై బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి వాటన్నింటిపై ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడారు. డీజీపీతో పాటు, విద్యుత్ శాఖ అధికారులు కూడా వివరణ ఇచ్చారు. అయినా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
అనుమతులకు సింగిల్ విండో:
నిజానికి గత ప్రభుత్వ హయాంలో విధించిన ఆంక్షలనే ఇప్పుడు అమలు చేస్తున్నాం తప్ప, ఒక్కటి కూడా మేం విధించలేదు. గతంలో గణేష్ మండపాల ఏర్పాటు కోసం అగ్నిమాపక శాఖ, పోలీసు, విద్యుత్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్.. ఆ నాలుగింటి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకా గతంలో టీడీపీ. బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వ హయాంలో కన్నా, ఇప్పుడు మేము విద్యుత్ ఛార్జీ తగ్గించాం. గతంలో 250 వాట్స్ వరకు విద్యుత్ వినియోగానికి కూడా రూ.1000 చెల్లించాల్సి వచ్చేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక దాన్ని రూ.500కు తగ్గించింది.
కాబట్టి టీడీపీ నేతలు, బీజేపీ నాయకులు, పవన్‌కళ్యాణ్ వీరెవరికీ ఈ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదు.
గుడులు కూల్చిన చరిత్ర మీది:
గతంలో పుష్కరాల ఏర్పాట్ల పేరుతో అనేక ఆలయాలు కూల్చేశారు.
మేము అలా చేయలేదు. ఆనాడు మా నియోజకవర్గంలోనే 40 గుడులు కూల్చేశారు. అప్పుడు నేను బంద్‌కు పిలుపునిస్తే.. నా బంద్ కాల్‌కు బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ప్రజల్లో స్పందన చూశాక, అప్పుడు బీజేపీ నేతలు దిగి వచ్చారు. ఆనాడు బీజేపీ నేతలు చంద్రబాబుతో అంటకాగి తిరిగారు. అప్పుడు అనేక గుడులు కూల్చినా, బీజేపీ నేతలు పట్టించుకోలేదు. టీడీపీతో సమోధ్యలో ఉన్న పవన్‌కళ్యాణ్ అస్సలు స్పందించలేదు. అందుకే వారు ద్రోహులు. కాబట్టే గత ఎన్నికల్లో అందుకే టీడీపీ, బీజేపీ, జనసేనను చిత్తుగా ప్రజలు ఓడించారు.
మీకు ఆ అర్హత లేదు:
ఆలయాలతో రాజకీయం, మతం పేరుతో రాజకీయాలు చేయడం మీ పని. చీకట్లో రథాలు తగలబెట్టడం, ఆలయాలు కూల్చిన చరిత్ర మీది. ఇది నిజం.
అంతర్వేదిలో రథం తగలబడితే మూడు నెలల్లో కొత్తది నిర్మించాం. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే, చాలా వేగంగా కొత్త విగ్రహం ప్రతిష్టించాం. అందుకే హిందూ దేవాలయాలు, పండగల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు, సోము వీర్రాజుకు, పవన్‌కళ్యాణ్‌కు లేదు.
రాష్ట్రంలో వినాయక చవితి జరుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. కానీ మీరు మతాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు.
విమర్శలు నిందలు మానాలి:
సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తుంటే, దిక్కు తోచక ఈ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం అలాంటి పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా? కాబట్టి సోము వీర్రాజు ఇకనైనా వాస్తవాలు గుర్తించాలి. ప్రభుత్వంపై విమర్శలు, నిందలు మానాలి. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైయస్ జగన్‌ను, ఒక మతానికి పరిమితం చేస్తూ రాజకీయం చేయొద్దు.
ఎంత ధైర్యం?:
వినాయక చవితి పండగ వాడవాడలా ఘనంగా జరగాలని కోరుకునే ప్రభుత్వం మాది. అదే వినాయకుడి విగ్రహం పెట్టి చందాలు వసూలు చేస్తున్న టీడీపీ నేతలు కూడా పార్టీ ఆఫీస్‌లో కూర్చుని, సీఎంగారిని ఏకవచనంతో సంబోధిస్తున్నారు. ఎంత ధైర్యం. కనీసం సంస్కారం లేదు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఎవరు చెంపలు వాయించుకోవాలి:
ఇవాళ మేము అమలు చేస్తున్న నియమాలన్నీ ఆనాడు బీజేపీకి చెందిన మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు రూపొందించినవే. కాబట్టి ఇవాళ ఎవరు చెంపలు వాయించుకుంటారో.. జీవీఎల్ నరసింహారావు వేసుకుంటారా? లేక సోము వీర్రాజు వేసుకుంటారా? ఆలోచించండి.
నిజానికి మా ప్రభుత్వం వచ్చాక గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంలో సింగిల్ విండో విధానాన్ని అమలు చేయడంతో పాటు, విద్యుత్ టారిఫ్ కూడా తగ్గించాం. కాబట్టి వారే చెంపలు వాయించుకోవాలి. ఈ ప్రభుత్వంపై ఇంకా విమర్శలు చేస్తే, çపుట్టగతులు కూడా ఉండవు.
నేను మళ్లీ చెబుతున్నాను. మేము ఇవాళ అమలు చేస్తున్న ఆంక్షలు, నియమాలు గతంలో టీడీపీ, బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం పెట్టినవే. కాబట్టి సోము వీర్రాజును గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలి. ఇది నిజమా? కాదా?
ఇవాళ మా ప్రభుత్వం కనకదుర్గమ్మ గుడిలో అభివృద్ది పనులు కోసం సీఎంగారు రూ.70 కోట్లు మంజూరు చేశారు. నిజానికి ఆనాడు వారు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ఏం చేసినా మీకు దిక్కుండదు:
బీజేపీ నేతలు పాదయాత్ర చేసినా, చివరకు మోకాళ్ల మీద యాత్ర చేసినా ప్రజలు నమ్మబోరు. ఎందుకంటే వారికి ప్రజల్లో విశ్వసనీయత లేదు. నిజానికి రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. రైల్వే జోన్ ఇవ్వలేదు. హోదా కూడా ఇవ్వలేదు. చివరకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీ సర్వనాశనం చేశాయి. బీజేపీకి ఇక్కడ ఓటు లేదు. సీటు కూడా లేదు.
ఇక్కడ జగన్‌గారిని ఎలా ఎదుర్కోవాలో విపక్షాలకు అర్ధం కావడం లేదు. సీఎంగారు విజయవాడ నగర అభివృద్ధి కోసం రూ.150 కోట్లు ఇచ్చారు. అదే విధంగా గ్రామాలకు కూడా నిధులు ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ నాయకులు ఏం చేసినా వారికి ఇక్కడ ఉనికి లేదు. అందుకే మత రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాటలు ఉత్తర ప్రగల్భాలు.. అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.