Suryaa.co.in

National

అభివృద్ధి శూన్యం.. మ‌త రాజ‌కీయ‌మే ప్ర‌ధానం..

– భాజ‌పా పాల‌న‌పై ఏఐసీసీ కార్య‌ద‌ర్శి గిడుగు రుద్ర‌రాజు ఆగ్ర‌హం

న్యూ ఢిల్లీ, : గ‌త ఏనిమిదేళ్ళ ఎన్డీఏ పాల‌నా కాలంలో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను చౌక ధ‌ర‌కు అమ్ముకోవ‌డం, మ‌త‌ప‌ర‌మైన భావోధ్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం, దేశాన్ని అప్పుల‌పాలు చేయ‌డం త‌ప్ప అభివృద్ధి అనేది దేశంలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ఏఐసీసీ కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర‌రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఐదో రోజు సైతం నిరసనలు కొనసాగించాయి. న్యూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి జంతర్‌మంతర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. నిర‌స‌న‌లో ఏడుగురు ఎంపీలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఏఐసీసీ కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర‌రాజు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని పోలీసులు బ‌ల‌వంతంగా అరెస్టు చేసి రాజేంద్ర‌నగ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నందునే.. కేంద్రం ఆయన్ను విచారణ పేరిట వేధిస్తోందని నేతలు ఆరోపించారు.

గిడుగు రుద్ర‌రాజు మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ పాలనలో పెద్ద నోట్ల రద్దు వల్ల మేలు జరగకపోగా, రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ పథకం కూడా ఆ బాటలోదేనని, గత కొన్నేళ్లుగా సైన్యంలో నియామకాల కోసం ఎదురు చూస్తున్న యువతకు అశనిపాతంగా మారిందని దుయ్యబట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప భాజ‌పా పాల‌న‌లో అభివృద్ధి ఏదీ అని గిడుగు రుద్ర‌రాజు ప్ర‌శ్నించారు.

LEAVE A RESPONSE