నా భర్త ఉదయగిరి నారాయణ చావుకు ఎస్సై,కానిస్టేబుల్ కారణం

-నా భర్త ఉదయగిరి నారాయణ చావుకు ఎస్సై కరిముల్లా, కానిస్టేబుల్ శ్రీనివాసులు, వంశీనాయుడే కారణం
– మేం కూలిచేసుకుని బతికేవాళ్లమే కానీ దొంగతనం చేసేటోళ్లం కాదు
– మా సంప్రదాయం ప్రకారం నా భర్త మతదేహాన్ని పూడ్చిపెట్టనీయకుండా పోలీసులొచ్చి బలవంతంగా కాల్చివేయించారు
– నన్ను, నా బిడ్డలను అనాథలుగా మార్చిన వారిని వదలొద్దు…మాకు న్యాయం జరగాలి
– నెల్లూరు రూరల్ మండలం కందమూరులో పరామర్శకు వచ్చిన టీడీపీ నేతల ఎదుట బోరుమన్న నారాయణ భార్య పద్మ

నా భర్త నారాయణ కూలిపనులు చేసుకుని నన్ను, ముగ్గురు బిడ్డల్ని, వికలాంగురాలై మా ఆడపడుచును పోషిస్తున్నాడు. ఉలవరపల్లికి వంశీనాయుడు అనే వ్యక్తి పనికి పిలిస్తే నాలుగు రోజులు వెళ్లాడు..అవసరం కోసం వెయ్యి అప్పు అడిగితే ఇవ్వకపోవడంతో ఆయన వద్దకు పనికెళ్లడం మానేసి మరో రైతు పొలంలో సేద్యం పనులకు వెళ్లాడు. ఒక రోజు వంశీనాయుడు పోలీసులను తీసుకుని వంశీ నాయుడు మా ఇంటికి వచ్చి మీ భర్త మా ఫ్యాక్టరీలో లక్ష రూపాయల వస్తువు దొంగలించాడని నింద వేశారు. చేనులో నారు పెరుకుతున్న నా భర్తను బురద అంటుకున్న దుస్తులతోనే పోలీసులు లాక్కెళ్లారు.సాయంత్రం 6 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో భయంతో పొదలకూరు పోలీసుస్టేషన్ కు వెళ్లాను..అప్పటికే నా భర్తను ఆ వంశీ నాయుడు పోలీసులతో బాగా కొట్టించాడు.తర్వాత సంతకం పెట్టి నా భర్తను ఇంటికి తీసుకొచ్చాను.పోలీసులు, వంశీనాయుడు నన్ను బాగా బాధపెట్టారు..నేను బతకనని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనకు ఏమీ కాదని ధైర్యం చెప్పి ఒదార్చాను.ఇంకోసారి కూడా తీసుకెళ్లి వంశీనాయుడు దగ్గరుండి నా భర్తను దారుణంగా కొట్టించాడు.మూడో సారి కూడా పోలీసులు పిలుస్తున్నారని వెళ్లాడు…తర్వాత అడవిలో ఉరేసినట్టు పెట్టేసినారు…బర్రెలకాడికి పోయినోళ్లు చెబితే నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.నా భర్త చావుతో మేం దిక్కులేనివాళ్లమయిపోయాం…నా బిడ్డలకు న్యాయం చేయాలి. వంశీ నాయుడు, ఎస్సై కరిముల్లా, కానిస్టేబుల్ శ్రీనివాసులు ముగ్గురే నన్ను నా బిడ్డలను అనాథలను చేశారు.మా కుల, కుటుంబ సంప్రదాయం ప్రకారం శవాన్ని గుంతలో పూడ్చుకుంటాం..కానీ చాలా మంది పోలీసులు వచ్చి బలవంతంగా దహనం చేయించారు.కాల్చే వరకూ పోలీసులు అక్కడి నుంచి వెళ్లలేదు..ఏ దిక్కులేని మాకు న్యాయం జరగాలి.

Leave a Reply