Suryaa.co.in

Andhra Pradesh

డబ్బు కొట్టు.. ఉద్యోగం పట్టు

– డబ్బు కట్టి మోసపోయిన బాధితులు
– సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ బెదిరింపు
– జర్నలిస్టు పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
(ఈపూరి రాజారత్నం)

మంగళగిరి: మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమరావతి కి చెందిన గూడూరు ప్రసాద్ అనే జర్నలిస్టు డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మంగళగిరి నియోజకవర్గంలోని డోలాస్ నగర్ కు చెందిన స్థానికుడు రావూరి నగేష్ వృత్తిరీత్యా ఎయిమ్స్ హాస్పటల్లో టిప్పర్ లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గూడూరు ప్రసాద్ ప్రస్తుతం అమరావతిలో నివాసముంటు రిపోర్టర్ గా చలామణి అవుతున్నాడు. స్థానికంగా డోలాస్ నగర్ లో నివాసముంటున్న రావూరి నగేష్ గూడూరు ప్రసాద్ ఇరువురి కుటుంబాలకు స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయి.

అయితే అమరావతిలో రిపోర్టర్ గా చలామణి అవుతున్న గూడూరు ప్రసాద్ స్నేహాన్ని అవకాశంగా తీసుకొని, రావూరి నగేష్ తో ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నమ్మించాడు. ఉద్యోగానికి లక్ష చొప్పున వసూలు చేస్తే కమిషన్ గా 5000 ఇస్తానన్నడంతో, రావురి నగేష్ 10 మంది వద్దను నుండి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసి వివిధ రూపాలలో గూడూరు ప్రసాద్ కు అందించారు .

సంవత్సరం అవుతున్న ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు, రావూరి నగేష్ ను ఒత్తిడి చేయగా గూడూరు ప్రసాద్ పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అనంతరం బాధితులు రావూరి నగేష్, మరియన్న మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అనడంతో లక్ష రూపాయలు చొప్పున, 10 మంది వద్ద నుండి మనిషికి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసి, గూడూరు ప్రసాద్ కు ఇచ్చామని అన్నారు.

ఉద్యోగాలు కల్పించమని ప్రసాద్ ను ఒత్తిడి చేయగా, డబ్బులు సరిపోలేదు. మరో మూడు లక్షలు కావాలనడంతో ,బంగారం తాకట్టు పెట్టి ఇచ్చానని రావూరి నగేష్ చెప్పారు. డబ్బులు తీసుకున్న నాటినుండి కాలయాపన చేస్తూ, ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా బెదిరింపు చర్యలు దిగుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్న మాకు, న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో గూడూరు ప్రసాద్ పై కేసు నమోదు చేశామని చెప్పారు.

LEAVE A RESPONSE