Suryaa.co.in

Telangana

బీజేపీకి ఒక్క అవకాశమివ్వండి

– ఇదే నినాదంతో జనంలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టండి
– పార్టీ కార్యకర్తలకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పిలుపు
– నమ్మిన సిద్ధాంతం, లక్ష్యాల కోసం తెగించి కొట్లాడేది బీజేపీ కార్యకర్తలే
– తెలంగాణలో అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమే
– టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ
– కరీంనగర్ జిల్లా ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో సంజయ్ దిశానిర్దేశం
నమ్ముకున్న సిద్ధాంతం, లక్ష్యాల కోసం తెగించి కొట్లాడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. లక్ష్యసాధన కోసం ప్రాణ త్యాగాలకు కు కూడా వెనుకాడని చరిత్ర బీజేపీ కార్యకర్తలకు ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందని, అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని అన్నారు. ఈసారి ‘బీజేపీకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ మండలంలోని నిగమ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్నబీజేపీ జిల్లా ప్రశిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి బండి సంజయ్ కుమార్ హాజరై ప్రశిక్షణ తరగతుల ఉద్దేశాలను వివరించారు. బీజేపీ సిద్దాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను క్షేత్ర స్థాయిలో ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కర్తవ్యాలపై దిశా నిర్దేశం చేశారు. బీజేపీ శ్రేణుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రశిక్షణా తరగతులు దోహదపడతాయని తెలిపారు.
దేశం, ధర్మం , పార్టీ సిద్ధాంతం కోసం శ్రమించే నిజమైన కార్యకర్తలు బీజేపీలో మాత్రమే ఉన్నారని, ఇది గర్వకారణమని అన్నారు. గతంలో అనేకమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాల కృషి ఫలితం తోనే బీజేపీ నేడు దేశంలో అధికారంలో ఉందని చెప్పారు. 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 303 స్థానాలకు ఎదిగిన విషయాన్ని గుర్తు చేస్తూ… ఇదంతా బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన పార్టీలన్నీ వారసత్వ, అవినీతి, నియంత పార్టీలుగా చలామణి అవుతున్నాయని, ఆయా పార్టీలకు భిన్నంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమే అని ఆయన చెప్పారు.
బీజేపీ ఢిల్లీ పార్టీ, గుజరాత్ పార్టీ అంటూ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై సందిస్తూ ” టీఆర్ఎస్ పుట్టింది 2001లో. ఆ పార్టీ పుట్టకముందే 1997లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. పార్లమెంటు లో తెలంగాణా బిల్లుకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ. నిఖార్సైన తెలంగాణా వాదంతో పనిచేస్తున్న బీజేపీపై టీఆర్ ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టండి.”
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనైపోయిందని, కౌంట్ డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయిందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు. దీంతో ఓర్వలేక , జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యక్తిలా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరారు. క్రమశిక్షణకు మారు పేరు గల కార్యకర్తలు బీజేపీకి సొంతమని, ప్రజల్లోనూ అలాంటి భావన ఉండటంవల్లే సమాజంలో బీజేపీ శ్రేణులకు తగిన గుర్తింపు, విలువ లభిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు.. ఈసారి ‘బీజేపీకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని బండి సంజయ్ ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించారని ఆయన కోరారు. ముగింపు సమావేశానికి ముందు బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ కార్యకర్తలకు పలు అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు.
ప్రశిక్షణ ముగింపు కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి ,ఎర్రబెల్లి సంపత్ రావు రంగు భాస్కరాచారి ,ప్రశిక్షణ బాధ్యులు సాయి నీ మల్లేశం, దురిశెట్టి సంపత్, ఎండి ముజీబ్, స్వామి , బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్, మాడుగుల ప్రవీణ్ కుమార్, జగన్ రెడ్డి, అసoదుద్దీన్, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE