అరుదైన ఫోటో

ఇది చాలా అరుదైన ఫోటో. ఒక చరిత్ర.. ఇలాంటిది మరొక ఫోటో ఉండదేమో!ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి తనయుడు, ప్రముఖ చిత్రకారుడు బుజ్జాయి- 1946లో మద్రాసులో రోడ్డు మీద నడుస్తున్నారు. ఆయన పక్కన శాస్త్రిగారి సహచరులు, అరవిందఘోష్ శిష్యులూ ఉల్లి తిరుపతి గారున్నారు.అప్పుడు బుజ్జాయి వయస్సు 16. పక్కనుంచి ఒక కారు వెళ్ళింది.
అందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారున్నారు.ఆయనకి తిరుపతిగారు తెలుసు. ఆయన్ని చూసి కారాపి ఇద్దరినీ ఎక్కించుకుని ఇప్పుడు ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ లో ఉన్న “గిరిజ” అనే తన ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడాయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. మాటల్లో బుజ్జాయిని తిరుపతిగారు పరిచయం చేసి’ఇతను మంచి చిత్రకారుడు, ఉన్నపాటునే బొమ్మ వేస్తాడు’’ అన్నారట. రాధాకృష్ణన్ గారు ఒక కాగితం తెచ్చి యిచ్చి ఆయన ముందు కూర్చున్నారట. అప్పుడు వేసిన చిత్రం ఇది.
దాని మీద ఆయన తెలుగులో చేసిన సంతకం “రాధాకృష్ణయ్య” అంటూ- అది ఒక చరిత్ర.. బహుశా ఎక్కడా చేసి ఉండరేమో! తర్వాత ఆయన భారత రాష్ట్రపతి కావడం చరిత్ర.. అంతేకాదు. మరో పదేళ్ళ తర్వాత- రాధాకృష్ణన్ మనుమరాలు-పేరు గిరిజ- ఆమె కూతురు బుజ్జాయిగారి కోడలయింది!బుజ్జాయిగారు ఈ మధ్యనే “మానాన్న-నేను” అనే తన జ్ణాపకాలతో ఓ పుస్తకాన్ని ప్రచురించనున్నారు. అందులో ఫొటో ఇది. ఇలాంటి మరెన్నో చిత్రాలతో ఈ పుస్తకరాజం హృద్యంగమంగా వెలువడనుంది.