– మహిళల్ని అవమానించడం అవివేకం
– జగన్ ను ఆదర్శంగా తీసుకున్నారేమో…
– మంత్రి లోకేష్ ఆవేదన
అమరావతి: భూమి కంటే ఎక్కువ భారాన్ని మోసేది మహిళ! విద్యార్థి దశ నుండే మహిళల్ని గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించి సమాజంలో మార్పు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. వైసీపీ నాయకులు మాత్రం ప్రతినిత్యం మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తల్లిని, చెల్లిని మెడ పట్టి ఇంటి నుండి బయటకు గెంటేసిన జగన్ మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో, ఎన్నిసార్లు మహిళలను అవమానించకండి అని చెప్పినా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతల అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. మహిళల్ని గౌరవించడంతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెరిగేలా చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు వైసీపీ నాయకులు కూడా చదవాలని కోరుతున్నాను.