గోలిసోడా..
ఈ రోజు కధాయణం మా ఊర్లో ఒక నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక గాధ. ఆ ఊరి పేరు నరసరావుపేట . గుంటూర్ జిల్లాలో గుంటూర్ తర్వాత పెద్ద ఊరు అదే. అటు రాయలసీమకి ఇటు కోస్తాకి వారధి. ఎందుకంటే రైల్వే అక్కడి వారిని ఇక్కడికి తెచ్చే క్రమంలో వచ్చే పెద్ద ఊరు ఇదే. మా అమ్మ అప్పట్లో కాఫీ అలవాటు నుంచి బయట పడటానికి, సాయంత్రాలు సోడా తాగేది. మా వీధిలో కొంతమంది వాడుకగా తాగేవారు ఉండటంతో, సాయంత్రం అయ్యే సరికి సోడా బండి వచ్చేది. దాంతో పిల్లలందరికి దానిరాకతో ఉత్సాహం వచ్చేది.
ఎందుకంటే సోడా తాగటం కొట్టడం ఒక ఆర్టు ఒక సైన్స్ కాబట్టి. మా లోకల్ సోడా బండి అతని పేరు “మస్తాను” , నాకు ఇప్పటికీ గుర్తే . చేతుల బనీను కాకీ నిక్కరు వేసుకుని, అతను సోడా కొడుతుంటె మా కళ్ళకి అతనొక అపర జేమ్స్ బాండో, సూపర్ మెన్ సూట్ వేసుకున్న బేట్ మాన్లా ఉండేవాడు.
అతను వీధిలోకి రావడమే వీనుల విందైన సంగీతంతో ప్రవహించేవాడు. ఎలా గంటారా, తర్వాత కాలంలో జల తరంగిణి వాద్యంలో పింగాణీ కప్పుల్లో నీళ్ళు పోసి,కర్రతో మోగిస్తుంటే కూడా , మా ఊరి మస్తాను సోడా సీసా సంగీతం ముందు, అది తేలి పోయేది. అతను చెక్క ఓపెనర్‌ను సోడా సీసాల మీద అడ్డంగా లాగుతూ, వీణ మీటుకుంటూ వచ్చే నారద మహామునిలా మా వీధి లోకి వచ్చేవాడు. ఇళ్ళల్లో ఆడుకుంటున్న పిల్లలందరు, పైడ్ పైపర్ కథలో హీరో వెనకాల జేరినట్టు, మస్తాను బండి చుట్టూ మూగేవాళ్ళం.
అతనిదో తోపుడు బండి. ముందు చెక్క చక్రాలు, వెనక సైకిలు చక్రాలు, తర్వాత కర్ర ముక్కలు స్టాండ్ లాగా . అతను బండి ఆపి తిరిగి వెళ్ళే దాకా మాకు బాహుబలి సినిమా అంటే అతని చేసే పని చూడటమే. అంత ఎంటర్ టైన్మెంట్ . అంటే అవి టీవిలు ,గేములు లేని రోజులు కదా.
ఆ బండి మీద, చిన్న చిన్న గదుల్లా ఉన్న చదరాల్లో, సోడా సీసాలుండేవి . వాటిని చల్లగా ఉంచడానికి వరిగడ్డి పరచి, దానిపై గోనె పట్టా కప్పేవాడు . వాటిమీద తరచూ నీళ్ళు జల్లుతూ ఉండేవాడు. అప్పట్లో రెఫ్రిజిరేషన్ లేదు మరి, పైగా ఐసు గడ్డలు చాలా ప్రియం కూడా.
ఇక ఈ సెటప్ అంతా తీసి, ఒక బాటిల్ చంకలో పెట్టుకుని, తన చెక్క ఓపెనర్ తో తీసేవాడు . అప్పుడు వచ్చే కీచుమనే ధ్వని -నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా వినలేదంటే అతిశయోక్తి కాదు. అధమ పక్షం ఆర కిలోమీటర్ దూరం వినిపించేది ఆ సౌండ్ కుయ్యిమంటూ. ఇప్పటిలా, కుస్ మనే చప్పటి శబ్దం, దమ్ముకున్న టపాసు శబ్దం కాదది. సోడాల్లోకి రాజా లాంటి శబ్దం. ఇప్పటికీ నా చెవుల్లో రింగు మంటూ మోగే “సోడా రాజా మస్తాను” తాలూకు జ్ఞాపకం. నలభయ్యేళ్లు, నా చెవుల్లో రింగుమంటూనే వుంది.
సరే అక్కడే ఆగకుండా, ముందుకి కదులుదాం . ఆ తర్వాత మా అమ్మకి, నాకు కొంత మాటల యుద్ధం నడిచి , “నాకు కూడా” అన్న నా మాటని ఆమె సుతరాము పట్టించుకోకుండా సోడా తాగేసి, చివర్లో “ఇదో ఏడువ్” అని కొంచెం ఇచ్చినా, మనసు రాయి చేసుకుని ,”వద్దుపో” అని అలగటం, చక చక జరిగి పోయేది. కొన్ని రోజుల్లో మంచి మూడ్‌లో ఉంటే నాకు ఒక సపరేట్ సోడా దొరికేది .
అయితే నేనేం తక్కువ వాడినా. ఇంకొంచెం ఖరీదైన నిమ్మకాయ సోడా అడిగే వాడిని. అందులో ముందు, ఇంత నిమ్మచెక్క కోసి పిండేసి, దాన్లో ఉప్పు, ఆ పైన కొంచెం మసాలా వేసి ఒక సోడా కలిపి కొడితే నా సామి రంగా .. మూతి అంతా కాసేపు మొద్దు బారి పోయేది . అలా ఉండేది మస్తాను గారి మసాలా సోడా. మీకు ఇది ఊహించుకోడానికే కష్టం కదా. అందుకే ఒక పాత పాట చూపిస్తా చూడండి.
“లక్ష్మీ నివాసం” (1968) చిత్రం లో పద్మనాభం అభినయిస్తూ పాడిన “సోడా.. సోడా… ఆంధ్రా సోడా .. గోలి సోడా జిల్ జిల్ సోడా” పాట గుర్తుందా. పిఠాపురం నాగేశ్వర రావు పాడగా కొసరాజు సాహిత్యం అందించారు. ఇంచుమించు అలానే ఉంటుంది పైన చెప్పిన బండి.
కొంచెం చరిత్ర కూడా చదుకుందాం, ఇది ఎవ్వరూ మీకు చెప్పనిది, ఉచితంగా కోరాలో లభించేది . ఈ సోడాని, హిందీ వాళ్ళు” బాంట “ లేదా” కాంచే వాలి బాటిల్” అంటారు . “కాంచే” అంటే గోళీ అని అర్ధం. ఒకప్పుడు ఇవి అన్నీ బడ్డీ కొట్టులో, కోకాకోలా, మజా ల స్థానంలో దర్జాగా కూర్చుని ఉండేవి.
దీనిలో వాడే సీసా పేరు “కాడ్ నెక్ బాటిల్”(Codd-neck bottles) అని పేరు . ఇవి అసలు చాలా దేశాలలో తయారీయే మానుకున్నారు. 1872 లో లండన్ వాసి “హీరామ్ కాడ్ “ ఒక బాటిల్ తయారు చేసి పేటెంట్ చేశాడు. ఆ కాలంలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. మామూలు సీసాకి రెండు నొక్కులు ఉండే ఈ నమూనాలో గొప్పతనం ఏమంటే, ఒక నొక్కులో ఉండే గోళీ, అదే సీసాకు మూతలా బిగుసుకు పోగలగటం. అయితే ఒక సారి ఓపెన్ అయ్యాక ఆ గోళీ, ఇంకో నొక్కులో ఇరుక్కుని తాగేటప్పుడు అడ్డుగా ఉండకుండా ఉండగలగటం.
ఈ సీసాకి అంచులో ఉన్న రబ్బరు వాషర్ వత్తిడి పెంచినపుడు, గోళీని మూతి గట్టిగా పట్టుకుని, మూత అవసరం లేకుండా లోపలి వస్తువుకి మన్నికని ఇస్తుంది. బ్రిటీషు వారు వెళ్తూ వెళ్తూ, ఇలాంటి సీసా తయారీ ఫేక్టరీని అమ్ముతుంటే, ఉత్తర ప్రదేశ్ లోని “ససాని” ప్రాంతంలో “ఖండేల్ వాల్ గ్లాస్ వర్క్స్” వారు కొనుగోలు చేశారు. అప్పటి నుండి వారే ఈ బాటిళ్ల అతిపెద్ద సరఫరా దారులు . వీరు కాక హైదరాబాద్‌లో, మహా లక్ష్మీ గ్లాస్ వర్క్స్ వారు కూడా ఇలాంటి వాట్ని చేసేవారు.
1892 లో “విలియం పెయింటర్” అనే అతను “క్రౌన్ కేప్ “ లేదా “బాటిల్ స్టాపర్ “కనుక్కునే దాకా ఈ కాడ్నెక్ బాటిల్ రాజ్యం ఏలింది .
జపాన్ లో “రామున్” అనే బ్రాండ్ ఇప్పటికీ ఇలాంటి నమూనా తో ప్లాస్టిక్ బాటిల్ లో పానీయాలు అమ్ముతున్నారు. జపాన్ భాషలో రామున్ అంటే నిమ్మరసం అట.
ఇక ఇప్పుడు మన దేశం లో సోడా కొత్త అవతారాలలో చిన్న చిన్న సీసాల్లో విభిన్న రుచుల్లో కనపడుతుంది. ఉత్తర భారత దేశం లో “బంటా “అనే బ్రాండ్ ఉంది తెలుసా.
చెన్నై చుట్టుపక్కల కోజ్మో (kozzmo ) అనే బ్రాండు పేరుతో గోలి సోడా కి పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నారు. అందుకోసం వారు నిమ్మ,కమలా ,ద్రాక్ష,పన్నీర్ ,నిమ్మ మసాలా ,అనాస (pineapple ) రుచుల్లో తయారు చేసి అమ్ముతున్నారు.
అందుకోసం వారు వాటికి బాగా ప్రాచుర్యం పొందిన ఇంగ్లీషు పాటల పేర్లను .. లెమన్ ట్రీ ,పర్పుల్ హేజ్ ,బెడ్ ఆఫ్ రోజెస్ .. లాంటివి ఎంపిక చేసుకోడం ఒక విశేషం.

## ఇవి నావే )
మాఊర్లో (తిరుపతి) లో గోలి సోడా బ్రాండ్ పేరుతో కొన్ని బండ్లు తిరుగుతాయి. సాయంత్రం అయితే, నలుగురు కూడే స్థలాల్లో, పార్కులు ,బిజీ వీధుల్లో, ఇలాంటి ఫ్లేవర్లతో, సోడాలు అమ్ముతున్నారు. వాటిలో పైన్ ఆపిల్ తెగ అమ్ముడు పోతూ ఉందట.
1947కు ముందు స్వతంత్ర పోరాట సమయంలో, ఇవి నిషేధించ బడ్డాయట . ఎందుకంటే వీటిలో “సున్నం “చేర్చి విసరితే, పేలి విధ్వంసం సృష్టించేవి. ఇప్పటికీ మన సినిమాల్లో హీరో గారు వీటితోటే విలన్ల జీవితాలతో ఆడుకుంటాడు. ఇంకో సినిమాలో, పారిపోయే పర్స్ దొంగపై విసురుతాడు. సినిమాలో కాబట్టి ఏమీ అవదు . మామూలుగా అయితే వాడికి పరలోక ప్రాప్తే .
ఇంతకీ సోడా ఎలా చేస్తారో తెలుసా. నీళ్ళు ,ఉప్పు,అవసరం అయితే, ఫ్లేవర్ కలిపి, బాటిల్ లో పోసి సోడా తయారీ యంత్రం లో ఉన్న ఒక డబ్బాలో పెడతారు. సీసా మూతి వెంట కార్బన్ డై ఆక్సైడ్ .. అదే నండి .. బొగ్గుపులుసు వాయువు, లోపలికి ప్రవేశిస్తుంది. సీసాలో వాయువు బాగా వ్యాపించడానికి, ఆ సీసా ఉన్న డబ్బా మూడు నాలుగు సార్లు పైకి కిందకు తిప్పుతారు. అంతే ,లోపలున్న వాయువు పీడనం వల్ల నొక్కు లో ఉన్న గోళీ పైకి చేరి మూతికి బిగుసుకు పోతుంది.
అదండీ “గోలీసోదాయణం “. విన్న వారికి ,కన్న వారికి మంచి కిక్కు నిచ్చే సోడా లభించు కాక . మంగళం మహత్ .
-ముప్పాళ్ల అప్పారావు