– మంత్రి సత్యప్రసాద్
అమరావతి : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభపరిణామం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నేడు విశాఖకు గూగుల్ ను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చనున్నారు.
విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేలా ఉంది. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ,సమర్ధవంతమైన నాయకత్వం ఉండడంతో రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, ఆక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ రాత్రింబవళ్లు కష్టపడుతూ వివిధ కంపెనీల ప్రతినిధులతో గంటల కొద్ది చర్చల జరిపి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తున్నారు.
ఈ 16 నెలల్లో రాష్ట్రానికి రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయి. గూగుల్ కంపెనీ రాకతో యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు అందనున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరం నేడు ఏఐ, డిజిటల్ సిటీకి రాజధానిగా మారనుంది.