తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం LB ఇండోర్ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ పికిల్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ నిర్వహకులు రావుల శ్రీధర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా 16 రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకున్నారు. మంత్రి పికిల్ బాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని చెప్పారు. క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా ఆడే క్రీడ రానున్న రోజులలో మరింత ప్రజాదరణ పొందుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
క్రీడ అంటే కేవలం క్రికెట్ మాత్రమే అన్న భావన కేంద్ర ప్రభుత్వం ఉందని, అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు క్రీడల అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ ద్వారా వస్తున్న ఆదాయంలో ఇతర క్రీడల అభివృద్ధి కి ఖర్చు చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.