Suryaa.co.in

Editorial

కుర్చీలకే దిక్కులేని దేవదాయ శాఖ

– గుళ్లకే టెండరు పెట్టిన సర్కారు
– అంతోటి దానికి జిల్లా విభజనలెందుకు?
– సీజీఎఫ్‌ ఖాళీ చేశారా?
– బీజేపీ అస్త్రసన్యాసంపై హిందువుల అసంతృప్తి
– వయసయిపోయిన సంఘ్ నేతలే బీజేపీకి దిక్కా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సీఎం జగన్ సర్కారు జిల్లాల సంఖ్యను పెంచింది. సంతోషం. మరి స్వయంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకున్నప్పుడు, వాటికి మౌలిక సదుపాయాలు కూడా సర్కారే కదా ఏర్పాటు చేయాల్సింది? ఆ మేరకు సరిపడా సొమ్ములివ్వాల్సిన బాధ్యత కూడా సర్కారుదే కదా? కానీ.. అందుకు భిన్నంగా, ‘తాంబూలాలిచ్చాం. తన్నుకుచావండన్న’ పద్ధతిలో, ‘మీ ఏర్పాట్లు మీరే చేసుకోండ’ని తన బాధ్యత నుంచి తప్పుకోవడం బాధ్యతారాహిత్యం.

jagan-pattuకొత్త జిల్లాల్లో దేవదాయ శాఖ కార్యాలయాలకు ఇప్పుడు సొమ్ముల సమస్యలొచ్చిపడింది. కొత్త కార్యాలయాలకు ఫర్నీచర్‌కూ దిక్కులేని పరిస్థితి. కుర్చీలు కొనాలన్నా, డీసీలకు టేబుళ్లు కూడా లేని దిక్కుమాలిన స్థితి. మరేం చేయాలి? దేవాలయాల మీద వాలడమే పాలకులకు వచ్చిన దిక్కుమాలిన ఆలోచన. అంటే ఫలానా దేవాలయం నుంచి ఇంత ఇవ్వాలని అడుక్కోవడమే. ఇదోరకం వీరముష్టి అన్నమాట. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, ఆఫీసులకు సొమ్ములివ్వాలని డిపార్టుమెంటు పెద్దలు ఆర్డరేశారు. జిల్లా ఆఫీసులకు సొమ్ములకే దిక్కులేనప్పుడు, ఎవరి మెహర్బానీ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుచేసినట్టన్నది భక్తుల ప్రశ్న. అసలు దేవాలయాల సొమ్ముపై సర్కారు పెత్తనమేమిటి? వక్ఫ్‌బోర్డు కార్యాలయాలకూ మసీదుల నుంచి డబ్బు తీసుకునే దమ్ము ఈ సర్కారుకు ఉందా? అన్నది హిందూ సమాజం సంధిస్తున్న ప్రశ్నాస్త్రం. జవాబిచ్చే దమ్మెవరికి ఉంది?

నిజానికి మిగిలిన శాఖల మాదిరిగా, దేవదాయ శాఖకు ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించదు. ఇంకా సర్కారే కామన్‌గుడ్ ఫండ్ పేరిట, దేవాలయాల నుంచి ఎదురు డబ్బులు తీసుకుంటుంది. ఈ ఏడాది టీటీడీ నుంచి 50 కోట్లు ఇవ్వాలని సర్కారు ఆదేశించిందట. అంటే ఆదాయం వచ్చే ఆలయాలను కేటగిరిగా విభజించి, ఆ నిష్పత్తితో డబ్బు తీసుకుంటుందన్నమాట. ఇది ఒకరకంగా ముష్టి ఎత్తుకోవడం లాంటిదే. ఈ ముష్టెత్తుకునే సంస్కృతి శతాబ్దాల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది.

ఆ శాఖలో కమిషనర్లు, డిప్యూటీ-అసిస్టెంట్ కమిషనర్ల నుంచి, ఈఓల వరకూ ఆలయాలపై వచ్చే ఆదాయంతోనే జీతాలు తీసుకుంటారు. అంటే వీరందరికీ హిందువులిచ్చే కానుకలే దిక్కన్నమాట. ఫలానా పెద్ద దేవాలయంలో ఏదైనా కార్యక్రమం చేయాలని భావించారనుకోండి. ఆ మేరకు అందుబాటులో ఉన్న నిధులతో, ఆలయ పాలకవర్గం ఆ కార్యక్రమం పూర్తిచేసుకునే అధికారం ఉండదు. మళ్లీ దానికి బడ్జెట్, పై అధికారుల నుంచి అనుమతి అవసరం. నయాపైసా ఇవ్వని సర్కారు నుంచి, మతిలేని ఈ అనుమతి ఎందుకో ఇప్పటికీ ఎవరికీ అర్ధంకాని ప్రశ్న. దానిని నిలదీసే దిక్కు కూడా లేదు.

కొత్త జిల్లాల్లోని కొత్త ఆఫీసుల మరమ్మతులు, ఫర్నీచర్‌ ఖర్చులు భరించాలంటూ దేవదాయ కమిషనర్‌ ఆలయాల ఈవోలకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ప్రాంతాలవారీగా కొత్త జిల్లాల్లోని పెద్ద ఆలయాలకు ఆ నగదు ఇచ్చే బాధ్యత ముడిపెట్టారు. కామన్‌గుడ్‌ ఫండ్‌(సీజీఎఫ్‌) నుంచి ఈ నగదును రీయింబర్స్‌ చేస్తామని పేర్కొన్నారు. కానీ ఆలయాల నుంచి ఇలా లక్షలాది రూపాయల నగదు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆలయాల నుంచి దేవదాయశాఖ ఏటా సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ల కింద నిర్దేశిత శాతాల్లో నగదు వసూలు చేస్తోంది. వాటితోనే కమిషనర్‌ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకూ జీతాలు ఇస్తారు. అలాగే ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు సీజీఎఫ్‌ నిధులను వినియోగిస్తారు. ఆ మొత్తాలు మినహా ఆలయాల నుంచి ఎలాంటి నగదును ఏ రూపంలోనూ వసూలుచేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు, రీయింబర్స్‌ అనే పేరుతో ప్రభుత్వం ఆలయాల నుంచి వసూళ్లు చేపడుతోంది. ఈ నగదును ప్రభుత్వం వెచ్చించే వీలున్నప్పటికీ ఆ భారం ఆలయాలపైనే మోపింది. లేదంటే ప్రభుత్వం ముందు నగదు ఇస్తే, సీజీఎఫ్‌ నుంచి ప్రభుత్వానికే రీయింబర్స్‌ చేసే వీలుంది. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా కొత్త జిల్లాల భారం పూర్తిగా ఆలయాలపై వేసింది.

సౌకర్యాల కోసం సొమ్ములు దానం చేయండి
కొన్ని దశాబ్దాల క్రితం ‘సమాధి కడుతున్నాం చందాలివ్వండి’ అనే సినిమా వచ్చినట్లు గుర్తు. ఇప్పుడు సర్కారు దేవదాయ శాఖ జిల్లా కార్యాలయాల కోసం అదే పద్ధతిలో చందాలు అడుక్కోవడం విమర్శలకు దారితీస్తోంది. కొత్త జిల్లాల్లో దేవదాయ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించారు. నగదు అవసరాన్ని బట్టి ఒక్కో ఆలయానికి ఒక్కో జిల్లా బాధ్యత అప్పగించారు.

అనకాపల్లి జిల్లా కార్యాలయానికి నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి రూ.5లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యాలయానికి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి రూ.3లక్షలు, పార్వతీపురం మన్యం జిల్లాకు పైడితల్లి అమ్మవారు, అరసవెల్లి ఆలయాల నుంచి రూ.5లక్షలు, కాకినాడ జిల్లాకు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నుంచి రూ.3లక్షలు, కోనసీమ జిల్లాకు వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రూ.5లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాకు మావూళ్లమ్మ ఆలయం నుంచి రూ.6లక్షలు, కృష్ణా జిల్లాకు మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం నుంచి రూ.8.5లక్షలు, పల్నాడు జిల్లాకు నర్సరావుపేటలోని మహంకాళి ఆలయం నుంచి రూ.4లక్షలు, బాపట్ల జిల్లాకు పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి రూ.5లక్షలు, నంద్యాల జిల్లాకు మహానందీశ్వరస్వామి ఆలయం నుంచి రూ.5లక్షలు, సత్యసాయి జిల్లాకు కస్సాపురం ఆంజనేయస్వామి ఆలయం నుంచి రూ.6లక్షలు, అన్నమయ్య జిల్లాకు వీరభద్రస్వామి, సౌమ్యనాథస్వామి ఆలయాల నుంచి రూ.5లక్షలు, తిరుపతి జిల్లాకు శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం నుంచి రూ.3లక్షలు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆ ఆలయాల ఈవోలు వెంటనే ఈ నగదును ఇవ్వాలని స్పష్టం చేశారు.

తాజా ఆదేశాలతో సీజీఎఫ్‌ నగదు ఖర్చులపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. దేవదాయశాఖ ఏటా ఆలయాలకు వచ్చే ఆదాయంలో సీజీఎఫ్‌ కింద 9శాతం వసూలు చేస్తుంది. ఈ నగదును గతంలో పూర్తిగా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులకే వినియోగించేవారు. కానీ ఇటీవల సీజీఎఫ్‌ నగదును ఏదొక రూపంలో వాడేస్తున్నారు. తాజాగా దేవదాయ కమిషనరేట్‌లో ఈ నగదు నుంచి రూ.10లక్షలు వెచ్చించి గోశాల నిర్మించారు. అలాగే నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలకు భారీగా ఈ నగదు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు డీసీ ఆఫీసు నిర్మాణానికి ఏకంగా రూ.కోటి తీసుకోవాలని ఓ అధికారి ప్రయత్నాలు చేస్తున్నారు. సగటున ఏడాదికి రూ.60కోట్లు వరకూ ఆలయాల నుంచి సీజీఎ్‌ఫకు నగదు వస్తుంది. ఆ నగదును సరైన అవసరాలకు కాకుండా అన్నిటికీ వాడేశారు. దీంతో ఫర్నీచర్‌ కొనడానికి రూ. 63 లక్షలు కూడా లేక ఆలయాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం ఆర్భాటం కోసం కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు విడుదల చేస్తోంది. అందులో ఒక పత్రికకు ఇచ్చే ఒక ప్రకటనకు చేసే ఖర్చులో సగం వెచ్చించినా దేవదాయ శాఖ కార్యాలయాలకు ఫర్నీచర్‌ను సమకూర్చవచ్చు. కానీ, ఆ భారాన్నీ కనాకష్టంనా నెట్టుకువస్తున్న ఆలయాలపైనే మోపడం ఆ శాఖ వర్గాల్నే విస్మయపరుస్తోంది.

బీజేపీది పేపర్ పోరాటమేనా?
bjp-somu-eggజిల్లా కార్యాల యాల కోసం దేవాలయాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్న సర్కారు మతిలేని నిర్ణయాలపై, ప్రత్యక్ష పోరాటాలకు దిగని బీజేపీ తీరుపై హిందూ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి.. జిల్లా అధ్యక్షుల వరకూ పేపర్/మీడియా పోరాటమే తప్ప, ప్రత్యక్ష కార్యాచరణ కరవయిందన్న విమర్శ హిందూ సమాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఇలాంటి మతిలేని నిర్ణయాలపై తిరుగుబాటు చేసి, హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సిన బీజేపీ నాయకత్వం.. కోడిగుడ్లు, సారాయి వంటి మతిలేని- స్థాయి తక్కువ అంశాలపై పాకులాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమాల్లో తిండి, ఐస్‌క్రీములకు

బీజేపీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యం, ఆలయాలలో జరుగుతున్న అన్యాయాలకు ఇవ్వకపోవడం బట్టి.. బీజేపీ హిందూ వ్యవస్థను, కేవలం రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటోందన్న వాస్తవం స్పష్టమవుతోదంటున్నారు.

అటు బీజేపీని నడిపిస్తున్న ఆరెస్సెస్ ఆంధ్రా విభాగం కూడా, వయోభారంతో చేష్టలుడిగి, చైతన్యరహితంగా మారడం తమ దురదృష్టమన్నది హిందూ సంస్థల నేతలు ఆవేదన. అంతర్వేది రథం దహనంపై ఇప్పటివరకూ సీబీఐ విచారణకు, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేని ఆరెస్సెస్ వైఫల్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనంటున్నారు.

LEAVE A RESPONSE