Suryaa.co.in

Editorial

ఐఏఎస్‌లకు సారీ.. ఎమ్మార్వోకు ఆరునెలల జైలు శిక్షతో సరా?

– కోర్టు ధిక్కరణలో విభిన్న తీర్పులపై చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

*ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలలో ఆర్వీకే, ప్రభుత్వ సచివాలయాలు పెట్టవద్దన్న హైకోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు ఎనిమిది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే వారు క్షమాపణ కోరడంతో.. వారందరికీ నెలకోసారి సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి, సొంత ఖర్చులతో సేవచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
* ప్రహరీ గోడ కూల్చవద్దని ఆదేశించినా దానిని లెక్క చేయకుండా కూల్చి.. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు, గాజువాక మండల తహశీల్దార్ లోకేశ్వర్‌రావుకు ఆరు నెలల జైలు శిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు.
– కొద్దిరోజుల వ్యవధిలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జిలు ఇచ్చిన తీర్పులివి. ఈ రెండు తీర్పులూ పత్రికల్లో చదివిన పాఠకులకు వచ్చే సందేహం ఒకటే. నష్టం వేరయినప్పటికీ, జరిగింది తీర్పు ఉల్లంఘనే కాబట్టి.. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా? ఐఏఎస్‌లకు శిక్షలో ఎందుకు మినహాయింపు ఇచ్చారు? క్షమాపణ కోరిన ఐఏఎస్‌లు మళ్లీ సమీక్షకు పిటిషన్ వేయడం ఏమిటి? అసలు వారికి విధించిన శిక్షనే చిన్నది కదా? అన్నదే ప్రజల మెదళ్లను తొలచే సందేహం. దీనిపై ఇటు పత్రికలు చదివే ప్రజలతోపాటు, అటు న్యాయవర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

విశాఖపట్నం జిల్లా గాజువాక కేసులో, బాధితుడు ప్రహరీగోడ కోల్పోయాడు కాబట్టి, అతనికి ఆర్ధికంగా నష్టం జరిగిందనేది నిజం. కోర్టు తీర్పు ఇచ్చినా ఎమ్మార్వో దానిని అమలు చేయలేదు. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద, సదరు తహశీల్దారుకు ఆరునెలల జైలు శిక్ష, రెండువేల రూపాయల జరిమానాకు శిక్షార్హుడే. అందులో ఎవరికీ సానుభూతి గానీ, కోర్టు తీర్పుపై వ్యతిరేక భావం గానీ లేదు. ఉండటానికీ వీల్లేదు.

కానీ.. అలాంటి కోర్టు ధిక్కరణకే పాల్పడ్డ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు విధించిన అదే జైలు శిక్షకు బదులు.. వారి సారీతో సరిపెట్టి, ఆ ఎనిమిది మంది అధికారులకూ.. సామాజిక సేవా శిక్షతో సరిపెట్టడం ఎంతవర కూ సమంజసం? కోర్టు తీర్పును అంగీకరించి, తర్వాత మళ్లీ అదే తీర్పును సమీక్షించాలని కోరిన ఐఏఎస్ అధికారుల అతితెలివికి, మరింత కఠినమైన శిక్ష విధించకుండా.. అసలు తాము విధించిన శిక్ష తక్కువేననడం ఎంత వరకూ సమంజసం? అంటే ఐఏఎస్ అధికారులకు ఒక శిక్ష.. తహశీల్దార్‌కు మరో శిక్షనా? కోర్టు ధిక్కరణ ఒకటే అయినప్పుడు శిక్షల్లో తేడాలెందుకు? అన్నది ఆ రెండు వార్తలు చదివిన బుద్ధిజీవులకు వచ్చిన ధర్మ-న్యాయసందేహం.

ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను సదరు ఏఐఎస్ అధికారులు ధిక్కరించినట్లు.. మీడియాలో ఫొటోలతో సహా రానే వచ్చింది కాబట్టి, ఇక దానిపై సాక్ష్యాధారాలు అనవసరం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా తూ.నా బొడ్డని లెక్కచేయని, ఐఏఎస్ అధికారుల ధిక్కార పర్వానికి కోర్టు దృష్టిలో జైలు శిక్షే సరైదని భావించినప్పుడు.. మళ్లీ వారి క్షమాపణతో దయచూపడటం ఎందుకన్నది, ఆ వార్తలు చదివే ప్రజల ధర్మసందేహం. న్యాయస్థానం దృష్టిలో సామాన్యుడి నుంచి ఐఏఎస్ వరకూ, అంతా సమానమయినప్పుడు.. ఐఏఎస్ అధికారుల కోర్టు ధిక్కరణకు, సారీతో సంతృప్తి చెందడం సమంజసమా అన్నది, కోర్టులపై విపరీతమైన గౌరవం ఉన్న మరికొందరి ధర్మ సందేహం. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు కోర్టుల పుణ్యానే న్యాయం జరుగుతోంది కాబట్టి!

గాజువాక తహసీల్దార్ కూడా పాల్పడింది కోర్టు తీర్పు ఉల్లంఘనే. కోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా, ప్రహరీగోడ కూల్చిన ఘటనలో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం సమంజసమేనన్నది ఆ వార్త చదివిన ప్రజల మనోగతం. అయితే.. ఆ తహసీల్దార్ కూడా అతి తెలివితో.. ‘నాకూ ఐఏఎస్‌ల మాదిరిగానే సంక్షేమ హాస్టళ్లలో సేవ చేసే అవకాశం కల్పించి, జైలు శిక్షను రద్దు చేయండ’ని’ అని కోరనందుకు సంతోషించాలి. నిజంగా ఆ తహశీల్దార్ అలా లా పాయింట్లు తీసి ఉంటే, అతగాడికీ సామాజికసేవ శిక్ష విధించాల్సి వచ్చేదేమో?! ఒకవేళ అతగాడు అదే కోరి ఉంటే.. కోర్టు ఆయన కోరికను మన్నించడం తప్పనిసరి అయ్యేదేమో? ఎందుకంటే ఐఏఎస్‌లకు అలాంటి మినహాయింపులు ఇచ్చినందువల్ల, తహసీల్దార్లకూ ఇవ్వడంలో తప్పేమిటన్న చర్చ తెరపైకి రావడం సహజం కదా?

ఒకే ధిక్కరణ కేసుకు సంబంధించి.. వెలువడిన రెండు విభిన్న తీర్పులపై అటు న్యాయవర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. తహసీల్దార్‌కూ ఐఏఎస్‌ల మాదిరిగానే సారీతో సరిపెట్టి, సామాజికసేవా శిక్ష విధిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు న్యాయవాదుల్లో వినిపిస్తున్నాయి. అసలు అధికారులకు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వనవసరం లేదన్నది మరో వాదన.

CVL-Narasimha-Rao‘ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సమంజసమే. కోర్టు తీర్పు ఉల్లంఘించినందుకు తహసీల్దార్‌కు జైలు శిక్ష విధించాలన్న జడ్జిగారి తీర్పును స్వాగతించాల్సిందే. కానీ.. అంతకుముందు అదే హైకోర్టు ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించి, దానిని అధికారుల సారీతో సామాజిక శిక్షగా మార్చింది. కాబట్టి ఆ కోణంలో చూస్తే తహసీల్దారుకూ అలాంటి సామాజిక శిక్ష ఎందుకు విధించలేదు? ఐఏఎస్‌లకు-కిందిస్థాయి అధికారులకు న్యాయం- శిక్షల్లో తేడాలుంటాయా? అన్న అభిప్రాయం ఏర్పడేందుకు సహజంగానే అవకాశం ఏర్పడుతుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఐఏఎస్‌లకు విధించిన జైలు శిక్షలో మార్పులు చేసి, సామాజిక సేవా శిక్షగా మార్చారు. తహశీల్దార్‌కు మాత్రం ఆరునెలల జైలు శిక్ష విధించారు. రేపు ఎవరైనా క్లర్కు అలాంటి తప్పు చేస్తే అతనికి ఏడాది శిక్ష విధిస్తారా? ఇలా కోర్టు కోర్టుకూ తీర్పుల్లో తేడాలెందుకని సామాన్యుడు ఆలోచించడం సహజం’’ అని ప్రముఖ న్యాయవాది, రక్ష న్యాయసేవాకేంద్రం కన్వీనర్ సీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.

ఐఏఎస్ అధికారులు పాల్పడిన కోర్టు ధిక్కరణకు, తహసీల్దార్ మాదిరిగానే జైలు శిక్షే న్యాయమన్నది చాలామంది అభిప్రాయమని సీవీఎల్ విశ్లేషించారు. కోర్టు తీర్పు తర్వాత పబ్లిక్ మూడ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందన్నారు.

‘కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఐఏఎస్ లేదా ఏపిఎస్‌లను శిక్షించినప్పుడే మిగిలిన వారు రాజ్యాంగం, చట్టాలు అమలుచేస్తారు. అప్పుడే కోర్టులంటే అధికారులకు భయం-గౌరవం ఉంటుంది. లేకపోతే ఐఏఎస్-ఐపిఎస్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఉంటాయన్న సంకేతాలు వెళతాయి. దీనివల్ల కోర్టులపై అధికారులకు భయం పోతుంది. ఐఏఎస్‌లపై విధించిన న్యాయమూర్తి ఇచ్చిన శిక్ష తీర్పును కూడా స్వాగతించాల్సిందే. అలా ఇవ్వడం కూడా గొప్ప విషయం. నాకు తెలిసి ఇప్పటిదాకా దేశంలో అలాంటి వినూత్న తీర్పు ఇచ్చిఉండరు. వారిపై జడ్జికి ఎలాంటి వ్యక్తిగత కోపం ఉండదు. కానీ న్యాయవ్యవస్థను ధిక్కరించినందుకు ఆపాటి శిక్ష విధించడం సమంజసమే. నన్నడిగితే వారికి విధించిన శిక్ష చిన్నది. అయితే, వారికి విధించిన జైలు శిక్షనే అమలుచేసిఉంటే, భవిష్యత్తులో ఇకపై ఏ అధికారీ కోర్టు తీర్పు ఉల్లంఘనకు పాల్పడేందుకు సాహసించరు. ఈ విషయంలో గాజువాక తహసీల్దార్‌కు విధించిన శిక్షలనే ఐఏఎస్‌లకూ అమలుచేస్తే, రాజ్యాంగానికి రక్షణ ఉంటుంద’ని సీవీఎల్ విశ్లేషించారు. ఇప్పటికే ఆంధ్రాలో కోర్టుల జోక్యంతోనే న్యాయం జరుగుతోందన్న అభిప్రాయం సామాన్యుల్లో ఉందన్నారు.

adocate-ravitejaఅయితే.. దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. గాజువాక తహశీల్దారుకు-ఐఏఎస్‌లకు, వృత్తి- విధి నిర్వహణ పరంగా చాలా వ్యత్యాసాలున్నాయన్న వాదన న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి. ‘ ఎమ్మార్వో కోర్టు తీర్పును ప్రత్యక్షంగా అమలుచేయాల్సిన ఇంప్లిమెంటేషన్ వ్యవస్థలో ఉంటారు. కానీ ఏఐఎస్‌లు కోర్టు ఉత్తర్వులను అమలుచేయించే, ఎగ్జిక్యూషన్ వ్యవస్థలో ఉంటారు. ఇద్దరి బాధ్యతలు వేరుగా ఉంటాయి. కాబట్టి రెండు తీర్పులూ వేర్వేరుగా చూడాల్సి ఉంద’ని ఏపీ హైకోర్టు న్యాయవాది రవితేజ వ్యాఖ్యానించారు.

kanakamedalaన్యాయమూర్తి ఇచ్చిన పూర్తి తీర్పు కాపీని చూడకుండా వ్యాఖ్యానించడం సరైంది కాదని సుప్రీంకోర్టు న్యాయవాది, ఎంపీ కనకమేడల రవీందర్ అన్నారు. ‘ ‘‘ఒక కేసులో ఒకరకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి, మరొక కేసులో కూడా అదే రకమైన తీర్పు ఎందుకివ్వకూడదని ప్రశ్నించలేం. కేసు తీవ్రత బట్టి న్యాయమూర్తి తీర్పు ఇస్తారు. కేసు కేసుకూ తేడాలుండాయి. ఆయన తీర్పును ఎవరూ ప్రశ్నించజాలరు. మీరడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే జడ్జిగారిచ్చిన తీర్పు పాఠం చూడాల్సిందే’నని రవీందర్ వివరించారు.

LEAVE A RESPONSE