– తక్కువ గడువుపై అభ్యర్థుల ఆందోళనని అర్థం చేసుకోవాలి
– నాలుగేళ్ల తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రిపరేషన్ గడువులో అన్యాయం
– మరో 90 రోజులు అదనపు గడువు కేటాయించాలి
– ఏపీ సీఎంకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షకి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మరో 90 రోజులు అదనపు సమయం కేటాయించాలని కోరుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి , సీఎం అయ్యాక ఆ మాటే మరిచిపోయారని లేఖలో జగన్ రెడ్డిని ప్రశ్నించారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాక, మరోవైపు ప్రయివేట్ ఉద్యోగాలు లేక యువత నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల తరువాత విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రిపేర్ అయ్యే సమయం తక్కువగా ఉండడం వారిని ఆందోళనకి గురి చేస్తోందన్నారు. ప్రిపరేషన్ కోసం 90 రోజుల కంటే తక్కువ సమయం ఇవ్వడం, మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావడానికి ఏడు పేపర్లు పూర్తి చేయాల్సి ఉన్నందున టెన్షన్ పడుతున్నారని సీఎంకి లేఖలో వివరించారు. మెయిన్స్ ప్రిపరేషన్‌కి ఇచ్చిన గడువుకి అదనంగా మరో 90 రోజుల సమయం కేటాయించాలని సీఎంని లేఖలో కోరారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌కి లేఖ రాసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ఇచ్చిన 85 రోజుల సమయం చాలదని, మరో 3 నెలల అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కేవలం 85 రోజులే ఇచ్చారని, ఏడు పేపర్లు ప్రిపేర్ కావడానికి ఈ సమయం చాలదని పేర్కొన్నారు. మెయిన్స్ పరీక్షకు అన్ని అంశాలలో అవసరమైన లోతైన జ్ఞానం, లోతైన విశ్లేషణ చేసేందుకు ఈ మూడు నెలల సమయం సరిపోదని వివరించారు. మెయిన్స్ పరీక్షకు మరో మూడు నెలల అదనపు సమయం పొడిగించాలని లేఖ ద్వారా చైర్మన్‌ని కోరారు. కొత్తవారితోపాటు, ఉద్యోగాలు చేసుకుని గ్రూప్-1 రాసేవారికి ఈ అదనపు సమయం ప్రిపేర్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు.