– తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న తిరుగుబాట్లు
– తెలంగాణ బీఆర్‌ఎస్‌లో ఆరంభమైన అసమ్మతి అగ్గి
– మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు
– ప్రెస్‌మీట్ పెట్టి మరీ మంత్రి మల్లారెడ్డిపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలు
– బీఆర్‌ఎస్‌కు ఎన్నికల ముందు ఇదో ఇంటిపోరు
– అటు కేసులు, ఇటు తిరుగుబాట్లపై బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి
– టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటు
– సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్ నేతృత్వంలో రేవంత్‌పై ఫైర్
– మనస్తాపంతో పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా
– ఏపీలో మంత్రి పెద్దిరెడ్డి ఎదుటే కదిరి వైసీపీ నేతల ఘర్షణ
– మంత్రి పర్యటనలో చెప్పులు చూపిన వైసీపీ వర్గాలు
– శంకరనారాయణ ఇలాకాలోనూ అదే సీను
– ఎమ్మెల్యే శ్రీదేవి, వంశీపై ఆగని అసమ్మతి స్వరం
– పార్టీ పెద్దలను పట్టించుకోని సీనియర్లు
– సీఎం జగన్‌కు శిరోభారంగా మారిన సీమ నేతల సిగపట్లు
– ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వని ఇద్దరు సీఎంలు
– దానిపై అసంతృప్తితో రగులుతున్న ఎమ్మెల్యేలు
– తెలంగాణలో మంత్రుల పెత్తనంపై ఎమ్మెల్యేల నారాజ్
– ఆంధ్రాలో తమకు విలువ లేదంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
– రెండు ష్ట్రాల్లోనూ పెత్తనమంతా సీఎంలదే
( మార్తి సుబ్రహ్మణ్యం)
పరిమితి దాటితే ఎవరికయినా సమస్యనే. సమస్యను గుర్తించడమే కాదు, సత్వర పరిష్కారం చేయకపోతే అనుభవించేది అధిపతులే. అది వ్యవస్థలకయినా, రాజకీయ పార్టీలకయినా! సంతృప్తి చెందని వాడు అసంతృప్తి చెందుతాడు. సమ్మతించని వాడు అసమ్మతి స్వరం వినిపిస్తాడు. వ్యవహారం అందాకా వచ్చిందంటే, దానికి కారణం అది అధినేత మితిమీరిన అతి ఆత్మవిశ్వాసం. లేదా అంచనా లేని అవగాహనా రాహిత్యం! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రధానంగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్-వైసీపీలో ఇప్పుడు అసమ్మతి అగ్గి రాజుకుంది. మంట ఇప్పుడే మొదలయింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి సీటుకూ అసమ్మతి అగ్గి అంటుకుంది. ఎన్నికలకు పెద్ద సమయం లేదు. ఆలోపు అది కార్చిచ్చుగా మారితే, కొంపలంటుకునేవి పార్టీలవే. రోడ్డెక్కేది పార్టీల శ్రేణులే.
కంటిచూపుతోనే పార్టీని శాసించే బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమస్యల వలయంలో ఉన్న సమయంలో.. కార్మికమంత్రి మల్లారెడ్డిపై, ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తిరుగుబాటు, బీఆర్‌ఎస్ నాయకత్వానికి షాక్ నిచ్చింది. మేడ్చెల్ మంత్రిగా మారిన మల్లారెడ్డి.. అన్ని పదవులూ ఆయన వర్గానికే ఇచ్చుకుంటున్నారంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వైనం, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయింది.
తమకు ప్రొటోకాల్ పాటించడం లేదని, పదవులు ఇప్పించడం లేదంటూ కార్యకర్తలు తమపై ఒత్తిడి తెస్తున్నారన్నది ఐదుగురు ఎమ్మెల్యేల వాదన. ప్రధానంగా మంత్రి మల్లారెడ్డి నామినేటెడ్ పదవులన్నీ.. మేడ్చెల్‌కే ధారాదత్తం చేస్తున్న విషయం అధిష్ఠానానికి చెప్పినా, పట్టించుకోలేదన్నది వారి మరో ఆవేదన. మల్లారెడ్డి తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నది, వారు తెరపైకి తెచ్చిన ప్రధాన ఆరోపణ. వీటిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు, అపాయింట్‌మెంట్ కోసం వేచిచూస్తున్నా, ఆయన నుంచి ఫోన్ రాలేదని ఎమ్మెల్యేలు వాపోయారు.
అయితే.. కేసీఆర్ అనుమతి లేనిదే, ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రిపై తిరుగుబాటు చేయగలరా, అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఐటి దాడుల తర్వాత మంత్రి మల్లారెడ్డి, బీజేపీతో సర్దుబాటు చేసుకున్నారన్న ఉప్పు, కేసీఆర్‌కు అందిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో .. ఐటి దాడుల సమయంలో మల్లారెడ్డికి బాసటగా నిలిచిన ఎమ్మెల్యేలే, ఇప్పుడు మంత్రిపై తిరుగుబాటు చేయడం విస్మయం కలిగిస్తోంది. దీనికి ‘పైవారి’ ఆశీస్సులున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దానివల్ల పరువు పోయేది పార్టీదేనన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
మంత్రిపై ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, అధినేతకు తెలిసి జరిగినా.. తెలియక జరిగినా నష్టమేనంటున్నారు. ఒకవైపు కుమార్తె కవిత సహా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి ఆర్ధికసాయం అందించే వ్యాపారవేత్తలపై వరస వెంట వరస ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్న సమయంలో.. తిరుగుబాట్లు లేవడం కేసీఆర్‌కు శిరోభారమేనంటున్నారు. ఇది మరికొందరు ఎమ్మెల్యేలకు స్పూర్తిగా మారితే , అది పార్టీకే నష్టమన్నది వారి విశ్లేషణ.
అసలు సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడమే, ఈ సమస్యలకు మూలకారణమంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కడియం శ్రీహరి- రాజయ్య, మంత్రి నిరంజన్‌రెడ్డి-ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు-ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, మంత్రి సబిత-మాజీ ఎమ్మెల్యే తీగల కృష్యారెడ్డి మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. వీటిని పరిష్కరించకుండా, ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల.. కేసీఆర్ అంటే నేతల్లో భయం పోయిందని సీనియర్లు చెబుతున్నారు.
తమకెలాంటి అధికారాలు లేవన్న మంత్రుల ఆవేదనలో, అబద్ధం లేదన్నది పార్టీ వర్గాల మరో విశ్లేషణ. నిజానికి తెలంగాణ లో అతికొద్దిమంది మంత్రులు, ప్రగతిభవన్‌తో సాన్నిహిత్యం ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు-ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలకు తప్ప.. ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవన్నది, పార్టీలో చాలా ఏళ్ల నుంచి వినిపించే చర్చ. మంత్రులు వారి నియోజకవర్గాలకే పరిమితం అయిన పరిస్థితి. ఏపీలోనూ అదే పరిస్థితి.
ఎమ్మెల్యేలతో మంత్రులు చర్చించాలని చెప్పినా వాటిని అమలు చేసిన వారెవరూ లేరు. నేరుగా ముఖ్యమంత్రే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్న ఫలితంగా.. మంత్రులను అధికారులు ఖాతరు చేయని, మరో దయనీయం. ఈ విషయంలో కేసీఆర్ కూడా, చంద్రబాబునాయుడు బాటలోనే నడుస్తున్నారన్నది బీఆర్‌ఎస్ వర్గాల వ్యాఖ్య.
అటు తెలంగాణలో అధికారపగ్గాల కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌లోనూ, అసమ్మతి చిచ్చు రేగడం ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పెత్తనం నచ్చని సీనియర్లు, చాలాకాలం నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. గాంధీభవన్‌కు శంకుస్థాపన చేసిన కాలం నుంచీ పనిచేస్తున్న తమను కాదని.. సబ్ జూనియర్ అయిన రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలివ్వడమే, సీనియర్ల అసమ్మతికి అసలు కారణం. ఇన్నాళ్లూ తెరవెనుక నుంచి కథ నడిపించిన.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజన ర్శింహ, జగ్గారెడ్డి లాంటి సీనియర్లంతా, ఇప్పుడు ముసుగుతొలగించి తెరపైకొచ్చేయడమే విశేషం.
రేవంత్‌రెడ్డితో పాటు టీడీపీ నుంచి వచ్చిన డజన్ల మందికి, పీసీసీలో పదవులిచ్చారన్నది సీనియర్ల ఆరోపణ. మునుగోడు ఓటమికి రేవంతుడిదే బాధ్యతన్నది మరో విమర్శ. ఇక తామంతా కోవర్టులమంటూ.. సోషల్‌మీడియాలో సునీల్ కనుగోలు టీమ్ ద్వారా, దుష్ప్రచారం చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఆ విషయాన్ని సిటీ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, స్వయంగా తమకు చెప్పారన్నది వారు చూపించే ఆధారం.
సీనియర్ల ఆరోపణలకు మనస్తాపం చెందిన సీతక్క అండ్ కో 12 మంది, తమ పదవులకు రాజీనామా చేయడం మరో సంచలనం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు, 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఎవరి వైఫల్యం? టీడీపీతో పొత్తు సమయంలో ఆ పార్టీ నుంచి వచ్చిన డబ్బును ఆయనేం చేశారు? ఎన్నికల సమయంలో టికెట్లను ఎంతమందికి అమ్ముకున్నారు? అసలు కోవర్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డేనంటూ.. రేవంత్ వర్గీయులు చేసిన ప్రత్యారోపణ, కాంగ్రెస్‌లో కల్లోలం రేపింది. మొత్తానికి జనవరిలో పాదయాత్ర చేయనున్న రేవంత్‌రెడ్డికి, ఈ పరిణామాలన్నీ ముందరికాళ్ల బంధాలే.
ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీలోనూ తిరుగుబాట్లు మొదలుకావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమలో అసమ్మతి అగ్గి రాజుకోవడం ఆందోళన కలిగించే అంశమే. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే.. కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి- రాష్ట్ర పార్టీ నేత పూలశ్రీనివాసరెడ్డి వైసీపీ వర్గాలు చెప్పులు చూపించి, ఘర్షణకు దిగడం పార్టీలో మారుతున్న పరిణామాలకు పెను సంకేతం. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై అసమ్మతి తిరుగుబాటు తగ్గలేదు.
ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో.. ఇన్చార్జి విశ్వేశ్వరరెడ్డి సోదరుడే అసమ్మతి నేతగా అవత రించి, అందరినీ ఖంగుతినిపించారు. వచ్చే ఎన్నికల్లో సొంత సోదరుడికి సీటు ఇవ్వవద్దని, మైకులోనే డిమాండ్ చేసిన ధిక్కార పరిస్థితి. మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి చిచ్చు రగులుతోంది. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా, ఆయన వ్యతిరేకవర్గం మంత్రి పెద్దిరెడ్డి ఎదుట, నిరసన ప్రదర్శన నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, నిర్భయంగా అసమ్మతి స్వరం వినిపించారు.
హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ను, మంత్రి పెద్దిరెడ్డి ముందే అసమ్మతి నేతలు కడిగేయడం మంత్రిని ఖంగుతినిపించింది. మంత్రి ఎదుట రెండు వర్గాలు బలప్రదర్శన నిర్వహించడంతో, మంత్రి పెద్దిరెడ్డి తలపట్టుకోవలసి వచ్చింది. పెనుకొండ ఎమ్మెల్యే, శంకరనారాయణకు వ్యతిరేకంగా, అసమ్మతి వర్గం పెద్ద ఉద్యమమే ప్రారంభించింది. ఆయన మాకొద్దని నినాదాలు చేసింది.
తాజాగా ఆయనపై పోస్టింగు పెట్టినందుకు.. తనను చావకొట్టారంటూ, మైనారిటీ నేత సాదిక్ పెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయి, పార్టీ పరువు తీసింది. తెనాలిలో తనను సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారంటూ.. జాన్‌పాల్ అనే మైనారిటీ కార్యకర్త, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది.
ఇక గ్రామాల్లో పనులు చేసిన తమకు బిల్లులు ఇవ్వని సొంత సర్కారుపై, వైసీపీ సర్పంచులు తిరుగుబాటు చేస్తున్న పరిిస్థితి. ‘మోదీ ఇస్తున్న నిధులను కూడా లాగేసుకుంటున్న ఈ దొంగ ప్రభుత్వాన్ని మోదీనే కంట్రోల్ చేయాలని’ .. స్వయంగా సత్యసాయి జిల్లా కురమామిడి వైసీపీ సర్పంచ్ సుధాకర్, టీడీపీ నేతలతో చేసిన వ్యాఖ్యలు వైసీపీని కుదిపేశాయి. తమకు నిధులు విడుదల చేయాలంటూ వైసీపీ సర్పంచులు భిక్షాటన చేయడం సంచలనం సృష్టించింది.
అయితే నామినేటెడ్ పదవుల పంపిణీలో జగన్ కంటే, కేసీఆర్‌పైనే సొంత పార్టీలోనే అసమ్మతి ఎక్కువగా ఉంది. ‘అధికారంలోకి రావాలంటే పథకాలు మాత్రమే కాదు, క్యాడర్ కూడా కావాల’న్న.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్య, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు వర్తిస్తాయంటున్నారు.