రాష్ట్రంలో అసలు పెత్తందారీ ఎవరు?

-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ

రాష్ట్రంలో అసలు పెత్తందారీ ఎవరనీ నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెత్తందారులకు, పేదలకు మధ్యే యుద్ధమని చెప్పడం విస్మయాన్ని కలిగించిందన్నారు.ఎస్సీ, ఎస్టీ బీసీ మంత్రులంతా చుట్టూ నిలబడి ఉండగా దర్జాగా తాను కుర్చీలో కూర్చుని ఉన్న ఫోటో పేపర్లో వచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. పెత్తందారుల నుంచి ప్రజలని జగన్మోహన్ రెడ్డి కాపాడాలనుకుంటున్నారా? అని ప్రశ్నించిన ఆయన, కానీ అసలైన పెత్తందారీ ఆయనేనని మర్చిపోతున్నారా?? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఇంకా పెత్తందారీ వ్యవస్థ ఉందా? అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర ఏళ్ల కాలంలో పెత్తందారీ వ్యవస్థ నిర్మూలించలేకపోయామని జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చెబుతున్న క్లాస్ వార్ అంటే ఏమిటో తనకు లాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా అర్థం కాలే నట్టు ఉన్నదని అన్నారు.

ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను… ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి రానివ్వను
ప్రతిపక్ష పార్టీల ఓటు చీలనివ్వనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వనని సత్తనపల్లి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో ఆనందాన్నిచ్చాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 2014లో ప్రతిపక్ష ఓటు చీలనివ్వలేదని, గత ఎన్నికలలో ప్రతిపక్ష ఓట్లు చీలడం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేసినట్లు వెల్లడించారు. పనికిమాలిన విధానాలను అవలంబిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రతిపక్ష ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రజలంతా హర్షిస్తున్నారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ప్రజలు ఎవరితోనైతే పీడించబడుతున్నారో, వారిపై పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం ద్వారా యుద్ధం ప్రకటించారన్నారు. వారాహి మాత శత్రుసంహారానికి ప్రతీక కాబట్టి, పవన్ కళ్యాణ్ తన వాహనానికి ఆ పేరు పెట్టుకొని ఉంటారన్నారు. వారాహి కాదు… నారాహి అని పెట్టుకోవాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవి, దేవతల గురించి చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దని, నారాహి అన్న దేవతే లేదని తెలిపారు. వై నాట్ 175 అంటున్న తమ పార్టీ నాయకులు, ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ విసురుతున్న సవాలను ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. వారానికి, పది రోజులకు ఒక్కసారి వస్తేనే ఇలా బెదిరిపోతున్నారని, ఇక తాను రోజు ప్రజల్లో ఉంటే మీ పరిస్థితి ఏమిటన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమ పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతాయన్నారు. పవన్ కళ్యాణ్ ను తమ పార్టీ నేతలు, మంత్రులు ఎంతగా
రెచ్చగొట్టినా ఆయన మాత్రం ప్రతిపక్షాల ఓటు చీలనివ్వని చెప్పడం అభినందనీయమని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చే స్కీములు నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన లబ్ధిని చేకూర్చే 27 పథకాలను నిలిపి వేసినట్టు అణగారిన వర్గాలకు చెందిన విశ్రాంత అధికారులు తెలియజేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ బూటకమని, నవరత్నాలన్నీ నాటకమని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో… కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ ఎస్టీలకు లబ్ధి చేకూర్చే మెరుగైన పథకాలు అమలు జరిగేవని
తాను మొదటి నుంచి చెబుతున్నానన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు దళిత విశ్రాంత ఐఏఎస్ అధికారులే పేర్కొంటున్నారన్నారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు అందజేస్తున్న సొమ్ము ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులేనని తెలిపారు. అమ్మ ఒడికంటే ఎక్కువ లబ్ధి చేకూర్చే ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి కల్పించే ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలు అమలు చేశాయన్నారు.. ఓట్ల కొనుగోలులో భాగంగా అమ్మబడి వంటి పథకాన్ని అమలు చేస్తూ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని అన్నారు. బీసీ కార్పొరేషన్ ను 70 కార్పొరేషన్లుగా విభజించి ఏ ఒక్క కార్పోరేషన్ కూడా నిధులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. అణగారిన వర్గాల అన్నింటినీ పరిపాలనలో భాగస్వాములను చేయాలన్నదే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొనడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎస్సీ ఎస్టీలకు లబ్ధి చేకూర్చే 27 సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలన్నారు. నా ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ అని చెప్పడం మినహా ముఖ్యమంత్రి ఆయా వర్గాలకు చేస్తున్న మేలు అంటూ ఏమీ లేదని మండిపడ్డారు.

800 మంది ఎంపీలకు లేఖలు రాశా
పోలీస్ కస్టడీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పీవీ సునీల్ కుమార్ తనని చిత్రహింసల గురిచేసిన సంఘటనను వివరిస్తూ, వైద్య నివేదిక పత్రాలను జతచేసి దేశంలోని ఎనిమిది వందల మంది ఎంపీలకు మరొకసారి లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తాను ఈ సంఘటనపై లోక్ సభ ప్రివలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ, కనీసం సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసే వారిని విచారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 19 నెలల తరువాత హైకోర్టును ఆశ్రయిస్తారా? అంటూప్రశ్నించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి లోక్ సభ హక్కుల కమిటీ, స్పీకర్ నేరుగా సిబిఐ, ఎన్ఐఏ విచారణకు ఆదేశించవచ్చునని తెలిపారు. తాను రాసిన లేఖలపై పలువురు ఎంపీలు సానుకూలంగా స్పందించి, న్యాయం జరిగే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారన్నారు. తమ ఆస్తుల హక్కు పత్రాలపై జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి ఫోటో ముద్రించడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు వివరించారు. తాత్కాలిక పరిపాలకుడైన ముఖ్యమంత్రి, ఆయన తండ్రి ఫోటోలను ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల ఆస్తి పత్రాలపై ముద్రించడం ఏమిటంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇదే విషయమై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆస్తి హక్కు పత్రాలపై ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆయన తండ్రి ఫోటోలను ముద్రిస్తే , రానున్న ప్రభుత్వం వాటిని రద్దు చేయడం ఖాయమన్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని ప్రజలు బాధపడుతున్నట్లుగా ప్రతిపక్ష నేతలు అనలేదని, ముఖ్యమంత్రికి స్వయాన బావ అయిన బ్రదర్ అనిల్ అన్నారని గుర్తు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ ఇవ్వగలిగే ఆర్థిక స్తోమత ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందని ఎద్దేవా చేశారు. సినిమాలో నటించడం ద్వారా పవన్ కళ్యాణ్ కు కోట్లాది రూపాయలు అర్జించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆ అవకాశాల్ని కొంత తగ్గించుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply