విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం

రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఎనిమిదేళ్ళు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపకాల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం న్యాయసమ్మతంగా, ధర్మబద్దంగా, త్వరితగతిన ఆస్తుల పంపిణీ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా పరిష్కారంపట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపకుండా ఏళ్ళతరబడి సాచివేత ధోరణి అనుసరిస్తూ వస్తోంది. దీంతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణం. ఆనాడు అడ్డగోలుగా, ప్రజాస్వామిక పద్ధతిలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఏపీకి అన్యాయం చేస్తే ఈనాడు విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఎన్డీయే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు క్రియారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకు పడ్డారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో  విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్రాలకు చెల్లించే జీఎస్టీ పరిహారాన్ని నిలిపివేస్తోంది. మరోవైపు ఆంధ్రా, తెలంగాణ మధ్య ఆస్తులు, ఆర్థిక వనరుల పంపిణీ సమస్యలను పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నందు వలన ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సమస్యలతో సతమమతం అవుతోందని అన్నారు.

12 ఏళ్ళనాటి ధరలతో పోలవరం ఎలా సాధ్యం?
లోపభూయిష్టమైన విధానాలతోనే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం మొదలైందని విజయసాయి రెడ్డి అన్నారు. 2010-11 నాటి ధరలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్ళ క్రితం పెట్రోల్‌ ధర 50 రూపాయలు. ఇప్పుడు లీటరు పెట్రోలు 100 రూపాయలు. కానీ 2010-11 నాటి ధరే ఇప్పటికీ వర్తిస్తుందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో 12 ఏళ్ళ క్రితం నిర్ణయించిన ధరలకే పోలవరం పనులు చేయాలన్న నిర్ణయం కూడా అంతే హాస్యాస్పదం అన్నారు. 2010-11 ధరలతో పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్‌ అయినా ముందుకు వస్తాడా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధంగా ప్రతి దశలో ఏదో ఒక మెలిక పెడుతూ అరకొర నిధులతో కేంద్ర ప్రభుత్వం పీకనులిమేస్తుంటే పోలవరం ప్రాజెక్ట్‌ ఎలా పూర్తవుతుందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్యాయమైన, అశాస్త్రీయ విభజనతోనే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాల్సిందిపోయి రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి వైఖరిని అవలంభిస్తోందని  విజయసాయి రెడ్డి విమర్శించారు.

ప్రభుత్వ ఎరువుల పరిశ్రమలను ఎలా ప్రైవేటీకరిస్తారు?
ఈ ద్రవ్య వినిమయ బిల్లుల్లో అనుబంధ పద్దుల కింద ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షా 9 వేల కేటాయింపులు కోరుతోంది. ఇందులో దాదాపు నాలుగో వంతు నిధులు ఎరువుల దిగుమతి కోసం ఉద్దేశించినవే. అంటే ఎరువుల ఉత్పాదనలో దేశం ఆత్మనిర్భర్‌ కావలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. దేశంలో ఏటా 41.5 లక్షల టన్నులు ఎరువులు ఉత్పత్తి చేయాలన్న కేంద్ర లక్ష్యం నెరవేర లేదు. ఈ లక్ష్య సాధనలో ఇంకా 15 శాతం వెనుకబడి ఉంది. ఎరువుల దిగుమతి బిల్లులను తగ్గించుకోవాలంటే దేశీయంగా ఉత్పత్తిని వేగవంతం చేయాలి. ఈ నేపథ్యంలో లాభాలలో నడుస్తున్న ఎనిమిది ప్రభుత్వ రంగ ఎరువుల తయారీ పరిశ్రమలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా సబబు అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎనిమిది పరిశ్రమలు కరోనా కాలంలో వేయి కోట్ల లాభాలను ఆర్జించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎరువుల ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించాలని చెబుతూనే మరోవైపు వాటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకోవడంలో ఔచిత్యం ఏమిటో ఆర్థిక మంత్రి వివరించాలని ఆయన కోరారు.

ఈ పరిస్థితులు బడ్జెట్ నాటికే ఉన్నాయి కదా!
బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా ఖర్చులు వచ్చినపుడు అనుబంధ పద్దుల ద్వారా వాటిని ఆమోదించకునే అవకాశం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 115 కల్పిస్తోంది. ఆర్థిక మంత్రి కూడా ఇదే నిబంధనను ఉటంకిస్తూ దేశంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకే ఈ అనుబంధ ఖర్చులను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అనుబంధ పద్దులలో అత్యధిక మొత్తాలు ఆహారం, ఎరువులు, ఇంధనం కోసం ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. అది సబబే. కానీ ఆర్థిక మంత్రి చెబుతున్న ఈ పరిస్థితులు అప్పటికప్పుడు ఉత్పన్నం అయినవి కావని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే నాటికే ఈ పరిస్థితులు ఉన్నాయని అందుకే ఎరువుల సబ్సిడీని పెంచాలని ఈ ఏడాది మార్చిలోనే తాను ఇదే సభలో కేంద్ర ప్రభుత్వాన్ని అర్ధించానని ఆయన చెప్పారు. కానీ దీనిపై స్పందించడానికి కేంద్రానికి 9 మాసాలు పట్టిందని అన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచాలని కోరుతూ మార్చిలో గ్రామీణాభివృద్ధి మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశా. దీనిపై స్పందించడానికి ప్రభుత్వానికి 9 నెలలు పట్టింది. సామాన్యుడిపై పెను భారంగా మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పన్నులు తగ్గించాలని కూడా గత మార్చిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దానిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మూడు నెలలు పట్టిందని విజయసాయి రెడ్డి అన్నారు. బడ్జెట్‌లోనే ఈ మూడు రంగాలకు తగినంత కేటాయింపులు చేసే అవకాశం, పరిస్థితి ఉన్నా బడ్జెట్‌ మార్గం వదిలేసి అనుబంధ పద్దుల రూపంలో ఖర్చులకు నిధులు అడగడం సరైన పద్దతి కాదని అన్నారు.

క్షీణిస్తున్న తలసరి జీడీపీ…
జాతీయ స్థూల ఉత్పాదన (జీడీపీ) విషయంలో దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను అధిగమించినట్లుగా ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ తలసరి జీడీపీలో భారత్‌ ప్రపంచంలో 145వ స్థానంలో ఉంది. అదే యుకే 22వ స్థానంలో ఉంది. అంటే 67 కోట్ల జనాభా ఉన్న బ్రిషర్ల ఆర్థిక ఉత్పాదన 140 కోట్ల మంది భారతీయుల ఆర్థిక ఉత్పాదన కంటే ఎంతో ముందంజలో ఉన్నట్లేగా అని విజయసాయి రెడ్డి అన్నారు. గడచిన అయిదేళ్ళలో మన జీడీపీ 12 శాతం పెరిగితే తలసరి జీడీపీ మాత్రం కేవలం 7.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేంద్రంలో భర్తీకాని ఉద్యోగ ఖాళీలు లక్షల్లో…
కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర శాఖల్లో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అంటే ఆమోదించిన ప్రతి 4 ప్రభుత్వ ఉద్యోగాలలో 1 ఉద్యోగం భర్తీ కాలేదు. దేశంలో అత్యధికంగా ఉద్యోగులు కలిగి ఉన్న రైల్వే, రక్షణ, హోం మంత్రిత్వ శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం క్రమంగా తగ్గుతోందని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ ఈ ఏడాది నవంబర్‌ నాటికి పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 9 శాతానికి చేరింది. దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆయన ఆర్థిక మంత్రిని కోరారు.

అసత్యాలను అంకెలతో అల్లుతున్న చిదంబరం…
అంతకు ముందు ఈ బిల్లుపై చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్‌ సభ్యుడు పి.చిదంబరం పేర్కొన్న కొన్ని విషయాలపై విజయసాయి రెడ్డి వివరణ కోరారు. తాను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2013 నవంబర్లో దేశంలో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని రీతిలో 19.93 శాతానికి చేరిన విషయాన్ని ఎలా దాచి పెడతారని ప్రశ్నించారు. యూపీఏ 1 (2004-09 మధ్య) సగటు ద్రవ్యోల్బణం 5.8 శాతం, యూపీఏ 2 (2009-20014)లో 10.4 శాతం ఉండగా ప్రస్తుతం అది 4.7 శాతం మాత్రమే ఉన్నది వాస్తవం కాదా అన్నారు. మొత్తం పన్నుల ఆదాయ వసూళ్ళలో కార్పొరేట్‌ టాక్స్‌ వాటా గణనీయంగా తగ్గిందన్న చిదంబరం ఆరోపణపై మాట్లాడుతూ 2018-2020 మధ్య మొత్తం పన్నుల వసూళ్ళలో కార్పొరేట్‌ టాక్స్‌ 32 శాతం ఉన్న విషయాన్ని విస్మరించారని అన్నారు. కోవిడ్‌ కారణంగా కుదేలైన పారిశ్రామిక రంగానికి ఉపశమనం కల్పించేందుకే ప్రభుత్వం కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే జీడీపీ వృద్ధి ఎందుకు రెట్టింపు కాలేదన్న చిదంబరం ప్రశ్నకు జవాబిస్తూ 2014లో ఆర్థిక మంత్రిగా చిదంబరం నిష్క్రమించే నాటికి జీడీపీలో దేశం ప్రపంచంలో నంబర్‌ పదో స్థానంలో ఉంది. ఆ తదనంతరం ఈ తొమ్మిదేళ్ళ కాలంలో దేశ జీడీపీ ప్రపంచ దేశాల్లో 5వ స్థానంకు చేరిందని చెబుతూ అసత్యపు అంకెలతో సభను తప్పుదారి పట్టించేందుకు చిదంబరం ప్రయత్నిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.

Leave a Reply