– గుడిమల్లం లింగం పరశురామేశ్వరాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలంలో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో గుడిమల్లం లింగం పరశురామేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము.
లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. పురుషాంగం తో లింగానికి ముందు శివుడు అపస్మార పురుష లేక మరు గుజ్జు (యక్ష)బాహువులపై న నిలబడి నట్లు కనిపిస్తాడు .ఇలా ఎక్కడా శివ స్వరూపం మనకు కని పించదు .
స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు.
స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము, క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.
ఎలా వెళ్ళాలి?
గుడిమల్లం చేరుకోవడానికి రోడ్ మార్గం సులభంగా ఉంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలుమార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం: గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయానికి 11కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రైవేట్ వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు.
రైలు మార్గం : గుడిమల్లం సమీపాన రేణిగుంట మరియు తిరుపతికి రైల్వేస్టేషన్లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలున్నాయి.
రోడ్డు మార్గం : రేణిగుంట నుండి 11కి.మీ , తిరుపతి నుండి 22కి.మీ చిత్తూరు నుండి 85కి.మీ. చంద్రగిరి నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటుగా జీపు, షేర్ ఆటోల సౌకర్యం ఉంది.
– కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం
పుంగనూరు