– కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు: భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, అలాగే గుంటూరు ను క్లీన్ సిటీ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలోని చుట్టగుంట , ఏ.టి.అగ్రహారం , కేవిపి కాలనీ లోని జోసఫ్ నగర్ , లక్ష్మీ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించారు. డ్రైన్ల వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి , నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి.. చుట్టుగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాగని డ్రెయిన్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైడ్ కాలువలు విస్తరించని కారణంగా మురుగు పొంగి రోడ్లమీదకు చేరుతుందని ఏటి అగ్రహారం స్థానికులు మంత్రికి తెలిపారు.
సమస్యలపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న 24 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా 60 అడుగుల రోడ్డుగా పెంచే అవకాశం ఉందని తెలిపారు. అయితే కౌన్సిల్ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుందని కార్పొరేషన్ అధికారులు సహాయ మంత్రికి వివరించారు. చంద్రభానుడిగుంట చెరువు ఇటీవల పొంగి నీటి మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ సమీపంలోని నాలుగు కాలనీలు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు తెలియజేయగా, సమస్యకు పరిష్కారం దిశగా సి ఎస్ ఆర్ ఫండ్ లేదా అమృత్ పథకం కింద ఆ ప్రాజెక్టును చేర్చి త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.
స్థానిక జోసఫ్ నగర్, లక్ష్మీ నగర్, నల్లపాడు రోడ్డు వద్ద జరిగిన పరిశీలనలో భాగంగా కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల సామర్థ్యాన్ని బట్టి పది రోజులు మొదలు మూడు, నాలుగు వారాల్లో చెప్పిన పనులు పూర్తి చేయాలని సహాయ మంత్రి స్పష్టం చేశారు. పనిచేయని ఉద్యోగులు, సిబ్బందిపై డిసిప్లినరీ యాక్షన్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్యటనలో ఆదేశించిన ప్రకారం పనులు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. దాతల సహకారంతో నగరంలో త్వరలో సమగ్ర అభివృద్ది పనులు చేపడతామన్నారు. వర్షం నీరు, మురుగు పారుదల లేకుండా నగరంలో పలు ప్రాంతాలలోని డ్రైన్లపై వున్న ఆక్రమణలను తొలగించాల్సి వుందన్నారు. ఆక్రమణలలో కొందరు పేద వారు ఉన్నారని , డ్రైన్లపై వున్న పేద వారిని గుర్తించి వారికి సమస్య పట్ల అవగాహన కల్పించి అర్హులైన వారికి నష్ట పరిహారం ప్రత్యామ్నాయం చూపి ఆక్రమణలు తొలగిస్తామన్నారు.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ జోసఫ్ నగర్ చంద్రభానుడిగుంట చెరువు ఎప్పుడు ఎండని చెరువని, ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పొంగి సుమారు 600 ఇళ్ళలో నీరు చేరి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయన్నారు. త్వరలో చెరువుకు కట్ట ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీఎంసీ అదనపు కమిషనర్ రాజ్యాలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాస్, వెంకట కృష్ణ, ఎస్.ఈ శ్యామ్ సుందర్ , టౌన్ ప్లానర్ రాంబాబు, టీపీఎస్ లక్ష్మణస్వామి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ తదితరులు పాల్గొన్నారు.