Suryaa.co.in

Andhra Pradesh

సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన గొప్ప కవి గుఱ్ఱం జాషువా

  • పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా 129వ జయంతి వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
  • తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాషువా
  • కవి కోకిల గుర్రం జాషువా చూపించిన మార్గం అనుసరణీయం
  • సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన  కావ్యం జాషువా రచించిన గబ్బిలం
  • రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచన
  • కవులు కళాకారుల భుజం తట్టి ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని భరోసా
    నలుగురికి గుర్రం జాషువా కవి కోకిల పురస్కారం -2024 ప్రధానం చేసిన మంత్రి దుర్గేష్

విజయవాడ: ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా అని, సామాజిక ప్రయోజనం ఆశించి ఆయన రచనలు చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కవి కోకిల, కవి విశారద, కళాప్రపూర్ణ గుర్రం జాషువా 129 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు.

జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఎంపిక చేసిన కర్రి సంజీవరావు(శిఖామణి), దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, టి. వరప్రసాద్, పి. రమణయ్యలకు గుర్రం జాషువా కవి కోకిల పురస్కారం -2024 ప్రధానం చేసిన మంత్రి దుర్గేష్ వారిని ఘనంగా సత్కారించి అభినందనలు తెలిపారు. ఒక్కో పురస్కార గ్రహీతకు జ్ఞాపికతో పాటు 50 వేల రూపాయల విలువైన చెక్కును ప్రభుత్వం తరఫున మంత్రి అందించారు.. కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పెయింటింగును మంత్రి ఆసక్తిగా తిలకించారు. కవులు కళాకారులను భుజంతటి ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు వెన్నంటే ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అభిజ్ఞ రసజ్ఞులైన ప్రేక్షకులను ఉద్దేశించి మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ తన కవితాప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, విశ్వమానవుడు గుర్రం జాషువా అని కీర్తించారు..నిరంతరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సతమతమయ్యే తమకు ఆహ్లాదకరమైన జాషువా గారి కవిత సౌరభాన్ని విని తరించే భాగ్యం కలగడం అదృష్టమని మంత్రి అన్నారు .. పద్మభూషణ్ గుర్రం జాషువా అద్భుతమైన సామాజిక కవి అన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించాలని,ఆయన అందించిన స్ఫూర్తికి పునర్ అంకితం కావాలని మంత్రి సూచించారు..

నాటి సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా కొందరు ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా ఎలుగెత్తిచాటితే, గుర్రం జాషువా తనదైన రీతిలో సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించారని మంత్రి వివరించారు.. సామాజిక చైతన్యానికి పెద్దపీట వేసి సాహిత్య ప్రక్రియను సుసంపన్నం చేసిన మహానుభావులు గుర్రం జాషువా అని పేర్కొన్నారు.. గుర్రం జాషువా జీవించిన కాలాన్ని పరిశీలిస్తే సామాజిక వ్యవస్థను బాగు చేయడానికి తపించారని, తప్పును నిర్భయంగా చెప్పారన్నారు.. సాంఘీక దురాచారాలను అరికట్టాలన్న పరంపరను కొనసాగిస్తూనే, తన వారిలో ఉన్న ఇబ్బందులను సరిదిద్దాలని ముందుకు వెళ్లిన నిజమైన కవి గుర్రం జాషువా అన్నారు.

నాడు ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని గుర్తించి వారణాసి విశ్వనాథుడికి ‘గబ్బిలం’ ద్వారా తన ఆవేదనను సందేశం రూపంలో నివేదించిన కవి గుర్రం జాషువా అని మంత్రి తెలిపారు. సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం గుర్రం జాషువా రచించిన గబ్బిలం అన్నారు.. కాటికి వెళ్లాక పెద్ద చిన్న అనే కులాల తేడా లేదని, పేద ధనిక అనే తారతమ్యం లేదని అందరూ సమానం అనే భావనను కలిగించిన వ్యక్తి జాషువా అన్నారు.. గుర్రం జాషువా కవితలు మన జీవితాలను స్పృశిస్తాయి అని, మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలను అంటరానితనమనే మనో వైఖల్యాలను వివరిస్తుంది అన్నారు.. తన ఆత్మ సంతృప్తి కోసమో, రచనలపై మక్కువతోనో జాషువా కావ్యాలు రాయలేదని, సమాజ శ్రేయస్సు, సమాజ హితాన్ని కోరి రచనలు చేసారని వివరించారు.

1964లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన జాషువా తన లాంటి ఎందరికో మార్గదర్శకులన్నారు.. తన రాజకీయ జీవితం లో తొలి పదవి శాసనమండలి సభ్యుడుగానే ప్రారంభమైందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు..

నేడు గుర్రం జాషువా 129వ జయంతిని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వ కార్యక్రమాలను పునర్జీవింప చేయడానికి దోహదపడుతుందన్నారు.. ఆంధ్రప్రదేశ్ కళలు సాంస్కృతిక వైభవం పునర్జీవింప చేయడానికి తాము పునర్ అంకితం అవుతామన్నారు.. సాంస్కృతిక సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని,ఆంధ్రప్రదేశ్ ను సాహితీ పరంగా, కళాపరంగా సుసంపన్నం చేయాలని భావిస్తున్నామన్నారు..

రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కళల పట్ల అభిరుచి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో సాంస్కృతిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామన్నారు.. మన వారిని మనం గౌరవించుకోవడం ద్వారా మన గొప్పదనాన్ని ప్రపంచానికి తెలుపుతున్నామన్నారు.. ప్రతిభ ఎక్కడున్నా వెలికితీయడానికి ఏ రకమైన అడ్డంకులు ఉండవు అన్నారు. సామాజిక చైతన్యానికి అందరం కృషి చేద్దామన్నారు..

ఈ సందర్భంగా కవి సంచిక మాసపత్రిక 50వ సంచికను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు..అందులో ఆధునిక కవిత్రయం శీర్షిక పేరుతో రాసిన కథనం బాగుందన్నారు.. కార్యక్రమంలో పాల్గొనడం తన లభించిన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు..

కార్యక్రమంలో యువజనాభ్యుదయం, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి వాడ్రెవు వినయ్ చంద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎ. శ్రీనివాస్, పూర్వ సంచాలకులు మల్లికార్జున్ కవి కోకిల గుర్రం జాషువా పురస్కార గ్రహీతలు, శాఖాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE