Suryaa.co.in

Andhra Pradesh

ఫించన్ల సొమ్మును సొంత కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టిన జగన్‌రెడ్డి

-సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్ కాదు
-ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్ల పంపిణీ చేయాలి
-టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటివద్దకే నెలకు రూ. నాలుగు వేల పింఛన్‌ అందిస్తోంది
-సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు
-ఖజానాను ఒట్టి కొండను చేసింది నిజం కాదా సజ్జల!
– టిడిపి జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి

సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును జగన్‌రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం ఊడ్చిపెట్టాడు. దీంతో పింఛన్ల సొమ్ములు ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడా డబ్బులు లేకుండా పోయాయి. అందుకే జగన్‌రెడ్డి తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్‌పైనా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పైన దుష్ఫ్రచారానికి పాల్పడుతున్నాడు.

వాలంటీర్లను ప్రజా సేవా కార్యక్రమాలకు కాకుండా జగన్‌రెడ్డి వారిని వైకాపా కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశాడు. వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లకు, వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు జగన్‌రెడ్డి కారకుడయ్యాడు. వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాక జగన్‌రెడ్డి తన పార్టీ కార్యకర్తల్లా దుర్వినియోగం పరిచినందునే ఎన్నికల కమీషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది. పింఛన్‌దారుల పట్ల వైకాపాకు ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానాలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదు.

పించన్లకు నిధుల కొరత పెట్టేవాడు కాదు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి కారణం నిధులు కొరతే గాని ఎన్నికల కమీషన్ కాదు. వైకాపా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసే వాలంటీర్లను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుస్తుంది. పింఛన్‌దారులకు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇంటి వద్దకే పంపిణీ చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పింఛన్ల పంపిణీపై సజ్జల రామకృష్ణారెడ్డి మరో కట్టు కథ అల్లాడు. తమ దుష్ట లక్షణాలను తెలుగుదేశానికి అంటగట్టి చెప్పిన అబద్ధాన్నే వంద సార్లు చెప్పడం సజ్జలకు అలవాటు. పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కారణం జగన్ రెడ్డి. నువ్వు సాక్షి పత్రికలో పని చేసినోడివేగా! నీ సాక్షి పత్రికలో మార్చి 28న పెద్ద అక్షరాలతో ఏప్రిల్ 3న పింఛన్ల పంపిణీ అని ప్రచురించింది నిజం కాదా సజ్జల? అప్పటికీ ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకోలేదు కదా! అంటే దానర్థం పింఛన్ల పంపిణీ చేయడానికి జగన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవంటే… ఉన్న డబ్బులు, తెచ్చిన అప్పులు, పింఛన్ల డబ్బులు కమిషన్‌గా పుచ్చుకొని మీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు.

ఖజానాను ఒట్టి కొండను చేసింది నిజం కాదా సజ్జల! పింఛన్ల పంపిణీ చేయడానికి ప్రభుత్వ ఖజానాలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎందుకు చెప్పలేదు? పింఛన్ డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేసి డబ్బులు లేని కారణంగా 3న పింఛన్ల పంపిణీ అంటూ సాక్షి పత్రికలో రాశారు. ఇప్పుడు వాలంటీర్ల చేత పింఛన్ల పంపిణీని నిమ్మగడ్డ రమేష్, ఎన్నికల కమిషన్ అడ్డుకున్నారని ముసలి కన్నీరు కారుస్తున్నారు. మీ ముసలి కన్నీరును నమ్మటం ప్రజలు మరిచిపోయారు. నాడు గొడ్డలితో కౄరంగా నరికేసి గుండె పోటుతో చనిపోయారని సాక్షి పత్రికలో అబద్ధాలు చెప్పారు. అది గుండె పోటు కాదని ప్రజలు గ్రహించిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని మరో అబద్ధం చెప్పారు.

గొడ్డలి వేటు వెనుక అవినాష్ రెడ్డి, అతని వెనుక తాడెపల్లి ప్యాలెస్ ఉందని తెలిసిన తర్వాత ఇప్పుడు సునీతా రెడ్డి హత్యే చేయించింది కట్టు కథలు అల్లుతున్నారు. ఈసారి మీ అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 2019 ఎన్నికల నాడు చిన్నాన్నను గొడ్డలి వేటుతో చంపేశారు, కోడి కత్తితో హత్యా ప్రయత్నం, ఏదో తిరుమల వెంకటేశ్వరుని పింక్ డైమెండ్ చంద్రబాబు వద్ద ఉందని…ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను తప్పు దారి పట్టించి తర్వాత రాష్ట్రాన్ని అడ్డగోలుగా లూటీ చేశారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు పెంచి ఒక్కో కుటుంబం మీద రూ.8 లక్షల భారం మోపారు. ప్రశ్నించిన ప్రతీ ఒక్కరి మీద వేల కేసులు, దాడులు, దాదాపు 600 మందిని హత్యలు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది.

ఇక జగన్ రెడ్డిని సాగనంపకపోతే మన మానానికి, ఆస్తులకు రక్షణ ఉండదు అన్నీ కబ్జా అవుతాయని ప్రజలు భయపడుతున్నారు. అందుకే నాడు కోడి కత్తి డ్రామాలా వాలంటీర్ల డ్రామాలు ఆడుతున్నారు. నిజంగా పింఛన్ల పంపిణీ చేయాలని శ్రద్ధ ఉంటే సీఎస్ మీ మనిషే కదా! సచివాలయ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శిలు, టీచర్లు వంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా! వాళ్ళతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయవచ్చు కదా!

ఎంతసేపటికీ చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద నిందలు మోపటానికే శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఏ ఒక్క వైసీపీ నాయకుడికి లేదు. మేము ఉద్ధరించడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారని నిన్నటి నుంచి 10 మంది దిగుమతయ్యి తెలుగుదేశంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ శ్రద్ధేదో చీఫ్ సెక్రటరీపై పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గాలపై ఎందుకు డిమాండ్ చేయడం లేదు?

వాలంటీర్ల మీద కపట ప్రేమ కార్చి రాజకీయ నిందలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు. వాలంటీర్ల శ్రేయస్సు కోసం పనిచేయడం లేదు, పెన్షన్ దారుల కోసం పాకులాడటం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం సజ్జల మాట్లాడటం లేదు. ప్రజా సేవ చేయాల్సిన వాలంటీర్లతో వైకాపా పార్టీ తరఫున తప్పుడు పనులు చేయించి సస్పెండ్ చేయించారు. వందల మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. బాగా చదువుకున్న వాలంటీర్ల భవిష్యత్తు నాశనం చేసి వాళ్ళకిచ్చేది రూ.5 వేలా? నీ పార్టీ పని కోసం వాలంటీర్ల జీవితాలను నాశనం చేసిన సజ్జల ఉద్దారకుడిలా మాట్లాడుతున్నాడు. సజ్జల చెప్పిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలు.

తెలుగుదేశం సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదని కబుర్లు చెబుతున్నాడు. సజ్జల సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రాయలసీమలో ఓసీలకు 41 సీట్లు ఉన్నాయి. అందులో 31 సీట్లు సొంత సామాజిక వర్గానికి కేటియించుకున్నారు. ఇదేనా సామాజిక న్యాయమంటే సజ్జలా? రాయలసీమలో ఉన్న మొత్తం 52, నెల్లూరు, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల సీట్లు అన్ని కలుపుకొని 72 సీట్లు ఉన్నాయి. అందులో ఒక్క సీటు కూడా బలిజ సామాజిక వర్గానికి కేటాయించ లేదు.

జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం ఎంత ఉందో బలిజ సామాజికవర్గం కూడా ఆయా నియోజకవర్గాల్లో అంతే ఉన్నారు. 2019లో చిత్తూరు, దర్శిలో బలిజలకు ఇచ్చిన రెండు సీట్లను కూడా పెరికేసి సొంత సామాజికవర్గానికి చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లకు ఇచ్చారు. రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో బీసీలకు ఇచ్చింది కేవలం 7 మాత్రమే. అవి కూడా ఓడిపోయే స్థానాలు. అలాంటిది సజ్జల సామాజిక న్యాయం గురించి మాట్లాడటం హాస్యంగా ఉంది.

పొత్తులు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదు. పొత్తును విడదీయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ రెడ్డి లూటీ, హింస నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అన్ని పార్టీలు ఒకటయ్యాయి. ఊరిలో పడ్డ దొంగను ఊరంతా కలిపి ఏకమై దొంగను పట్టుకున్నట్లు రాష్ట్రంలో ఉన్న ప్రజాసంఘాలు, పార్టీలు, ప్రజలు ఏకమయ్యారు. జనసేన, పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు కపట ప్రేమ కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని, షర్మిలా, చిన్నాన్న వ్యక్తిత్వాన్ని హరణ చేయడానికి సజ్జల చేస్తున్నాడు. మీరు చేసిన ఘోరానికి తగిన రీతిలో బుద్ధి చేప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికైనా పింఛన్ దారులపట్ట, వాలంటీర్ల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా వాలంటీర్లను ఎన్నికల కోడ్‌కు విరుద్ధమైన చర్యల్లో వాళ్ళని భాగస్వాములను చేసి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దు. ఒకటోవ తేది నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో(సచివాలయ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శిలు) ఇంటింటికి పంపించి పింఛను పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. సజ్జలకు ఏమాత్రం నైతిక విలువలున్నా ప్రభుత్వ సలహాదారుడి పదవి నుంచి రాజీనామా చేసి తర్వాత రాజకీయాలు మాట్లాడాలి.

LEAVE A RESPONSE