Suryaa.co.in

Telangana

రేవంత్ పాలనలో కరెంట్,సాగు,తాగునీరు లేవు

-కేసీఆర్ పాలనలో ఎండాకాలం కూడా చెరువులు, కుంటలు నీళ్లతో నిండుగా ఉండేవి
-ఎండిన పంటలకు ఎకరాకు 25వేల చొప్పున నష్టపరిహారం అందించాలి
-కష్టకాలంలో కేకే పార్టీని వీడివెళ్లడం విచారకరం
-గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా గొప్పగా అభివృద్ధి చెందింది
– ఎంపీ రవిచంద్ర

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో చెరువులు, కుంటలు,వాగులు,వంకలు నిండుగా నీళ్లతో కళకళలాడేవని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.పాలేరు రిజర్వాయర్ ను తాను 1993నుంచి చూస్తున్నానని,ఇప్పటి మాదిరిగా ఎప్పుడు కూడా ఎండిపోలేదన్నారు.కేసీఆర్ పాలనలో ఎండాకాలం కూడా చెరువులు,కుంటలు మత్తళ్లు దూకేవని పేర్కొన్నారు.

ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,సండ్ర వెంకటవీరయ్య,బానోతు మదన్ లాల్,మెచ్చా నాగేశ్వరరావు, చంద్రావతి, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,మేయర్ నీరజ,డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం తదితర ప్రముఖులతో కలిసి ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేఖరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,నీళ్లు లేక ఎండిపోతున్న పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లిలో సాగునీళ్లు అందుక ఎండిన పంట పొలాలను చూసి వచ్చామని,రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ పదేళ్ల పాలనకు భిన్నంగా రేవంత్ పరిపాలన కొనసాగుతున్నది,ఆ పదేళ్లు రైతులు,ప్రజలు కరెంట్,సాగు,తాగునీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండి సంతోషిస్తే, ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.

పంటలు ఎండిపోయి విలపిస్తున్న రైతున్నలకు ఎకరాకు 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు అందుకున్న నాయకులు ఈ కష్టకాలంలో పార్టీని వీడివెళ్లడం సమంజసం కాదన్నారు.బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పార్టీని వీడివెళ్లడం తీవ్ర విచారకరమన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లోకసభ లోపల,బయట అలుపెరగని పోరాటం చేసిన,ప్రజల గొంతుకను వినిపించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును నాయకులు,కార్యకర్తలు కష్టపడి బడుగు బలహీన వర్గాల వారిని ఏకోన్ముఖుల్ని చేసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని వద్దిరాజు ధీమాగా చెప్పారు.

LEAVE A RESPONSE