– చేనేత, జౌళి శాఖ మంత్రి సవితతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా భేటీ
అమరావతి: చేనేత సహకార సంఘాల ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. చేనేత జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ఆర్పీ సోసిడియా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు.
ఈ సందర్భంగా చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమన్నారు. ఇందుకనుగుణంగా పలు పథకాలను రూపొందించారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని సిసోడియా కు సూచించారు.
గరిష్ట స్థాయిలో ఆప్కో విక్రయాలు
ఆప్కోలో ప్రక్షాళన చేపట్టాలని, చేనేత వస్త్రాలు విక్రయాలు పెరిగేలా చేనేత బజార్లు విస్తృతంగా నిర్వహించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాకు మంత్రి సూచించారు. ప్రభుత్వ డిపార్ట్ మెంట్ల ఆర్డర్ల మేరకు త్వరితగతిన ఆప్కో ద్వారా క్లాత్ సప్లయ్ చేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లకు దుప్పట్లు, టవళ్లు, ఇతర అవసరాలకు అవసరమయ్యే క్లాత్ ను అందజేయాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన క్లాత్ కు సంబంధించి ఆర్డర్లు సేకరించి, ఆప్కో ద్వారా సప్లయ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సిసోడియాను కోరారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నగరాల్లో చేనేత బజార్లు నిర్వహించాలని, రాష్ట్రంలో క్లస్టర్ల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహణకు సిద్ధమవ్వాలన్నారు.
ఇందుకు కోసం సొసైటీ బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు. చేనేతలు ఆత్మ గౌవరంతో జీవనం సాగించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఆయన ఆశయ సాధనకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా లేపాక్షిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని తెలిపారు.
కస్టమర్లకు ఆకట్టుకునేలా హస్త కళారూపాల తయారీకి కళాకారులను అవసరమైన నైపుణ్య శిక్షణ అందజేయాలన్నారు. ముఖ్యంగా వెదురు, అరటి ఫైబర్ తో తయ్యారయ్యే కళారూపాలను నేటి అభిరుచులకు అనుగుణంగా రూపొదించేలా చూడాలని సిసోడియాకు మంత్రి సవిత సూచించారు.