చిత్తగించండి గురువర్యా..!

68

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాస్టార్లకు
వందనాలు..క్షమాపణలతో

గౌరవం తగ్గి
రౌరవం చూస్తున్న మాస్టారూ..
మీరిప్పుడు మరో'”సారి”
బతకలేక బడిపంతులు..!

మాస్టారంటే దన్నం..
ఇప్పుడేమో
వండుతూ అన్నం..
బడిలో ఖానా..పాయఖానా
అన్నీ అయ్యోరి విధులే..
సర్వేలు చేస్తూ వీధులే..!

గురుబ్రహ్మ..గురుర్విష్ణు..
గురుదేవో మహేశ్వర..
ఆ రోజులకు కాలం చెల్లి..
గురు సాక్షాత్ సర్వకర్మ
తస్మైశ్రీ గురవే ఖర్మ ఖర్మ..!

మీ చదువు..మీ పరువు..
మీ పట్టాలు..
ఈ చట్టాల ముందు
పుచ్చిపోయిన గొట్టాలు..
మాస్టారూ..
మీ మర్యాద..మన్నన
నేలమట్టాలు..!

అదిగదిగో..
బడి గేటు ముందు బంట్రోతు
తరగతి గదిలో
మరో బంటురోతు..
రాజకీయ నాయకుల ముందు రోజూ
మీ బానిసత్వపు కవాతు..
అయ్యోరిప్పుడు చేతులు
నలుపుకునే గుమాస్తా…
మాస్టారని పిలవబడే మేస్తిరి!

మొన్నామధ్య వైన్ షాపుల్లో
మస్తరు వేసినప్పుడే_
ఓ మాస్టారూ..
మా దృష్టిలో
మీరు జీవన్మృతులు..
మీ గొప్పలిప్పుడు గతస్మృతులు..,!

పాఠాలు చెప్పే మీ విధి..
ఇప్పుడెక్కిందిలా వీధి..
సర్వేలు..ఎన్నికలు
అడ్డమాని డ్యూటీలు మీవే
బడిలో చదువులు ఎండమావే..!

జీతాలు చాల్లేదని
సెలవులు తగ్గాయని..
సౌకర్యాలు లేవని
చీటికిమాటికి విధులు
బహిష్కరించే మీరు
కొరగాని పనులు చెప్పినప్పుడు లొల్లి చెయ్యరేమి..
అప్పుడు ఎదిరించని ఫలితమే ఈ బెదరింపులు..
నాటి మీ మొహమాటం
ఇదిగో..ఇప్పుడిలా పాలకుల చేతివాటం!

అయినా అన్నామంటే
అన్నామంటారు గాని..
మీరూ మారాలి సారూ..
అందరూ కాదు గాని.
మీలోనూ కొందరు..
గ్రామాల్లో రాజకీయాలు
రాజకీయ నేతల దగ్గర
గులాముగిరీలు..
స్లేట్లు వదిలి స్టేట్లు దాటి
రియలెస్టేట్లు..ప్లాట్లు..
అదనపు రాబడికై పాట్లు
ఉనికి కోసం నేతల
ఇళ్ళ ముందు కునికిపాట్లు
ఇలా అయితే
మీరు కాదు అలుసు..
పవిత్రమైన మీ వృత్తి..
కాస్త మార్చుకోండి
మీ ప్రవృత్తి..!

సురేష్ కుమార్ ఇ
9948546286