-తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్
టీటీడీలో పని చేస్తున్న దాదాపు 50 మందికి పైగా ఇంజినీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. ఇది ఉద్యోగస్తుల్ని బెదిరించడమే అని ఆయన పేర్కొన్నారు. తక్షణం ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని, మీ పార్లమెంట్ సభ్యుడిగా ఎల్లవేళలా అండగా వుంటానని ఆయన భరోసా ఇచ్చారు.
టీటీడీ ఉన్నతాధికారులు, కూటమి ప్రభుత్వం ఉద్యోగుల వేధింపు విధానాల్ని మానుకోకపోతే పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి కూడా వెనుకాడనని ఆయన హెచ్చరించారు.
ఎవరిపై కోపంతో ఎవర్ని వేధిస్తున్నారు?
రాజకీయంగా ప్రత్యర్థులమైన తమపై కోపంతో, ఉద్యోగుల్ని వేధించడం హేయం అని ఆయన అన్నారు. నెల రోజులుగా విజిలెన్స్ విభాగం టీటీడీలో అణువణువునా శోధించారన్నారు. అయినప్పటికీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం విజిలెన్స్ అధికారులు టీటీడీ ఉద్యోగుల్ని అవమానించేలా, కించపరిచేలా నోటీసులు ఇచ్చారన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న సంస్థ టీటీడీ అని అన్నారు. ఇందుకు కారణం ఉద్యోగుల నిబద్ధతే అని ఆయన ప్రశంసించారు.
వారి సేవల్ని దృష్టిలో పెట్టకుని మా నాయకుడు భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల ఇళ్ల స్థలాల కల నెరవేర్చచిన ఘనత తమ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. అలాగే చిరు ఉద్యోగులకు జీతాలు పెంచి, వారికి న్యాయం చేశారని ఆయన తెలిపారు. అయినప్పటికీ టీటీడీ ఉద్యోగుల్లో మెజార్టీ ఓటర్లు కూటమికి ఏదో ఆశించి అండగా నిలిచిన పుణ్యానికి బహుమానంగా వేధింపులు ఇస్తారా? అని ఆయన నిలదీశారు.
టీటీడీ ఉద్యోగులకు అండగా వుంటా
కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అనూహ్యంగా వేధింపులను ఎదుర్కొంటున్న టీటీడీ ఉద్యోగులకు అండగా వుంటానని, ఎవరూ భయపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పటికైనా టీటీడీ, ప్రభుత్వ తీరు మారకపోతే పార్లమెంట్‌లో గళమెత్తుతానని ఆయన హెచ్చరించారు.