– పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
పటాన్‌చెరులో గెలిచామనే తీపి, మన ప్రభుత్వం రాలేదని చేదు ఉంది. ఇది తీపి చేదుల ఉగాది పచ్చడి. ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉన్నది. కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. మనకు 39 సీట్లు వచ్చాయి. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమైంది.
కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మించారు. విపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కాంగ్రెస్ ఇప్పుడు వాటినే వాడుకుంటోంది. ప్రగతి భవన్‌లో 150 రూములు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే తల కిందికి వేసుకున్నాడు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం. మేమేం తొందరపడడం లేదు. మీరు చెప్పిన తేదీల్లో అమలు కాలేదు కాబట్టే ప్రశ్నిస్తున్నాం. రైతుబంధు ఇస్తున్నామని నేను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి ఆపించారు. కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పింది. వడ్లకు బోనస్ ఇవ్వలేదు.
వృద్ధులకు 4 వేల పింఛన్ ఇస్తామని ఇవ్వలేదు. జనవరిలో 2 వేల పింఛన్ కూడా ఇవ్వలేదు. ఒక నెల పింఛన్ ఎగ్గొట్టారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది.ఇళ్లకు ఉచిత కరెంట్, 15వేల రైతు బంధు, డిసెంబర్ 9న రుణమాఫీ.. ఇలాంటి జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ప్రభుత్వ నిర్ణయంతో 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లను రోడ్డున పడేశారు. పింఛన్ ఎగవేత, రైతుబంధు ఇవ్వకపోడం, మాట ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం కరెంటు కోతలు, కాలిపోతున్న మోటార్లు…కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే.
పదేళ్లు కేంద్రం ఒత్తిడి చేసినా మేం మన ప్రాజెక్టులకు కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బోర్డుకు అప్పగించింది. ఇప్పుడు నీటికి కొరత రాబోతున్నది. ఇండియా విపక్ష కూటమి ముక్కలవుతోంది. కాంగ్రెస్ గెలిచే అకాశం లేదని కూటమి పార్టీలే చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతోంది. కేంద్రంలో కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి హామీలను అమలు చేయడం కష్టమని రేవంత్ చెప్పబోతున్నాడు. అందుకే ఎన్నికల కోడ్ వచ్చే లోపే ఎన్నికల హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ మెడలు వంచి డిమాండ్ చేద్దాం.
ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయాయి.. తెలంగాణలోనూ అదే జరగబోతోంది. కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దానికి వేసే ఓటు నిరుపయోగం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ఢిల్లీలో మన గొంతును బలంగా వినిపించాలంటే పార్లమెంటులో మనకు బలం ఉండాలి. ఎన్నికల్లో సత్తా చూపాలి.
బీజేపీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతోంది. మహిపాల్ అన్న పటాన్‌చెరులో 150 గుళ్లు కట్టించాడు. కేసీఆర్ యాదాద్రి గుడి కట్టించారు. ఆ పేరుతో మేం ఓట్లు అడగలేదు. దేవుడు అందరివాడు. ప్రజలకు ఫలానా మేలు చేశామని బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నది. మన పటాన్‌చెరు, మెదక్ అభివృద్ధి చెందాలంటే కష్టపడి పనిచేయాలి. ఈ అంశాలను ప్రజల్లో చర్చకు పెట్టాలి.